Just SportsLatest News

Aman Rao : కదంతొక్కిన కరీంనగర్ కుర్రాడు.. షమీ, ముకేశ్,ఆకాశ్ దీప్ లకు చుక్కలు

Aman Rao : తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన యువ క్రికెటర్ అమన్ రావు విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపేశాడు

Aman Rao

దేశవాళీ క్రికెట్ లో ఎంత టాలెంట్ ఉందో ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. కొంతమంది యువ ఆటగాళ్ళయితే కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు డొమెస్టిక్ క్రికెట్ లోనూ దుమ్మురేపుతుంటారు. తమ ప్రతిభకు సరైన వేదికగా భావించే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీల్లో సత్తా చాటుతుంటారు. ఈ మధ్య కాలంగా తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లు కూడా అదరగొడుతున్నారు. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ కు చెందిన యువ క్రికెటర్ అమన్ రావు (Aman Rao) విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపేశాడు. ఏకంగా డబుల్ సెంచరీ బాదాడు. అది కూడా భారత బౌలర్లు మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్ వంటి సీనియర్లకు చుక్కలు చూపిస్తూ ద్విశతకం సాధించాడు. బెంగాల్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ తరపున అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 154 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్స్‌లతో 200 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో అతనికి ఇదే తొలి సెంచరీ. ఈ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకుని డబుల్ సెంచరీగా మలిచాడు. మరో విశేషం ఏమిటంటే అమన్ రావు కెరీర్ లో ఇది మూడో లిస్ట్ ఏ మ్యాచ్ మాత్రమే.

Aman Rao
Aman Rao

అమన్ రావు (Aman Rao )దెబ్బకు బెంగాల్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. షమీ 3 వికెట్లు తీసినా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అలాగే మిగిలిన బౌలర్లు ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్, షాబాదజ్ అహ్మద్ లను ఉతికారేశాడు. షమీ, ముకేశ్, ఆకాశ్ ముగ్గురి బౌలింగ్ లో అమన్ రావు ఏకంగా 8 సిక్సర్లు బాదాడు. ఆకాశ్ దీప్ వేసిన ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్సర్ గా కొచ్చి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 65 బంతుల్లో హాఫ్ సెంచరీ, 108 బంతుల్లో సెంచరీ సాధించిన అమన్ రావు తర్వాత 46 బంతుల్లోనే మరో వంద పరుగులు చేశాడు.

ఈ ఇన్నింగ్స్ తో అమన్ రావు (Aman Rao) పలు రికార్డులు నెలకొల్పాడు. లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ద్విశతకం చేసిన 15వ భారత ప్లేయర్ గా నిలిచాడు. అలాగే హైదరాబాద్ తరపున లిస్ట్ ఏ క్రికెట్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గానూ నిలిచాడు. అమర్ రావు విధ్వంసంతో హైదరాబాద్ 352 పరుగుల భారీస్కోర్ చేసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన అమన్ రావు గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్నాడు. ఈ ప్రదర్శలతోనే ఇటీవల మినీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ అమన్ రావును రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button