ITR :ఐటీఆర్ ఫైలింగ్‌కు నిన్న కాదు ఈరోజు లాస్ట్ డే .. గడువు పొడిగింపు వెనుక కారణం ఇదే
ITR :ఈ ఏడాది జూలై 31న ఐటీఆర్ దాఖలుకు చివరి తేదీగా మొదట నిర్ణయించారు. అయితే, ఆ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు.

ITR
ఆదాయ పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు విషయంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఊరట కల్పించింది. 2025-26 అంచనా సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ దాఖలు గడువును ఒక రోజు పొడిగిస్తూ సీబీడీటీ కీలక ప్రకటన చేసింది. నిజానికి సెప్టెంబర్ 15తోనే గడువు ముగియగా, చివరి నిమిషంలో ఎదురైన సాంకేతిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో నేడు, సెప్టెంబర్ 16, ఐటీఆర్ దాఖలుకు చివరి రోజుగా మారింది.
ఈ ఏడాది జూలై 31న ఐటీఆర్(ITR) దాఖలుకు చివరి తేదీగా మొదట నిర్ణయించారు. తర్వాత ఆ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. అయితే ఈసారి సెప్టెంబర్ 15న లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఒకేసారి ఐటీ పోర్టల్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించడంతో, పోర్టల్‌పై ఒత్తిడి పెరిగి సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. చాలామంది ఫైల్ చేయలేక ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యల వల్ల, పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం సీబీడీటీ ఒక రోజు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పటివరకు సెప్టెంబర్ 15వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 7.3 కోట్లకు పైగా ఐటీ రిటర్నులు (ITR)దాఖలయ్యాయి. ఇందులో 4 కోట్లకు పైగా రిటర్నుల పరిశీలన ఇప్పటికే పూర్తయినట్లు ఐటీ పోర్టల్ వెల్లడించింది. ఈ సంఖ్య గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా పెరిగింది, ఇది పన్ను చెల్లింపుదారుల పెరుగుతున్న చైతన్యాన్ని సూచిస్తుంది.
సెప్టెంబర్ 16 తర్వాత కూడా ఐటీ రిటర్నులు (ITR)దాఖలు చేయడానికి అవకాశం ఉంది. అయితే, ఇది పెనాల్టీతో కూడిన దాఖలుగా పరిగణించబడుతుంది. డిసెంబర్ 31, 2025 వరకు ఐటీఆర్ సమర్పించడానికి అవకాశం ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం, ఆలస్య రుసుము చెల్లించాలి.
పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షలలోపు ఉంటే రూ.1,000 ఆలస్య రుసుము వర్తిస్తుంది.పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షలు దాటితే రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాలి.సెక్షన్ 234ఏ ప్రకారం, చెల్లించాల్సిన పన్నుపై నెలకు 1 శాతం వడ్డీ కూడా విధిస్తారు. పన్ను చెల్లింపుదారులు ఈ పెనాల్టీలు, వడ్డీలను నివారించడానికి నేడే తమ ఐటీ రిటర్నులను దాఖలు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
One Comment