India:షేక్ ఆడించిన అభిషేక్ ..భారత్ చేతిలో పాక్ మళ్లీ చిత్తు
India: ఈ మ్యాచ్ లోనూ నో షేక్ హ్యాండ్ వివాదం కొనసాగింది. భారత కెప్టెన్ టాస్ సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు మొన్నటి లానే పాక్ ఆటగాళ్లను పట్టించుకోలేదు.

India win
ఆసియాకప్ లో టీమిండియా దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో లీగ్ స్టేజ్ ను ముగించిన భారత్ సూపర్-4లోనూ శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ కు మళ్లీ దిమ్మతిరిగే పంచ్ ఇచ్చింది. 6 వికెట్ల తేడాతో దాయాది దేశాన్ని చిత్తు చేసింది. గత మ్యాచ్ తో పోలిస్తే కాస్త పోటీ ఇవ్వడం ఒక్కటే పాక్ కు కాస్త రిలీఫ్… కానీ ఓవరాల్ గా మాత్రం టీమిండియాదే(India win) పైచేయిగా నిలిచింది.
టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ పిచ్ కండీషన్స్ దృష్టిలో పెట్టుకుని ఫీల్టింగ్ ఎంచుకున్నాడు. ఊహించినట్టుగానే తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. అర్షదీప్, హర్షిత్ రాణా స్థానాల్లో బుమ్రా, వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చారు. అయితే పాకిస్థాన్ తన ఓపెనింగ్ కాంబినేషన్ మార్చడం కలిసొచ్చింది. ఫఖర్ జమాన్ త్వరగానే ఔటైనా మరో ఓపెనర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. పాక్ బ్యాటర్లు కీలక పార్టనర్ షిప్స్ నెలకొల్పడానికి భారత పేలవ ఫీల్డింగే కారణం.
ఏకంగా మూడు క్యాచ్ లు వదిలేయడంతో సద్వినియోగం చేసుకున్న పాక్ బ్యాటర్లు మంచి టార్గెట్ ఉంచగలిగారు. 20 ఓవర్లలో పాకిస్తాన్ 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రా భారీగా పరుగులిచ్చుకున్నాడు. శివమ్ దూబే 2 వికెట్లు తీయగా.. కుల్దీప్, హార్థిక్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఛేజింగ్ లో ఎప్పటిలానే అభిషేక్ శర్మ దుమ్మురేపాడు. తొలి బంతినే సిక్సర్ గా బాదాడు. అటు గిల్ కూడా ఈ సారి టచ్ లోకి వచ్చేశాడు. గత మూడు మ్యాచ్ లలో పెద్దగా ఆడిన గిల్ పాక్ పై మాత్రం మెరుపులు మెరిపించాడు. ఓపెనర్లు ఇద్దరూ చెరొక వైపు నుంచి రెచ్చిపోవడంతో పాక్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి.
ముఖ్యంగా అభిషేక్ శర్మ పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. గిల్ తో కలిసి తొలి వికెట్ కు 9.5 ఓవర్లలో 105 పరుగుల పార్టనర్ షిప్ సాధించాడు. 28 బంతుల్లోనే 8 ఫోర్లతో 47 రన్స్ చేసిన గిల్ ఔటైన కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ డకౌటయ్యాడు. తర్వాత అభిషేక్ శర్మ 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 రన్స్ కు ఔటవగా.. సంజూ శాంసన్ నిరాశపరిచాడు. తర్వాత హార్థిక్ పాండ్యా., తిలక్ వర్మ మ్యాచ్ ను ఫినిష్ చేశారు. తిలక్ వర్మ 30, హార్థిక్ 7 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు.

ఈ విజయంతో సూపర్ 4 లో బోణీ కొట్టిన భారత్ (India) బుధవారం బంగ్లాదేశ్ తో తలపడనుంది. కాగా ఊహించినట్టుగానే ఈ మ్యాచ్ లోనూ నో షేక్ హ్యాండ్ వివాదం కొనసాగింది. భారతకెప్టెన్ టాస్ సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు మొన్నటి లానే పాక్ ఆటగాళ్లను పట్టించుకోలేదు.