Atla Taddi: రేపు అట్లతద్ది.. వ్రతం ఎలా చేస్తారు? విశిష్టత ఏంటి?
Atla Taddi: అట్లతద్ది రోజున, తెల్లవారుజామున, ఇంకా చుక్కలు ఆకాశంలో ఉండగానే నిద్ర లేచి, స్నానపానాదులు ముగించుకుంటారు. ఆ తర్వాత ఉపవాసం ప్రారంభించే ముందు పుష్టికరమైన భోజనం చేస్తారు.
Atla Taddi
ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలో వచ్చే తదియ తిథిని అత్యంత భక్తిశ్రద్ధలతో అట్లతద్ది(Atla Taddi) పండుగగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మహిళలు ఈ నోమును ఎంతో ఇష్టంగా జరుపుకుంటే, ఉత్తరాదివారు ఇదే పండుగను కర్వా చౌత్ పేరుతో పాటిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 9వ తేదీన (గురువారం) ఈ తదియ తిథి వచ్చింది.
ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్షు కోసం, వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని జరుపుకుంటారు. అదేవిధంగా, పెళ్లికాని యువతులు తమకు మంచి జీవిత భాగస్వామి లభించాలని కోరుకుంటూ ఈ నోముని ఆచరిస్తారు. ఈ రోజున మహిళలు ఉపవాసం ఉండి, ముఖ్యంగా గౌరీ దేవిని. చంద్రుడిని పూజిస్తారు.
అట్లతద్ది(Atla Taddi)కి ముందు రోజు నుంచే పండుగ సందడి మొదలవుతుంది. మహిళలు తమ పాదాలకు, చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకును ముత్తైదువులకు పంచిపెట్టడం కూడా ఆచారంగా ఉంది. ఇంటిని శుభ్రం చేసి, గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కడతారు.

ఇక అట్లతద్ది రోజున, తెల్లవారుజామున, ఇంకా చుక్కలు ఆకాశంలో ఉండగానే నిద్ర లేచి, స్నానపానాదులు ముగించుకుంటారు. ఆ తర్వాత ఉపవాసం ప్రారంభించే ముందు పుష్టికరమైన భోజనం చేస్తారు. ఈ భోజనంలో ముఖ్యంగా బెండకాయ చింతకాయ కూర, గోంగూర పచ్చడి, పాలు పోసి వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, పెరుగు వంటి ప్రత్యేక వంటకాలతో అన్నం తింటారు. ఈ అన్నం తిన్న తర్వాత, ఉపవాసం మొదలవుతుంది కాబట్టి, విస్తరి ముందే నీరు తాగుతారు. ఆ తర్వాత, సాయంత్రం పూజ ముగిసే వరకు మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా కఠిన ఉపవాసం ఉంటారు. ఉపవాసం తర్వాత చంద్రుడిని చూసి పూజలు నిర్వహించిన తర్వాతే నోము విరమిస్తారు.



