Janasena: పవన్ వ్యాఖ్యలు వక్రీకరించొద్దు.. జనసేన ప్రకటన
Janasena: పవన్ కు తెలంగాణపై అక్కసు ఉంటే హైదరాబాద్ వదిలి ఏపీకి వెళ్ళిపోవాలని సూచించారు.
Janasena
ఏపీ డిప్యూటీ సీఎం జనసేన (Janasena)అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారాన్ని రేపాయి. అసలు ఈ వివాదానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఒక సభలో చేసిన దిష్టి వ్యాఖ్యలు. గోదావరి జిల్లాలు మొత్తం పచ్చదనంతో అందంగా ఉంటాయని.. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజల దిష్టి తగలడమే కారణమంటూ అర్థం వచ్చే విధంగా మాట్లాడారు.
దీంతో ఈ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ఒక్కసారిగా దాడికి దిగారు. పవన్ కళ్యాణ్(Janasena) వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రస్తావిస్తూ.. తెలంగాణ నేతల మాటలు, వాళ్ళ చూపుల వల్లనే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందనే అర్థం వచ్చేలా పవన్ మాట్లాడారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి హోదాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. మీరు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలా చెప్తేనే మీ సినిమాలు తెలంగాణలో కనీసం ఒకటి రెండు రోజులైనా ఆడుతాయి. లేదంటే మీ సినిమాలను తెలంగాణ గడ్డపై అస్సలు ఆడనివ్వం, అడ్డుకుంటాం అని తేల్చి చెప్పారు.

ఒక్కసారి పవన్(Janasena) కామెంట్స్ వివాదం తారస్థాయికి చేరుకోవడంతో ఎట్టకేలకు జనసేన కార్యాలయం స్పందించింది. పవన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. రెండు రాష్ట్రాల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉందని, పవన్ వ్యాఖ్యలను వక్రీకరించొద్దని కోరుతూ ప్రకటనలో పేర్కొంది. అయితే పవన్ వ్యాఖ్యలపై అటు బీఆర్ఎస్ నేతలు కూడా ఫైరయ్యారు.
పవన్ కు తెలంగాణపై అక్కసు ఉంటే హైదరాబాద్ వదిలి ఏపీకి వెళ్ళిపోవాలని సూచించారు. ఇదిలా ఉంటే పవన్ వ్యాఖ్యలపై ఇటు తెలంగాణ బీజేపీ ఇప్పటి వరకూ స్పందించలేదు. అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా దీనిపై మాట్లాడలేదు. మరోవైపు జనసేన (Janasena)నేతలు, పవన్ అభిమానులు మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.
పవన్ కు తెలంగాణ అంటే ప్రత్యేక అభిమానం ఎప్పుడూ ఉందని, గతంలో ఎన్నోసార్లు అక్కడి వారికి కూడా సాయం చేశారని గుర్తు చేస్తున్నారు. అయితే తెలంగాణలో రాజకీయ పార్టీల నేతలు మాత్రం పవన్ పై భగ్గుమంటున్నారు.



