Politics: ఫోటో పాలిటిక్స్‌కు ఎండ్ కార్డ్ లేదా? తమిళనాట నయా చర్చ
Politics: ప్రభుత్వ పథకాల్లో నేతల ముఖచిత్రాల వాడకంపై దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు చర్చలు, వివాదాలు జరుగుతూనే ఉన్నాయి.

Politics
ప్రభుత్వ పథకాల్లో నేతల ముఖచిత్రాల వాడకంపై దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు చర్చలు, వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేయడం కూడా మరోసారి ఈ అంశాన్ని వార్తల్లోకి తెచ్చింది.
అయితే రాజకీయ (Politics) పార్టీలు తమ అధికారంలో ఉన్నంతకాలం ప్రజల సొమ్ముతో ప్రచారం చేసుకోవడమేనా అనేదే ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తోంది.
తాజా కేసు తమిళనాడులో జరిగింది. ఎఐడీఎంకే నేత ఒకరు, సీఎం స్టాలిన్ ఫొటోలు ప్రభుత్వ పథకాలపై ఎందుకు వేస్తున్నారు అంటూ మద్రాస్ హైకోర్టు(Madras High Court)లో పిటిషన్ వేశారు. హైకోర్టు ఒప్పుకుంది. సీఎం పేర్లు, ఫొటోలు ప్రజా పథకాలపై లేకూడదని తేల్చింది.
కానీ డీఎంకే ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ తీర్పును కొట్టివేసింది. ఇలా చూస్తే ఫోటోలకు చట్టబద్ధత వచ్చిందని పొలిటికల్ పార్టీలకి ఆనందంగా ఉన్నా… దీని వెనుక ఉన్న అసలు రాజకీయ లెక్కలు వేరేలా ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్‌లో నాటి జగన్ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నిటిపై.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ ఫొటోలతో(YSR schemes) గట్టిగానే ప్రచారాన్ని చేసుకున్నాయి.
అంతేకాదు మరో రెండాకులు ఎక్కువే చదివినట్లు ఏకంగా అన్నిటికి వైసీపీ కలర్స్ వేయడమే కాకుండా, ప్రతీ చిన్న పథకాన్ని ప్రచారాస్త్రంగానే మార్చుకుని ప్రజాధనాన్ని అప్పటి సీఎం జగన్ దుర్వినియోగం చేశారన్న ఆరోపణలను గట్టిగానే ఫేస్ చేశారు . ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని తొలగించే ప్రయత్నాలు చేస్తోంది.
ఇవన్నీ చూస్తే… అసలు ఇది పరిపాలనా ధోరణి కాదనే చెప్పొచ్చు. ప్రజల సొమ్ముతో, ప్రభుత్వ పథకాలపై, తమ ముఖాలు వేసుకుని ‘నాయకత్వాన్ని’ నొక్కిచెప్పే ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదు.
నిజంగా ప్రజల కోసం సంక్షేమం చేస్తే… వాటిపై నాయకుడి పేరు ఎందుకు? పేరు లేకుండానే పథకం అమలు అయితే ప్రజలు గుర్తుపట్టలేరా? అసలు ఇంటికి మంచినీళ్లు వస్తే, విద్యార్థికి స్కాలర్షిప్ వస్తే… అక్కడ ఏ నాయకుడి ఫొటో ఉన్నా లేకపోయినా.., లబ్దిదారుల జీవితాల్లో మార్పు వస్తుందన్నది ఎందుకు గుర్తు పెట్టుకోవడం లేదు.