Just SpiritualLatest News

Jagganna Thota Prabhala Theerdham :ఏకాదశ రుద్రుల వైభవం… 400 ఏళ్ల చరిత్ర.. ప్రభల తీర్థం గురించి తెలుసా ?

Jagganna Thota Prabhala Theerdham : సంక్రాంతి తర్వాత మూడోరోజు జరుపుకునే కనుమ రోజు జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థం ఎంతో ప్రసిద్ధి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడే వేరు.. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి అంటే ఒక ఎమోషన్.. ప్రపంచంలో ఏ మూల ఉన్నా సంక్రాంతికి తమ తమ సొంతూళ్ళకు వచ్చి ఎంతో సరదాగా గడుపుతుంటారు. సంక్రాంతి మూడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో పండుగ.. ఒక్కో విశిష్టత… భోగి , సంక్రాంతి తర్వాత మూడోరోజు జరుపుకునే కనుమ రోజు జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థం ( Jagganna Thota Prabhala Theerdham) ఎంతో ప్రసిద్ధి.

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోట కొబ్బరితోటలో మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు ఈ ప్రభల తీర్థం అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనికి ఉన్న చరిత్ర మామూలుది కాదు. ఏకంగా 400 ఏళ్ల నుంచీ ప్రభల తీర్థానికి గొప్ప చరిత్ర ఉంది.కోనసీమ చుట్టుపక్కల 11 గ్రామాల ప్రభలు ఈ తీర్థంలో పాలుపంచుకుంటాయి. ఈ తోటని జగ్గన్న తోటగా పిలుస్తారు.

జగ్గన్నతోటలో గుడి గానీ, గోపురం గానీ ఉండదు. అయినా కూడా ఆ స్థలానికి ఎంతో పవిత్రత ఉంది. లోక కళ్యాణార్థం ప్రతీ ఏడాది కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో ( Jagganna Thota Prabhala Theerdham) సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్ధం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ పురాణాలు చెబుతున్నాయి. అప్పటినుండి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్ధం నిర్వహిస్తున్నారు.

జగ్గన్నతోటకి ( Jagganna Thota Prabhala Theerdham) వచ్చే ప్రభలు చుట్టుపక్కల గ్రామాల నుంచే తరలివస్తాయి. గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి , గంగలకుర్రు చెన్నమల్లేశ్వర స్వామి , వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వర స్వామి , ఇరుసుమండ నుంచి ఆనంద రామేశ్వరస్వామి , వక్కలంక నుంచి కాశీ విశ్వేశ్వరస్వామి , పెదపూడి నుంచి మేనకేశ్వరస్వామి , ముక్కామల నుంచి రాఘవేశ్వర స్వామి , మొసలపల్లి నుంచి మధుమానంత భోగేశ్వరస్వామి , నేదునూరు నుంచి చెన్నమల్లేశ్వరస్వామి , పాలగుమ్మి నుంచి చెన్నమల్లేశ్వరస్వామి ,
పుల్లేటికుర్రు నుంచి అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి ప్రభలు జగ్గన్నతోటలో కనుమ రోజు కొలువుతీరతాయి.

Jagganna Thota Prabhala Theerdham
Jagganna Thota Prabhala Theerdham

ఈ ప్రభల తయారీ ప్రత్యేకంగా ఉంటుంది. సంక్రాంతికి 10 రోజుల ముందే ఒక మంచి రోజున ప్రభ తయారీ మొదలు పెడతారు. వెదురు కర్రలతో ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకొచ్చి కొబ్బరి పీచు తాడుతో బలంగా కడతారు. తరువాత వాటిపై రంగు రంగులు వేయడంతో ప్రభ అత్యంత అందంగా తయారవుతుంది.

తర్వాత రంగు రంగుల వస్త్రాలతో,పూలతో అలంకరిస్తారు. దానిపై ఏకాదశరుద్రుల్లో తమతమ గ్రామాలకు చెందిన విగ్రహాలను పెట్టి ప్రభను ఊరేగింపుగా తీసుకొస్తారు. విశేషమేమిటంటే ప్రభలను తీసుకొచ్చే దారిలో కౌశికనది కూడా ఉంటుంది. ముఖ్యంగా గంగలకుర్రు ప్రభను నదిలో నుంచే తడవకుండా తీసుకురావడం ప్రతీసారీ ప్రత్యేకమే. దాదాపు 20 నుంచి 25 మంది కలిస్తే గానీ ప్రభలు పైకి లేపలేరు. ఆయా గ్రామాల ప్రజలు కనుమ రోజున జగ్గన్న తోటకు వచ్చి దర్శించుకుని వెళతారు.

తీర్థం పూర్తయిన తర్వాత వచ్చిన దారిలోనే ప్రభలను తిరిగి తమ తమ గ్రామాలకు తీసుకెళతారు. గ్రామానికి వెళ్లిన తర్వాత రాత్రి ఊరేగింపు కూడా ఉంటుంది. 2023 జనవరి 26న న్యూడిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుపున గణతంత్ర దినోత్సవాలలో ప్రభల తీర్థ శకటం అరుదైన గుర్తింపు పొందింది. కాగా జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని ఇటీవలే ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రభల తీర్థం భారతీయ సంస్కృతికి ప్రతీక అని కొనియాడారు.ఈ ఉత్సవాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Relationships:ప్రాణమిచ్చిన వారే మిమ్మల్ని దూరం పెడుతున్నారా? పాత బంధాల విలువ కోల్పోవడానికి కారణాలేంటి?

Related Articles

Back to top button