KCR : గులాబీ బాస్ రీఎంట్రీతో నిశ్శబ్దం వీడింది.. రేవంత్ సర్కార్‌పై కేసీఆర్ పంచముఖ వ్యూహం ఇదే
KCR : పార్టీలో వారసత్వ పోరు జరుగుతోందని సీనియర్లు కన్ఫ్యూజన్లో ఉన్నారనే వార్తలకు చెక్ పెడుతూ తానే ఇంకా సుప్రీం అని కేసీఆర్ నిరూపించారు.
KCR
తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా వినిపిస్తున్న ఒకే ఒక ప్రశ్న కేసీఆర్ ఎక్కడ? ఆయన మళ్లీ ఎప్పుడు వస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ మైదానంలోకి దిగారు. కేవలం ఒక ప్రెస్ మీట్‌తో ఆయన తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేశారు. నేను ఇంకా గేమ్‌లోనే ఉన్నాను అని చెబుతూనే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. రియల్ ఎస్టేట్ నుంచి నీళ్ల రాజకీయాల వరకు ప్రతి అంశాన్ని స్పృశిస్తూ కేసీఆర్ చేసిన ఈ రీఎంట్రీ వెనుక ఉన్న అసలు వ్యూహాలను ఇప్పుడు విశ్లేషించుకుందాం.
ఫ్యూచర్ సిటీ వెనుక రియల్ ఎస్టేట్ దందా కేసీఆర్(KCR) సంచలన ఆరోపణలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును కేసీఆర్ తనదైన శైలిలో అటాక్ చేశారు. గతంలో తాము ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాలకు వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
చట్టబద్ధంగా ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములను ఇలా వాణిజ్య అవసరాలకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధమని కేసీఆర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి విజన్ ప్రాజెక్టును కేవలం ఒక రియల్ ఎస్టేట్ కుంభకోణంగా బ్రాండింగ్ చేయడం ద్వారా రైతుల సెంటిమెంట్‌ను , యాంటీ రియల్ ఎస్టేట్ భావోద్వేగాన్ని బీఆర్ఎస్ వైపు తిప్పుకోవాలని ఆయన చూస్తున్నారు.

తెలంగాణ ఉద్యమ కాలం నాటి నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదాన్ని కేసీఆర్ మళ్లీ తెరపైకి తెచ్చారు. ముఖ్యంగా కృష్ణా , గోదావరి నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆయన మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం 91 టీఎంసీల కృష్ణా నీళ్లను కేటాయిస్తే.. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలతోనే సరిపెట్టుకుంటామని కేంద్రానికి లేఖ రాయడంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు.
గోదావరి నీళ్లను చంద్రబాబు దోచుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై గ్రామ సభలు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించడం ద్వారా తన పాత ఉద్యమ శైలిని కేడర్ కు గుర్తు చేశారు. శాంతిభద్రతల వైఫల్యం సర్వభ్రష్ట ప్రభుత్వం అంటూ విమర్శలు..హైదరాబాద్ నగరంలో జరుగుతున్న వరుస హత్యలు , గ్యాంగ్ వార్లను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సర్వభ్రష్ట ప్రభుత్వం అని కేసీఆర్ అభివర్ణించారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు.
ఈ విమర్శల ద్వారా అటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచడంతో పాటు ఇటు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వ్యాపార వర్గాల్లో భద్రతా పరమైన భయాలను కలిగించి బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్ క్షేమంగా ఉందని అనిపించేలా కేసీఆర్ ప్లాన్ చేశారు.
కేసీఆర్(KCR) రీఎంట్రీ బీఆర్ఎస్ కు కొత్త ఎనర్జీ.. కేసీఆర్ రాజకీయాలకు దూరమయ్యారని ఆయన రిటైర్డ్ మోడ్ లోకి వెళ్లారని అనుకున్న వారికి ఈ ప్రెస్ మీట్ ఒక గట్టి సమాధానం. పార్టీలో వారసత్వ పోరు జరుగుతోందని సీనియర్లు కన్ఫ్యూజన్లో ఉన్నారనే వార్తలకు చెక్ పెడుతూ తానే ఇంకా సుప్రీం అని కేసీఆర్ నిరూపించారు.
కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవ్వడం ద్వారా అటు కేడర్ లో ఉత్సాహం నింపడంతో పాటు కేటీఆర్ , హరీష్ రావులకు కూడా ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో నీళ్ల సమస్య , ఫ్యూచర్ సిటీ భూముల అంశంపై బీఆర్ఎస్ భారీ ఉద్యమాలకు సిద్ధమవుతోంది.
మొత్తానికి కేసీఆర్(KCR) రీఎంట్రీతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేవంత్ రెడ్డికి అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో కేసీఆర్ నుంచి ఇప్పుడు త్రైముఖ పోరు ఎదురుకాబోతోంది. తన డ్రీమ్ ప్రాజెక్టులను కుంభకోణాలుగా కేసీఆర్ అభివర్ణిస్తుంటే రేవంత్ రెడ్డి దాన్ని ఎలా తిప్పికొడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయాల నుంచి తప్పుకున్నారని అనుకున్న వారందరికీ ఇది ఒక డేంజర్ బెల్ లాంటిది. తెలంగాణ రాజకీయం ఇకపై మరింత హాట్ హాట్ గా మారబోతోంది.



