Viraja Devi :జాజ్పూర్, ఒడిశా.. తంత్ర శాస్త్రానికి కేంద్రమైన విరజా దేవి ఆలయం!
Viraja Devi :బ్రహ్మాండ పురాణంలో ఉన్న కథనం ప్రకారం, బ్రహ్మదేవుడు బైతరణి నది ఒడ్డున ఒక మహాయజ్ఞం నిర్వహించగా, ఆ యజ్ఞ అగ్ని నుంచి పార్వతిదేవి ప్రత్యక్షమై, తనను "బిరజా" అని పిలవమని కోరింది

Viraja Devi
ఒడిశా రాష్ట్రంలోని జాజ్పూర్ పట్టణంలో వెలిసిన మాతా విరజా (Viraja Devi) (బిరజా) ఆలయం, శక్తిపీఠాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. పురాణాల ప్రకారం, సతీదేవి శరీరంలోని నాభిభాగం (శరీరానికి జీవనాధార కేంద్రం) ఇక్కడ పడింది. ఈ కారణం చేత, ఈ క్షేత్రాన్ని “నాభిగయ” అని కూడా పిలుస్తారు. “విరజా” అనే పేరుకు అర్థం – పాపం, రాగం, దుఃఖం నుంచి విముక్తిని అందించే దేవత. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, తాంత్రిక శాస్త్రానికి, శక్తి ఆరాధనకు ఒక గొప్ప మూల కేంద్రం.
పురాణ చరిత్ర , స్థల మహిమ..బ్రహ్మాండ పురాణంలో ఉన్న కథనం ప్రకారం, బ్రహ్మదేవుడు బైతరణి నది ఒడ్డున ఒక మహాయజ్ఞం నిర్వహించగా, ఆ యజ్ఞ అగ్ని నుంచి పార్వతిదేవి ప్రత్యక్షమై, తనను “బిరజా” అని పిలవమని కోరింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం “విరజా క్షేత్రం”గా ప్రసిద్ధి పొందింది. ఈ క్షేత్రంలో యజ్ఞం చేయడం వల్ల బ్రహ్మదేవుడు మాయాజాలం నుండి విముక్తి పొందాడని చెబుతారు.

దేవత రూపం , పూజా విశేషాలు..విరజా దేవి(Viraja Devi)ని ఈ ఆలయంలో మహిషాసుర మర్దిని రూపంలో పూజిస్తారు. దేవత విగ్రహం ద్విభుజ దుర్గా రూపంలో ఉంది – ఒక చేతిలో మహిషాసురుడి గుండెలను గుచ్చుతూ, మరో చేతితో అతని తోకను లాగుతూ కనిపిస్తుంది. విరజా మాత పూజించే వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోయి, మోక్ష మార్గం సుగమం అవుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ పితృ పూజలు (పిండదానం, తర్పణం, తిథి) నిర్వహిస్తారు. భారతదేశంలోని శక్తిపీఠాలలో ఈ పద్ధతి చాలా అరుదు. గయ , పిఠాపురం లాగే, జాజ్పూర్ కూడా పితృ కార్యాలకు ప్రసిద్ధి.
ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగాలని కోరే భక్తులకు అమ్మవారు అనుగ్రహిస్తుందని నమ్మకం. సమీపంలోని బైతరణి నదిలో స్నానం చేసి దేవిని దర్శిస్తే పుణ్యం అనంతంగా పెరుగుతుందని భక్తులు చెబుతారు. నవరాత్రులలో ఇక్కడ అద్భుతమైన ఉత్సవాలు జరుగుతాయి.
భువనేశ్వరం నుంచి సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాజ్పూర్కు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. కట్టక్, జాజ్పూర్ కేవంఝర్ రోడ్ రైల్వే స్టేషన్లు సమీపంలో ఉన్నాయి.