Drone: ఏజెన్సీలో డ్రోన్ విప్లవం.. మారుమూల గ్రామాలకు నిమిషాల్లో మందుల సరఫరా!
Drone: ఒక్కో డ్రోన్ దాదాపు 2 కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. వీటిలో వ్యాక్సిన్లు పాడవకుండా ఉండేందుకు 'కోల్డ్ చైన్' (శీతలీకరణ) సదుపాయం కూడా ఉంటుంది
Drone
భారతదేశం సాంకేతికంగా ఎంత ముందుకు వెళ్తున్నా, ఇప్పటికీ మారుమూల పల్లెల్లో సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న గిరిజనుల వ్యధలు వింటూనే ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలలో సరైన రహదారి సౌకర్యం లేక, అత్యవసర సమయంలో అంబులెన్స్ కూడా చేరుకోలేని దుస్థితి ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో గిరిజనుల ప్రాణాలను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాలకు వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యంతో రాష్ట్ర ఆరోగ్య ,వైద్య శాఖ ‘రెడ్ వింగ్’ అనే సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా ఈ డ్రోన్ (Drone)సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
ఈ వినూత్న ప్రాజెక్టు ద్వారా పాడేరు నుంచి దాదాపు 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మారుమూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (PHC) అత్యవసర మందులను, వ్యాక్సిన్లను , రక్తాన్ని డ్రోన్ల (Drone)ద్వారా అతి తక్కువ సమయంలో సరఫరా చేస్తారు. సాధారణంగా కొండ ప్రాంతాలలో 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే రహదారి మార్గంలో గంటల సమయం పడుతుంది.
కానీ ఈ డ్రోన్ల (Drone)ద్వారా కేవలం కొద్ది నిమిషాల్లోనే ప్రాణ రక్షక మందులను పంపవచ్చు. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ వంటి కొండ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని ఇప్పుడు ఏపీలో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ కింద మొదటి ఏడు నెలల పాటు ‘రెడ్ వింగ్’ సంస్థ ఈ సేవలను ఉచితంగా అందించడానికి ముందుకు రావడం విశేషం.

ఈ డ్రోన్ల (Drone)ప్రత్యేకత ఏమిటంటే, ఇవి కేవలం మందులు తీసుకెళ్లడమే కాదు, తిరిగి వచ్చేటప్పుడు రోగుల నుంచి సేకరించిన రక్తం, మల, మూత్ర నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌లకు తీసుకొస్తాయి. దీనివల్ల వ్యాధి నిర్ధారణ ప్రక్రియ వేగవంతం అవుతుంది. కొండ కోనల్లో నివసించే గిరిజనులకు పరీక్షల రిపోర్టుల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు.
ఒక్కో డ్రోన్ దాదాపు 2 కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. వీటిలో వ్యాక్సిన్లు పాడవకుండా ఉండేందుకు ‘కోల్డ్ చైన్’ (శీతలీకరణ) సదుపాయం కూడా ఉంటుంది. భవిష్యత్తులో విశాఖపట్నంలోని కేజీహెచ్ నుండి పాడేరు వరకు కూడా ఈ సేవలను విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
వైద్యం అందక మరణించే దౌర్భాగ్య స్థితిని తొలగించడానికి ఇదొక గొప్ప ముందడుగు. టెక్నాలజీ అనేది సామాన్యుడి ప్రాణం కాపాడటానికి ఉపయోగపడాలి అనడానికి ఇదొక నిదర్శనం. వచ్చే నెలాఖరు నుంచి పాడేరు ఏజెన్సీలో ఈ డ్రోన్లు గాల్లో ఎగురుతూ గిరిజనుల ప్రాణాలకు భరోసా ఇవ్వనున్నాయి. ఇది ఏపీ వైద్య రంగంలో ఒక నవశకానికి నాంది కానుంది.



