Service of Srivaru:శ్రీవారి సేవలో డాక్టర్లు, నర్సులు.. ఎలా అప్లై చేయాలో చూడండి..
Service of Srivaru: తిరుపతిలోని వేదిక్ యూనివర్సిటీ లేదా స్విమ్స్ ప్రాంగణాల్లో వీరికి ఫ్రీగా వసతి, భోజన సౌకర్యాలు ఉంటాయి. వారి రవాణా ఖర్చులను కూడా టీటీడీయే భరిస్తుంది.
Service of Srivaru
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామికి , దర్శనానికి వచ్చే భక్తులకు సేవలు చేయాలని ఎంతోమంది అనుకుంటారు. అయితే ఇప్పుడు ఈ అవకాశాన్నివైద్య సిబ్బందికి కలిగించింది టీటీడీ. భక్తులకు సేవ చేయడానికి ఇష్టపడే వైద్యులకు, నర్సులకు ఇప్పుడు ఈ అరుదైన అవకాశాన్ని కల్పిస్తోంది.
కేవలం వెంకన్న సన్నిధిలో సేవ(Service of Srivaru) చేయడమే కాదు, రోగులకు ట్రీట్మెంట్ అందించడం కూడా గోవింద సేవ(Service of Srivaru)తో సమానమని భావించి, టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ (BIRD), స్విమ్స్ (SVIMS) ఆస్పత్రుల్లో సేవలందించడం కోసం డాక్టర్లు, నర్సులను ఆహ్వానిస్తోంది. అయితే తమ వృత్తి నైపుణ్యాన్ని స్వామివారి పాదాల చెంత ఉన్న భక్తులకు, ఆపన్నులకు అండగా నిలవాలని అనుకునే వైద్య సిబ్బందికి ఇదొక గొప్ప వేదిక అవుతుంది.
ఈ వినూత్న కార్యక్రమం కింద ఎంపికైన వైద్య నిపుణులు నెలకు సుమారు వారం రోజుల పాటు తిరుపతిలో ఉండి సేవలు అందించొచ్చు. అయితే, ఈ సేవ కేవలం స్వచ్ఛందమైనదే (Voluntary). దీనికి బదులుగా టీటీడీ వారికి అద్భుతమైన సదుపాయాలను కల్పిస్తోంది. తిరుపతిలోని వేదిక్ యూనివర్సిటీ లేదా స్విమ్స్ ప్రాంగణాల్లో వీరికి ఫ్రీగా వసతి, భోజన సౌకర్యాలు ఉంటాయి. వారి రవాణా ఖర్చులను కూడా టీటీడీయే భరిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఇలా సేవ చేసే డాక్టర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు శ్రీవారి ప్రొటోకాల్ దర్శనం పొందే అదృష్టం లభిస్తుంది.
డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు ఇలా ఎవరైనా వైద్య వృత్తికి సంబంధించిన వారు టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోర్టల్‌లో వారి విద్యార్హతలు, పని అనుభవంతో పాటు ఇంతవరకూ వచ్చిన అవార్డులు , ఎలాంటి ప్రత్యేక సేవలు అందించగలరో స్పష్టంగా తెలపాలి. అలా పంపిన వివరాలను స్విమ్స్, బర్డ్ హాస్పిటల్ సీఈవోలు నిశితంగా పరిశీలిస్తారు. ఆ అర్హతలకు తగ్గట్టుగా వారు ఏ తేదీల్లో సేవకు రావచ్చో వారు కన్ఫమ్ చేసి మీకు సమాచారం అందిస్తారు.

ఈ ప్రక్రియనంతా పర్యవేక్షించడానికి టీటీడీ ఒక ప్రత్యేక వైద్య సేవా సెల్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి ప్రముఖ డాక్టర్లు ఎంతోమంది వచ్చి తిరుమల శ్రీవారి సన్నిధిలో తమ సేవలు అందిస్తున్నారు. అంతర్జాతీయ వైద్య బృందాల సూచనలతో ఇప్పుడు ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లను కూడా ఆధునీకరిస్తున్నారు.
అలాగే ఇలా అప్లై చేయాలనుకున్నవారికి ఏవైనా వివరాలు కావాలన్నా లేదా సందేహాలున్నా srivarivaidyasevasvims@gmail.com కు మెయిల్ చేయొచ్చు. మానవ సేవయే మాధవ సేవ అని నమ్మే ప్రతీ వైద్య నిపుణుడు ఈ అవకాశాన్ని వదులుకోకూడదని టీటీడీ కోరుతోంది.



