AP politics:ఏపీ రాజకీయాల్లో ఆగని’డైలాగ్ వార్’
AP politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'డైలాగ్ వార్'(dialogue war) ఇప్పుడు కామన్ అయిపోయింది.

AP politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘డైలాగ్ వార్'(dialogue war) ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం, ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) తన పర్యటనలపై ఆంక్షలు, తమ పార్టీ కార్యకర్తలపై నమోదవుతున్న కేసులను ప్రస్తావిస్తూ, అధికార పక్షం అణచివేత ధోరణిని ప్రదర్శిస్తోందని ఆరోపిస్తున్నారు.
AP politics
దీనిలో భాగంగానే ‘సినిమా డైలాగ్‌లు’ అనే పాయింట్‌ను జగన్ తెరపైకి తెచ్చారు. తమ పార్టీ కార్యకర్తలు ‘పుష్ప’ సినిమాలోని డైలాగులను పోస్టర్లుగా ప్రదర్శిస్తే కేసులు పెట్టడం సరికాదని ఆయన వాదిస్తున్నారు. అధికార పార్టీ తీరును ప్రశ్నిస్తూ, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ ఇటువంటి ‘మాస్ డైలాగ్‌లు’ ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ, తన పార్టీ కార్యకర్తలు ‘పుష్ప’ సినిమాలోని డైలాగులను పోస్టర్లుగా ప్రదర్శించడాన్ని సమర్థించుకున్నారు. “మా వాళ్లు సినిమాలోని డైలాగులనే పోస్టర్లుగా ప్రదర్శించారు. ఇదేమైనా తప్పా?” అని ప్రశ్నిస్తూ, కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. ఆ డైలాగులు నచ్చకపోతే సినిమాలోంచే తీసేయాలని, సెన్సార్ బోర్డు వాటికి అనుమతి ఎందుకు ఇచ్చిందని నిలదీశారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి హీరోల సినిమాల్లో ఇంతకంటే దారుణమైన డైలాగులు ఉంటాయని జగన్ వ్యాఖ్యానించారు.
ఒక సినిమా డైలాగ్‌ను పోస్టర్‌గా ప్రదర్శించినందుకు 131 మందికి నోటీసులు ఇచ్చి, ఇద్దరిని రిమాండ్‌కు పంపడాన్ని ఆయన తప్పుబట్టారు. “అంత ఇబ్బందిగా ఉంటే అలాంటి డైలాగులు తీసేయండి. ఇక సినిమాలు తియ్యడం ఎందుకు? ఆపేసెయ్యండి. ఏదైనా సినిమా డైలాగులు, పాటలు బాగుంటే అవి ఆదరణ పొందుతాయి. హిట్ అయిన పాట పాడితే, డైలాగ్ చెప్తే తప్పు అంటే ఎలా?” అని ప్రశ్నించారు.
జగన్ పర్యటనలపై ఆంక్షలు, కుట్రల ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తన పర్యటనలకు కుట్రలు చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. “వచ్చే వారిని అడ్డుకోవడం… వచ్చినవారిపై కేసులు పెట్టడం… ఆంక్షలు పెట్టడం, రెచ్చగొట్టడం, అల్లర్లు సృష్టించడం… నా పర్యటనల్లో ఇదే జరుగుతుంది” అని ఆయన అన్నారు.
తనకు జెడ్-ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ, ప్రభుత్వం భద్రత కల్పించడంలో ఒక్క పోలీస్ కూడా సహకరించడం లేదని జగన్ వాపోయారు. “నేను పర్యటనలకు వెళ్తుంటే చంద్రబాబు చేస్తున్న రభస అంతా ఇంతా కాదు. ప్రజలు వస్తుంటే అడ్డుకోవడం… లాఠీ ఛార్జ్ చెయ్యడం… ఇదెక్కడి దుర్మార్గం?” అని ప్రశ్నించారు. వేలాది మంది పోలీసులను తన భద్రత కోసం కాకుండా, ప్రజలను అడ్డుకోవడానికే మోహరిస్తున్నారని జగన్ ఆరోపించారు.
తీవ్రమవుతున్న వాదోపవాదాలు
ఇది కేవలం ఒక సినిమా డైలాగ్ అంశం కాదని, తమను అడ్డుకోవడానికి అధికార పక్షం పన్నుతున్న రాజకీయ కుట్ర అని జగన్ వర్గం అంటోంది. మరోవైపు, అధికార కూటమి వైసీపీ కార్యకర్తలు ‘రప్పా రప్పా’ వంటి హింసాత్మక డైలాగులు వాడటం ద్వారా శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తుంది. ఇది కేవలం ఒక సినిమా డైలాగ్ కాదని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నమని వారి వాదన. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో మరింత హీట్‌ను పెంచుతుందనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఈ ‘డైలాగ్ వార్’ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.