Talking rocks: రాత్రుళ్లు మాటలు చెప్పే రాళ్ల రహస్యం
Talking rocks: విల్లోంగ్ ఖులేన్ రహస్య రాళ్లు – మాట్లాడే శిలల గ్రామం..!

Talking rocks
మనిపూర్‌లోని సేనాపతి జిల్లాలోని మారం గ్రామానికి దాదాపు 39 కిలోమీటర్ల దూరంలో ఓ మాయాలోకం ఉన్నట్టుగా అనిపించే ప్రాంతం ఉంది. స్థానికంగా దీనిని విల్లోంగ్ ఖులేన్ (Willong Khullen)అంటారు. మొదట చూస్తే – ఇది కేవలం కొండలు, అడవుల మధ్య ఓ నిశ్శబ్దంగా ఉన్న ఊరిలా అనిపిస్తుంది. కానీ, అక్కడ అడుగుపెడితే… మన కళ్లకు ఎప్పుడూ కనిపించని దృశ్యం ఎదురవుతుంది . నీలాకాశం తాకేలా కనిపించే వెచ్చటి రంగు నిలువు రాళ్ల సమూహం కనువిందు చేస్తుంది.
ఈ రాళ్లు చక్కగా వరుసగా నిలబెట్టబడ్డాయి. ఒక్కొక్క రాయి కనీసం 2 మీటర్లు వెడల్పు, 1 మీటరు మందం ఉండి, ఏకంగా 7 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఇవి తవ్వి నేలలో రెండు మీటర్ల లోతులో దించబడి, పైభాగం బయటకు కనిపించేలా అమర్చబడ్డాయి. ఒక్కో రాయి బరువు 10 టన్నులకు పైగా ఉంటుంది. ఈ స్థాయిలో భారీ రాళ్లను మానవులే ఎలా మోసి, అమర్చారన్నదే అసలైన ప్రశ్న.

ఈ రాళ్ల సంఖ్యను ఎవరూ కచ్చితంగా లెక్కించలేకపోయారు, ఎందుకంటే అవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఇవి హిందూస్తానీ స్టోన్‌హెంజ్(Indian Stonehenge) అని కొందరు అంటారు. కానీ స్థానికులకు మాత్రం వీటికి మరోరకం స్టోరీ కూడా ఉంది.
వీటి వెనుక దాగి ఉన్న కథ మరింత ఆసక్తికరమైనది. పెద్దలు చెబుతున్న కథల ప్రకారం.. ఈ రాళ్లను వేల సంవత్సరాల క్రితం స్థానిక ఆదివాసీల పూర్వీకులు ఏర్పాటు చేశారట. ప్రత్యేకమైన ఆచారాన్ని అనుసరించి, తగిన రాయిని గుర్తించి, ఆ రాయి దగ్గర ఉపవాసంతో పాటు పూజలు చేసి, వైన్ సమర్పించి అనుమతి పొందేవారట. అప్పుడు మాత్రమే ఆ రాయిని తీసుకురావచ్చు అనే నమ్మకం ఉండేదట.
వింత ఏమిటంటే – ఈ రాళ్లకు పేర్లు ఉన్నాయి. “కల”, “కంగ”, “హిల” లాంటి ప్రత్యేక నామాలతో ఒక్కో రాయికి పిలుపు. ఇంకా ఆశ్చర్యంగా ఉందంటే – స్థానికుల నమ్మకం ప్రకారం ఈ రాళ్లు రాత్రిపూట ఒకదానికొకటి మాట్లాడుకుంటాయట(talking rocks). మగ గళంతో, ఒక్కో పేరు తీసుకుంటూ వాటి మధ్య సంభాషణ జరుగుతుందంటారు. ఇది మానవ క్షేత్రానికి అందని ప్రకృతి సంభాషణలా భావిస్తారు.
విల్లోంగ్ ఖులేన్ ..ఇది కేవలం పర్యాటక ప్రదేశం కాదు. ఇది ఒక అజ్ఞాత చరిత్ర, అన్యభావ నమ్మకాల, మరియు ప్రకృతి రహస్యాల కలయిక. పురావస్తు శాస్త్రానికి ఆసక్తి ఉన్నవారికి, లేదా రహస్యమైన ప్రాచీన విశేషాలను తెలుసుకోవాలనుకునేవారికి అసలు మిస్ అవకూడని ప్లేస్ ఇది.