Lord Shiva: పరమశివుడు పులి చర్మాన్నే ఎందుకు ధరిస్తాడు?
Lord Shiva: పులి అత్యంత పరాక్రమానికి, భయంకరమైన శక్తికి ప్రతీక. అలాంటి శక్తివంతమైన జంతువు కూడా శివుడి ముందు నిలబడలేకపోయింది అంటే, ఆయన శక్తికి ఎవరూ సాటి రారని, కాలానికే అధిపతి అని అర్థం.

Lord Shiva
త్రిమూర్తులలో ఒకరైన పరమశివుడిని మనం ఎప్పుడూ ఒంటి నిండా భస్మం పూసుకుని, పులి చర్మాన్ని ధరించి ఉండటం చూస్తుంటాం. అయితే సృష్టి, స్థితి, లయకారకుడైన మహాదేవుడు పులి చర్మాన్నే ఎందుకు ధరిస్తాడనేది చాలామందికి తెలీదు. ఈ ఆచారానికి మన పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది.
ఒకానొకప్పుడు శివుడు(Lord Shiva) దిగంబరుడిగా, ఎటువంటి వస్త్రాలు లేకుండా అరణ్యాలు, స్మశానాలలో సంచరిస్తూ ఉండేవారు. ఒక రోజు ఆయనను చూసిన కొంతమంది మునికాంతలు ఆయన తేజస్సుకి, రూపానికి ముగ్ధులై, ఆయన గురించే ఆలోచిస్తూ ఉంటారు. తమ భార్యల ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన మునులు కోపంతో శివుడిని అంతం చేయాలని నిర్ణయించుకుంటారు.

శివుడిని ఎదుర్కోవడానికి తాపస శక్తిని ఉపయోగించి, ఆయన రోజూ నడిచే దారిలో ఒక పెద్ద పులిని సృష్టించారు. ఆ పులి ఒక్కసారిగా శివుడిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ, కాల స్వరూపుడైన శివుడికి(Lord Shiva) పులి ఏం సాటి? శివుడు ఆ పులిని క్షణాల్లో సంహరించి, దాని చర్మాన్ని వస్త్రంగా ధరించారు. అప్పటి నుంచి, శివుడు పులి చర్మాన్ని తన వస్త్రంగా ధరించడం మొదలుపెట్టారని పురాణాలు చెబుతున్నాయి.
ఈ కథ ద్వారా శివుడు పులి చర్మాన్ని ధరించడం వెనుక ఉన్న లోతైన అర్థం తెలుస్తుంది. పులి అనేది అత్యంత పరాక్రమానికి, భయంకరమైన శక్తికి ప్రతీక. అలాంటి శక్తివంతమైన జంతువు కూడా శివుడి ముందు నిలబడలేకపోయింది అంటే, ఆయన శక్తికి ఎవరూ సాటి రారని, కాలానికే అధిపతి అని అర్థం. అంతేకాకుండా, పులి చర్మం అహంకారాన్ని, దురభిమానాన్ని సూచిస్తుంది. వాటిని జయించి, వాటిని మన అధీనంలో ఉంచుకోవాలన్న సందేశాన్ని కూడా ఇది ఇస్తుంది.