By-elections:ఎమ్మెల్యేల అనర్హత వేటు..ఉప ఎన్నికలకు తెరలేస్తోందా?
By-elections: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర పేరే వినిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

By-elections
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంటోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని వస్తున్న వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ జాబితాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర పేరే వినిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఒకవేళ స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేస్తే, ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక (By-elections)తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ సుమారు 2.96 లక్షల మందికి పైగా ఓటర్లు ఉండటంతో, ఈ ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉప ఎన్నిక వస్తే దానం నాగేంద్ర తిరిగి కాంగ్రెస్ తరఫున పోటీ చేయవచ్చు. అయితే, ఆయన గెలుపు అంత ఈజీ కాదనే మాట వినిపిస్తోంది.
బస్తీ వాసులతో ఉన్న సాన్నిహిత్యం, స్థానికంగా బలమైన మద్దతు ఆయనకు సానుకూల అంశాలు. కానీ, తరచుగా పార్టీలు మార్చడం, ఆయన అనుచరుల ప్రవర్తనపై వచ్చిన విమర్శలు, స్థానిక సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చూపించడం వంటివి ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. ఇక, బీజేపీ లేదా బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపితే, పోటీ మరింతగా పెరుగుతుంది.
కేవలం దానం నాగేంద్ర మాత్రమే కాదు, పార్టీ మారిన మరో పది మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు కూడా అనిశ్చితిలో ఉంది. వారిలో ముగ్గురిపై స్పీకర్ నుంచి కఠిన చర్యలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించబడితే, కాంగ్రెస్ పార్టీ వారికి తిరిగి టికెట్లు ఇస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే, కాంగ్రెస్‌లో ఇప్పటికే పాత, కొత్త నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ల పంపిణీ విషయంలో మరింత గందరగోళం ఏర్పడొచ్చు.

మరోవైపు, బీఆర్ఎస్ అధినాయకత్వం పార్టీ ఫిరాయించిన వారిపై కఠినంగా వ్యవహరించనుంది. పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ బహిరంగంగా ప్రకటించారు. దీంతో, కాంగ్రెస్ నుంచి టికెట్ లభించక, బీఆర్ఎస్ తలుపులు మూసుకుపోతే, ఈ నేతలు కొత్త రాజకీయ ఆశ్రయం కోసం కష్టపడాల్సి ఉంటుంది.
మొత్తానికి, ఖైరతాబాద్ ఉప ఎన్నికల(by-elections) ప్రక్రియ ప్రారంభమైతే, అది తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీయొచ్చు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, బీఆర్ఎస్ వ్యూహాలు, బీజేపీ అంచనాలు కలిసి, ఖైరతాబాద్ ఉప ఎన్నిక (By-elections)రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన పరీక్షగా మారబోతోందంటున్నారు విశ్లేషకులు.
One Comment