Varalakshmi Vratham: వరలక్ష్మీ వ్రతం: ఈ పద్ధతిలో పూజ చేస్తే అష్టైశ్వర్యాలు మీవే
Varalakshmi Vratham:శ్రావణమాస వరలక్ష్మీ వ్రతం: సౌభాగ్యాన్ని కోరుతూ లక్ష్మీదేవిని పూజించే శుభఘడియ

Varalakshmi Vratham
శ్రావణమాసం మహిళలకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్రవారం రోజున జరుపుకొనే వరలక్ష్మీ వ్రతం అత్యంత విశిష్టమైనది. సౌభాగ్యాన్ని, సుఖ సంతోషాలను, సిరిసంపదలను కోరుతూ మహిళలు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ సంవత్సరం ఆగస్టు 8న జరగనున్న ఈ పండుగ కోసం మహిళలు సిద్ధమవుతున్నారు. ఈ వరలక్ష్మీ వ్రతం(Varalakshmi Vratham) విశిష్టత, పూజా విధానం, కథ(Vratham Katha)ను ఇప్పుడు తెలుసుకుందాం.
స్కంద పురాణం ప్రకారం, స్వయంగా పరమేశ్వరుడు తన అర్ధాంగి పార్వతీదేవికి ఈ వ్రత మహిమను వివరించినట్లు చెబుతారు. లోకంలోని స్త్రీలందరూ అష్టైశ్వర్యాలు, పుత్రపౌత్రాదులు పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని శివుడు పార్వతికి చెప్పారు. ఈ సందర్భంగా శివుడు చారుమతి అనే ఉత్తమ ఇల్లాలి కథను చెప్పాడు. చారుమతి భక్తికి మెచ్చిన మహాలక్ష్మీదేవి ఆమెకు స్వప్నంలో కనిపించి, శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు తనను పూజిస్తే కోరిన వరాలు ఇస్తానని చెబుతుంది. అమ్మ ఆదేశానుసారం చారుమతి వ్రతాన్ని ఆచరించి సకల సంపదలు పొందింది. ఈ కథ విన్న పార్వతి కూడా వ్రతాన్ని చేసి, వరలక్ష్మి కటాక్షానికి పాత్రురాలైందని పురాణ కథనం.

ఈ వ్రత (Varalakshmi Vratham)పూజకు కావలసిన సామాగ్రి చాలా సులభంగా దొరికేవే. పసుపు, కుంకుమ, గంధం, పువ్వులు, పండ్లు, తమలపాకులు, వక్కలు, కొబ్బరి కాయలు, ఎరుపు రంగు వస్త్రం, గాజులు, బియ్యం, నానబెట్టిన శనగలు, తోరాలు, మరియు దీపాలకు అవసరమైన నెయ్యి, కర్పూరం వంటివి సిద్ధం చేసుకోవాలి.
వరలక్ష్మీ పూజా విధానం ఇలా ఉంటుంది: తెల్లవారుజామునే నిద్రలేచి, ఇంటిని శుభ్రం చేసి, తలస్నానం చేసి, పూజా గదిలో పద్మం రంగవల్లి వేసి, పూజా మండపాన్ని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి, కలశ స్థాపన చేయాలి.
కలశంలో పసుపు, కుంకుమ, గంధం, చిల్లర నాణేలు, పువ్వులు వేసి, దానిపై కొబ్బరికాయ ఉంచాలి. తర్వాత కొబ్బరికాయకు జాకెట్ ముంచి, నగలు, పువ్వులతో అమ్మవారి రూపంగా అలంకరించుకోవాలి. అనంతరం పసుపు గణపతిని పూజించి, దీపాలు వెలిగించి, కలశ పూజతో అమ్మవారిని ఆవాహన చేయాలి. అష్టోత్తర శతనామావళి చదువుతూ, ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి.
ఈ వ్రతంలో (Varalakshmi Vratham)మరొక ముఖ్యమైన ఘట్టం తోరగ్రంథి పూజ. తొమ్మిది దారపు పోగులతో తొమ్మిది ముడులు వేసి, మధ్య మధ్యలో పూలు కట్టి తోరం తయారు చేసుకోవాలి. ఈ తోరానికి పూజ చేసి, కుడిచేతికి ధరించాలి. వ్రత కథను చదివిన తర్వాత, అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలు, పరమాన్నం, చలిమిడి వంటి వాటిని నైవేద్యంగా సమర్పించి, కర్పూర నీరాజనం, మంత్రపుష్పం, మంగళహారతితో పూజను ముగించాలి.

పూజ (Puja)పూర్తయిన తర్వాత, ముత్తైదువులకు వాయినం ఇవ్వడం చాలా శుభప్రదం. ఒక ముత్తైదువును మహాలక్ష్మిగా భావించి, పసుపు, కుంకుమ, చీర లేదా జాకెట్ ముక్క, గాజులు, పూలు, నానబెట్టిన శనగలతో తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ వ్రతం ఆచరించిన, కథ విన్న, చదివిన మహిళలకు సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలతో పాటు సంపద లభిస్తాయని ప్రగాఢ నమ్మకం.