Indus waters: నెహ్రూ చేసిన ఆ తప్పేంటి? మోదీ ప్రభుత్వం వాదనేంటి ?
Indus waters : శంకర్, సింధు జల ఒప్పందం (Indus Waters Treaty - IWT) ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన, అసాధారణ ఒప్పందంగా అభివర్ణించారు.

Indus waters : రక్తం, నీరు కలిసి ప్రవహించవు..ఈ నినాదమే ఇప్పుడు పాకిస్థాన్‌కు నిద్రపట్టనివ్వడం లేదు. భారత పార్లమెంట్ వేదికగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాక్‌కు ఇచ్చిన ఈ గట్టి హెచ్చరిక ఇరు దేశాల సంబంధాలలో కొత్త అధ్యాయానికి తెరతీసింది. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానేంత వరకు సింధు జల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది. నెహ్రూ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలను మోదీ ప్రభుత్వం సరిదిద్దుతోందని జైశంకర్ బలంగా ప్రకటించారు.
Indus waters
బుధవారం రాజ్యసభ(Rajya Sabha)లో మాట్లాడిన జైశంకర్, సింధు జల ఒప్పందం (Indus Waters Treaty – IWT) ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన, అసాధారణ ఒప్పందంగా అభివర్ణించారు. ఏ దేశమూ తన ప్రధాన నదులపై హక్కులు లేకుండా మరొక దేశానికి నీటిని ప్రవహించడానికి అనుమతించిన దాఖలాలు లేవని ఆయన గుర్తుచేశారు. ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తున్న తరుణంలో, దాని చరిత్రను గుర్తుచేసుకోవడం ఎంతో ముఖ్యమని జైశంకర్(S. Jaishankar) పేర్కొన్నారు. ఈ చారిత్రక విషయాలను గుర్తుచేసుకుంటే కొంతమందికి అసౌకర్యంగా ఉంటుందని, బహుశా వారు గత విషయాలను మర్చిపోయి ఉంటారని పరోక్షంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.
1960లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సింధు జల ఒప్పందంపై చేసిన ప్రకటనను జైశంకర్ ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సభ నీటి సరఫరా లేదా ఇవ్వాల్సిన డబ్బు పరిమాణాన్ని నిర్ణయించాలా అని నేను తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారని జైశంకర్ గుర్తుచేశారు. ప్రజలు దానికి అభ్యంతరం వ్యక్తం చేసినా, నెహ్రూ “పాకిస్తాన్ పంజాబ్ ప్రయోజనాల కోసం ఈ ఒప్పందాన్ని చేయనివ్వండి” అని అన్నట్లు పేర్కొన్నారు. దీంతో నెహ్రూ కశ్మీర్, పంజాబ్ రైతుల గురించి గానీ, రాజస్థాన్ లేదా గుజరాత్ రాష్ట్రాల గురించి గానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని జైశంకర్ విమర్శించారు.
సింధు జల ఒప్పందం, అలాగే ఆర్టికల్ 370 విషయంలో జవహర్‌లాల్ నెహ్రూ చేసిన తప్పులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సరిదిద్దిందని జైశంకర్ బల్లగుద్ది చెప్పారు. పండిట్ నెహ్రూ చేసిన తప్పును సరిదిద్దలేం అనుకున్నారు, కానీ నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వం దానిని సరిదిద్దగలదని చూపించింది. ఆర్టికల్ 370ని సరిదిద్దాం, ఇప్పుడు IWT (సింధు జల ఒప్పందం) విషయంలోనూ అదే చేస్తున్నాం. పాకిస్తాన్ ఉగ్రవాదానికి తన మద్దతును నిలిపివేసినంత వరకు సింధు జల ఒప్పందం నిలిపివేస్తామంటూ జైశంకర్ కుండబద్దలు కొట్టారు. రక్తం, నీరు కలిసి ప్రవహించవని మేం హెచ్చరించాం అంటూ పాకిస్థాన్‌కు మరోసారి గట్టి సందేశం పంపారు.
ఇంతకీ జవహర్ లాల్ నెహ్రూ సమయంలో ఒప్పుకున్న సింధు జలాల ఒప్పందం ప్రకారం ఏముందంటే..1960లో కుదిరిన సింధు జల ఒప్పందం ఆరు నదులను విభజించింది. తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటిపై భారత్‌కు పూర్తి హక్కులు వచ్చాయి. అయితే, భారత్‌లోనే పుట్టే పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నదుల నీటిలో దాదాపు 80% పాకిస్థాన్‌కు కేటాయించారు. భారత్‌కు కేవలం 20% మాత్రమే మిగిలింది. అంతేకాదు, భారత్ తన డ్యాముల్లో పూడిక తీయడానికి కూడా పాకిస్థాన్ అనుమతి తీసుకోవాలనే నిబంధనలు పెట్టారు.
ఇది ఇప్పుడు భారత్ ప్రయోజనాలను, ముఖ్యంగా కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రైతుల నీటి అవసరాలను విస్మరించి, పాకిస్థాన్‌కు ఎక్కువ లాభం చేకూర్చిందని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. శాంతి కోసమంటూ చేసిన ఈ ఒప్పందం తర్వాత కూడా పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదం ఆగకపోవడం కూడా ఒక లోపంగా ప్రస్తావించారు. అయితే సింధు జలాల నిలిపివేత నిర్ణయం పాకిస్థాన్‌ను ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వకుండా ఆపగలదా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.