Nominations: ఆ గ్రామాల్లో నామినేషన్లు నిల్..పోటీ చేయడానికి ముందుకురాని అభ్యర్థులు
Nominations: మొత్తం ఐదు గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవి కోసం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం ఎన్నికల అధికారులను, పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేసింది.
Nominations
తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో, మొదటి విడత ఎన్నికలు జరగనున్న పలు గ్రామ పంచాయతీల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తం ఐదు గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవి కోసం ఒక్క నామినేషన్ (Nominations)కూడా దాఖలు కాకపోవడం ఎన్నికల అధికారులను, పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ ఐదు గ్రామాల్లో అత్యధికంగా మూడు గ్రామాలు మంచిర్యాల జిల్లాలో ఉండగా, నిర్మల్ , ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్కో గ్రామం చొప్పున ఈ పరిస్థితి నెలకొంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చినా కూడా..ఈ గ్రామాల ప్రజలు సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు ముందుకు రాకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
సర్పంచ్ పదవుల మాదిరిగానే, మొత్తం 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, 133 వార్డులకు కూడా ఒక్క నామినేషన్ (Nominations)కూడా దాఖలు కాకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఇందులో కూడా మంచిర్యాల జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఏకంగా 34 వార్డులకు పోటీదారులు లేకుండా పోయారు.
ఆసిఫాబాద్ జిల్లాలో 30 వార్డులు, జనగామలో 10, వికారాబాద్‌లో 19, గద్వాలలో 9, నిర్మల్‌లో ఏడు, ములుగులో నాలుగు వార్డులు నామినేషన్లు (Nominations)లేకుండా మిగిలిపోయాయి. వీటితో పాటు ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో మూడు చొప్పున, భువనగిరి, మెదక్, ఖమ్మం జిల్లాల్లో రెండు చొప్పున, సూర్యాపేట, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున వార్డులు ఖాళీగా ఉన్నాయి.

ఈ నామినేషన్లు (Nominations)దాఖలు కాకపోవడానికి ప్రధానంగా రిజర్వేషన్ల సమస్యలే కారణమని తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో కేవలం పది మంది కూడా లేని సామాజిక వర్గానికి సర్పంచ్ పదవి రిజర్వ్ చేయడంపై మిగిలిన వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందనే భావనతో ఈ వర్గాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మరికొన్ని గ్రామాల్లో, రిజర్వేషన్లు పక్కన పెట్టినా, గ్రామంలోని సమస్యలను పరిష్కరించలేని నిస్సహాయత లేదా వైఫల్యానికి నిరసనగా ప్రజలు నామినేషన్లు వేయడానికి ముందుకు రాలేదు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనబోమని వారు స్పష్టం చేశారు.
మొదటి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, 4,231 గ్రామాలకు 22,330 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యులకుగాను 85,428 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈనెల 3వ తేదీ వరకు గడువు ఉంది. ఆ రోజు సాయంత్రం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.
మరోవైపు, సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ సోమవారం రోజున భారీ కోలాహలం మధ్య జరిగింది. ఉదయం 10 గంటల నుంచే నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, వారి బలపరిచేవారు, మద్దతుదారులు క్యూ కట్టడంతో గ్రామాలు సందడిగా మారాయి. ఈ రెండో విడతలో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.



