Just NationalLatest News

Dharmasthala : ధర్మస్థల దారుణ రహస్యాలు..

Dharmasthala : కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భక్తులకు పవిత్ర కేంద్రంగా, ప్రశాంతంగా కనిపించే ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయం ఇప్పుడు షాకింగ్ ఆరోపణలతో అట్టుడికిపోతోంది.

Dharmasthala : కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భక్తులకు పవిత్ర కేంద్రంగా, ప్రశాంతంగా కనిపించే ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయం ఇప్పుడు షాకింగ్ ఆరోపణలతో అట్టుడికిపోతోంది. ఒక మాజీ పారిశుధ్య కార్మికుడు చేసిన ప్రకటనలు ఆ పవిత్ర స్థలం(Karnataka Temple)పై భారీ అనుమానాలను పెంచాయి. రహస్య శవాలను పూడ్చిపెట్టడం, లైంగిక దాడులు, హత్యలు,కనిపించకుండా పోవడం.. ఇలాంటి దారుణాలు ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో జరిగాయా? అన్న అనుమానాలు దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇది నిజమా? లేక కేవలం పుకార్లా? అన్న ప్రశ్నలు ప్రజలను కలవరపెడుతున్నాయి.

Dharmasthala

ఈ వివాదానికి ప్రధాన కారణం, ధర్మస్థల ఆలయంలో గతంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి చేసిన ఆరోపణలు దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసాయి. ఆలయ సిబ్బంది ఒత్తిడితో తాను అనేక శవాలను రహస్యంగా పూడ్చిపెట్టానని చెప్పిన అతను.. ఆ శవాలలో కొన్ని, దారుణమైన లైంగిక దాడికి గురైన అమాయక మహిళలు, చిన్నపిల్లలవి అని చెప్పడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

ఈ ప్రకటనలు సుమారు 100 రహస్య శవాలను పూడ్చిపెట్టడం, 400 మంది కనిపించకుండా పోవడం వీరిలో ఎక్కువ మంది మహిళలు, బాలికలు ఉండటం జరిగాయని సూచిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నీ ధర్మస్థల ఆలయ యాజమాన్యం, ముఖ్యంగా స్థానికంగా అపార ప్రభావం కలిగిన ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే (Veerendra Heggade) వంటి వ్యక్తులపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలకు బలమైన ఎవిడెన్స్ లేకపోవడంతో, సమగ్ర, నిష్పక్షపాత విచారణ చేయాల్సిన అవసరం వచ్చింది.

తాను పూడ్చిపెట్టిన స్థలాలను స్వయంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నానని ఆ పారిశుధ్య కార్మికుడు ప్రకటించడం ఈ కేసులో కాస్త ఆశాజనకంగా అన్పించినా.. పోలీసుల స్పందన మాత్రం షాకింగ్‌గా ఉంది. అతని అడ్రస్ తెలియదని, రక్షణ కల్పించలేమని పేర్కొంటూ ఈ కీలక ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు. కోర్టులో ముసుగు ధరించిన సాక్షిగా ఆయన సమర్పించిన సాక్ష్యం, దశాబ్దాలుగా జరిగిన ఈ దారుణాలపై అనేక అంతుచిక్కని ప్రశ్నలను లేవనెత్తుతోంది. పోలీసుల నిర్లక్ష్యం, ఆలస్యం వారిపై నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి.పోలీసులు ఏదైనా దాచిపెడుతున్నారా? అన్న అనుమానాలు రేకెత్తిస్తోంది.

పారిశుధ్య కార్మికుడు జూలై 4న ఫిర్యాదు చేసినా, జూలై 11వ తేదీ వరకు పోలీసులు దీనిపై సరిగా స్పందించలేదు. సాక్షి అందుబాటులో లేడని పోలీసులు చెప్పినా, తాను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని కార్మికుడు చెప్పడం చాలా అనుమానాలకు తావిస్తోంది. ఈ విచారణలో జరుగుతున్న ఆలస్యం వెనుక స్థానిక రాజకీయ ఒత్తిడులు, ఆలయ యాజమాన్య ప్రభావం లేదా పోలీసు వ్యవస్థలోని లోపాలు ఉండవచ్చని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కీలకమైన తవ్వకాలను జరపకపోవడం విచారణ పారదర్శకతపై నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఆలస్యానికి సరైన కారణాలు లేకపోవడంతో, ప్రజల్లో అపనమ్మకం పెరుగుతోంది.

కర్ణాటక ప్రభుత్వం ఈ తీవ్రమైన ఆరోపణలను లోతుగా పరిశీలించడానికి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రణవ్‌ మోహంతి నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. అయినా కూడా ఈ విచారణలో గణనీయమైన పురోగతి కనిపించడం లేదు. సిట్‌ అధికారిని కొందరు న్యాయవాదులు వ్యతిరేకించడం కూడా ఈ వివాదాన్ని మరింత సంక్లిష్టం చేసింది. ఈ వ్యతిరేకత వెనుక స్థానిక రాజకీయ శక్తులు లేదా ఆలయ యాజమాన్యంతో ఉన్న సంబంధాలే కారణమన్న వాదన వినిపిస్తోంది. ఒక పవిత్ర ఆలయం చుట్టూ చేరిన ఈ చీకటి వ్యక్తులు, విచారణను ఆలస్యం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగానే 22 ఏళ్ల క్రితం ధర్మస్థలలో కనిపించకుండా పోయిన సౌజన్య అనే యువతి కేసు మళ్లీ తెరపైకి రావడం ఈ మొత్తం వ్యవహారానికి ఒక ఉద్వేగభరితమైన కోణాన్ని జోడించింది. తన కుమార్తె అదృశ్యం వెనుక జరిగిన దారుణాలను వెల్లడించాలని సౌజన్య తల్లి ఇటీవల మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి, న్యాయం కోసం పోరాడుతానని ప్రకటించింది. ఆమె వాదనలు పారిశుధ్య కార్మికుడు చేసిన ఆరోపణలతో సరిగ్గా సరిపోవడం, ఈ కేసులో మరింత బలాన్ని చేకూర్చింది.

మొత్తంగా, ధర్మస్థల హత్యల వివాదం కేవలం ఒక నేర విచారణ కాకుండా, మతపరమైన విశ్వాసాలు, రాజకీయ శక్తులు, సామాజిక న్యాయం, అసంపూర్తిగా ఉన్న గత దర్యాప్తులు కలగలిసిన ఒక సంక్లిష్టమైన అంశంగా మిగిలింది. అందుకే ప్రభుత్వం వెంటనే తవ్వకాలను ప్రారంభించి, సిట్‌ విచారణను వేగవంతం చేయాలన్న డిమాండ్ పెరుగుతుంది.  సాక్షులకు పూర్తి రక్షణ కల్పించి, నిర్భయంగా ఎవిడెన్స్ సేకరించాలి. అత్యంత పారదర్శకమైన నివేదికలను విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మంజునాథుడి పవిత్ర క్షేత్రంపై అలుముకున్న అనుమానాల మేఘాలు తొలగి, అసలైన న్యాయం నిలబడుతుంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button