Coconuts:దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా?
Coconuts: దేవుడికి కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న ఆంతర్యం , ఆధ్యాత్మిక భావన ఏమిటో చాలా మందికి తెలియదు.
Coconuts
ఎవరైనా గుడికి వెళ్తే దేవుడికి కొబ్బరికాయ కొట్టడం హిందూ సనాతన ధర్మంలో ఒక ఆనవాయితీగా, అంతర్భాగంగా మారిపోయింది. గుడిలోనే కాకుండా, శుభకార్యానికి, పండగల సమయంలో, భూమి పూజ, కొత్త వాహనాలు కొన్నప్పుడు ఇలా అనేక ముఖ్య సందర్భాల్లో కొబ్బరికాయ కొట్టడం ఒక సంప్రదాయంగా వస్తోంది. దేవుడికి కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్న ఆంతర్యం , ఆధ్యాత్మిక భావన ఏమిటో చాలా మందికి తెలియదు.అయితే కొబ్బరికాయ కొట్టడం వెనుక ఆంతర్యం ఉందని పండితులు చెబుతున్నారు.
కొబ్బరికాయ(Coconuts)ను సాధారణంగా మానవ శరీరానికి ప్రతీకగా చెబుతారు. దీనిలోని భాగాలకు ఈ కింది విధంగా ప్రతీకాత్మక అర్థాలు ఉన్నాయి:
- పైన ఉన్న పీచు (Husk).. ఇది మనిషి అహంకారానికి (Ego) , స్వార్థానికి సంకేతం.
- లోపల ఉన్న కొబ్బరి (Kernel).. ఇది మనిషి మనసుకి , ఆత్మకు ప్రతీక.
- నీరు (Water).. ఇది మనిషిలోని నిర్మలత్వానికి , స్వచ్ఛతకు సంకేతం.
మనిషి తన అహంకారాన్ని (పీచు) విడిచిపెట్టి, తన మనసును , నిర్మలత్వాన్ని పూర్తిగా భగవంతునికి సమర్పించుకుంటున్నా అనే భావన కలగడం కోసం కొబ్బరికాయ కొట్టడం సంప్రదాయంగా మారింది.
అలాగే పూర్వకాలంలో ఆలయాలలో దేవుడికి జంతు బలి, నరబలి వంటి రక్తపాత సంప్రదాయాలు ఉండేవి. ఈ సంప్రదాయానికి ప్రత్యామ్నాయంగానే ఆధ్యాత్మిక గురువు ఆది శంకరాచార్యులు కొబ్బరికాయ కొట్టే సంప్రదాయాన్ని ప్రారంభించారు. అందుకే కొబ్బరికాయను మనుషి తలతో సమానంగా భావిస్తారు. కొబ్బరికాయ కొట్టడం ద్వారా బలికి ప్రత్యామ్నాయంగా వ్యక్తి తనలోని అహంకారాన్ని దేవుడికి త్యాగం చేస్తున్నట్లు భావన.
పాజిటివ్ ఎనర్జీ..

కొబ్బరికాయను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీక అని కూడా అంటారు. కొబ్బరి నీళ్లను అత్యంత పవిత్రంగా భావిస్తారు. కొబ్బరి నీళ్లలో ఉండే సానుకూల శక్తి (Positive Energy) వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీతో పాటు వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే ఇంటి నిర్మాణం, దైవ కార్యాలు, శుభకార్యాల్లో ఈ సంప్రదాయం పాటించడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయని భక్తులు భావిస్తారు.
కొన్నిసార్లు కొబ్బరికాయలో పువ్వు వస్తే, అంతా శుభం జరుగుతుందని నమ్ముతారు. మరికొన్నిసార్లు అది కుళ్లిపోతే చెడుకు సంకేతంగా భావిస్తారు. అయితే, పురాణాల్లో ఇలాంటి నమ్మకాలకు ఎలాంటి ఆధారాలు లేవని పండితులు చెబుతున్నారు. ఇవి కేవలం వ్యక్తిగతమైన అంశాలు ,అపోహలు మాత్రమే అంటున్నారు



