Sharvanam : ఈ శ్రావణంలో ఇలా పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకే..
Sharvanam : ఆధ్యాత్మిక తేజస్సుతో, ఆశీస్సుల జల్లు కురిపిస్తూ శ్రావణ మాసం మన తలుపు తట్టింది.

Sharvanam : ఆధ్యాత్మిక తేజస్సుతో, ఆశీస్సుల జల్లు కురిపిస్తూ శ్రావణ మాసం మన తలుపు తట్టింది. సిరిసంపదలకు అధిష్ఠాన దేవత అయిన లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన ఈ మాసం, మీ ఇంటిని ఐశ్వర్యంతో, ఆనందంతో నింపడానికి ఈ నెల సువర్ణావకాశం. ముఖ్యంగా, ఈ నెలలోని ప్రతి శుక్రవారం మహాలక్ష్మిని ఆహ్వానించే పవిత్ర దినంగా భావిస్తారు. మరి, ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఎలా ఆరాధిస్తే, మీ జీవితంలోకి అష్టైశ్వర్యాలు ప్రవహిస్తాయి? ఆ పూజా రహస్యాలు, అలంకరణ విశేషాలు, దీప కాంతుల ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం…
Sharvanam
లక్ష్మీదేవి స్వచ్ఛతను అత్యంత ఇష్టపడుతుంది. అందుకే, పూజకు ముందు ఇంటిని, ముఖ్యంగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. ఇంటి గుమ్మం వద్ద పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, ఆకర్షణీయమైన ముగ్గులతో అలంకరించండి. ఇవి కేవలం అలంకరణలు కాదు, మీ ఇంటికి లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానించే ఆధ్యాత్మిక చిహ్నాలు. గుమ్మం వద్ద దీపాలు వెలిగించి ‘ద్వారలక్ష్మీ పూజ’ నిర్వహించడం ద్వారా, అమ్మవారికి మీ ఇంటిలో అడుగుపెట్టమని వినయంగా ఆహ్వానం పలకండి.
పూజామందిరంలో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్టించండి. వినాయకుడితో పాటు జ్ఞాన దేవత సరస్వతీ దేవిని కూడా పూజించడం శ్రేయస్కరం. రకరకాల సుగంధభరితమైన పువ్వులతో, పచ్చని నాగ మాలలతో, మెరిసే కాసుల దండలతో అమ్మవారిని అలంకరించండి. పూజామందిరాన్ని వట్టివేర్ల మాలలతో అలంకరించడం వల్ల దివ్యమైన సువాసన వెదజల్లడమే కాదు, ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది.
అలాగే ఐశ్వర్యాన్ని ఆకర్షించేందుకు ‘ఐశ్వర్య దీపం’ లేదా ఉప్పు దీపం వెలిగించడం ఒక పురాతన ఆచారం. కొత్త ఉప్పు ప్యాకెట్‌ను తెచ్చి, దానిని ఒక ప్రమిదలో పోసి, దానిపై ఎరుపు వత్తులతో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. పూజామందిరంలో పసుపు, పచ్చకర్పూరం, జవ్వాది పౌడర్ కలిపిన నీటిని ఒక గాజు గ్లాసులో, ఒక పువ్వుతో పాటు ఉంచండి. ఇది ఆహ్లాదకరమైన సువాసనతో పాటు పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది.
2025లో శ్రావణ మాసం జూలై 25న (శుక్రవారం) ప్రారంభమైంది. మొదటి శుక్రవారమే ఈ మాసం మొదలుకావడం మరింత విశేషం. శ్రావణంలోని ప్రతి శుక్రవారానికీ విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజును శ్రావణ శుక్రవారం(Shravana Fridays) లక్ష్మీ పూజగా జరుపుకుంటారు.
శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం ఆచరించాలని సంకల్పించుకున్నవారికి మూడో శుక్రవారం మంచిదని పండితులు చెబుతున్నారు.ఎందుకంటే తొలి శుక్రవారం అమావాస్య కొంచెం తగులు, మిగులుగా ఉండటంతో ఆ శ్రావణ మాసం ఒకరోజు ముందుగానే వచ్చింది. దీంతో రెండో శుక్రవారం కంటే పౌర్ణమి ముందు వచ్చే మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం( Varalakshmi Vratam) చేసుకుంటే సత్ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు. ఆరోజు వీలు కాని రోజు ఏదొక శుక్రవారం ఈ వ్రతాన్ని జరుపుకోవచ్చు.
ఈ పవిత్ర శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి, ధ్యానంతో ఆరాధిస్తే, మీ కుటుంబంపై ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి వంటి అష్టలక్ష్మిల కటాక్షం తప్పక లభిస్తుంది.