Vande Bharat : వందేభారత్‌లో పావుగంట ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు!
Vande Bharat : రైలు బయలుదేరే స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత, మధ్యలో ఉన్న స్టేషన్లలో కరెంట్ బుకింగ్ చేసుకోవడం సాధ్యమయ్యేది కాదు.

Vande Bharat
స్పీడు, సౌకర్యం, సమయపాలన… ఈ మూడు కారణాలతో భారతీయ రైల్వేలో కొత్త అధ్యాయం మొదలుపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు ప్రయాణికులకు మరో శుభవార్తను అందించింది. అప్పటికప్పుడు ప్రయాణం ప్లాన్ చేసుకునేవారికి రైల్వే శాఖ ఒక కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై, రైలు స్టేషన్‌కు రాకముందే, కేవలం 15 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే సదుపాయం లభించనుంది.
భారతీయ రైల్వే, వందే భారత్ (Vande Bharat)ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు..ఇకపై, కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణికులు రైలు తమ స్టేషన్‌కు రావడానికి కేవలం 15 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ నిర్ణయం ప్రయాణికులకు సౌకర్యాన్ని పెంచడమే కాకుండా, రైళ్లలో ఖాళీగా ఉన్న సీట్లను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి కూడా సహాయపడుతుంది.
గతంలో, రైలు బయలుదేరే స్టేషన్ నుంచి బయలుదేరిన తర్వాత, మధ్యలో ఉన్న స్టేషన్లలో (రూట్ స్టేషన్లు) కరెంట్ బుకింగ్ చేసుకోవడం సాధ్యమయ్యేది కాదు. దీనివల్ల చాలామంది ప్రయాణికులు చివరి నిమిషంలో టికెట్ దొరకక ఇబ్బంది పడేవారు. అయితే, రైల్వే ప్రయాణీకుల రిజర్వేషన్ సిస్టమ్ (PRS)లో చేసిన మార్పుల ద్వారా ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించింది.
ఈ కొత్త నిబంధన ప్రకారం, ఎంపిక చేసిన వందే భారత్(Vande Bharat) రైళ్లలో ఖాళీగా ఉన్న సీట్లను మధ్యలోని స్టేషన్లలో కూడా, రైలు ఆ స్టేషన్‌కు రావడానికి 15 నిమిషాల ముందు వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ నిర్ణయం ద్వారా, ప్రయాణం అనూహ్యంగా ప్లాన్ చేసుకునేవారికి, మరియు చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సి వచ్చిన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రస్తుతానికి, ఈ సౌకర్యాన్ని ప్రయోగాత్మకంగా దక్షిణ రైల్వే (Southern Railway) జోన్ పరిధిలోని ఎనిమిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అమలు చేస్తున్నారు.
రైలు నం. 20631: మంగళూరు సెంట్రల్ – తిరువనంతపురం సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 20632: తిరువనంతపురం సెంట్రల్ – మంగళూరు సెంట్రల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 20627: చెన్నై ఎగ్మోర్ – నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 20628: నాగర్‌కోయిల్ – చెన్నై ఎగ్మోర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 20642: కోయంబత్తూరు – బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 20646: మంగళూరు సెంట్రల్ – మడ్గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 20671: మదురై – బెంగళూరు కంటోన్మెంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
రైలు నం. 20677: డా.ఎం.జి.ఆర్ చెన్నై సెంట్రల్ – విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ మార్గాలలో మొత్తం 144 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. వేగవంతమైన ప్రయాణం, ఆధునిక సౌకర్యాలు,అద్భుతమైన అనుభవం కారణంగా ఈ రైళ్లు ప్రజలకు చాలా ఫేవరేట్ అయిపోయాయి. రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని భవిష్యత్తులో ఇతర వందే భారత్ రైళ్లకు కూడా విస్తరించే అవకాశం ఉంది.