Aparajita Flowers:మహాశివరాత్రి రోజు శివయ్యకు ఈ ఒక్క పువ్వు సమర్పిస్తే చాలు.. ఆ కష్టాలన్నీ దూరం
Aparajita Flowers: ఈ ఏడాది 2026లో మహాశివరాత్రి పర్వదినాన్ని ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజు జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.
Aparajita Flowers
హిందువులు మహాశివరాత్రిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. శివ-పార్వతుల కళ్యాణం జరిగిన ఈ పవిత్ర దినాన.. భక్తులంతా ఉపవాసం ఉంటూ.. జాగరణలతో లయకారుడిని ఆరాధిస్తారు.
హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం..ఈ ఏడాది మహా శివరాత్రి ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి రోజు అంటే ఫిబ్రవరి 15వ తేదీన వచ్చింది. ఈ తిథి ఫిబ్రవరి 16 వ తేదీ ఉదయం వరకు ఉంటుంది.
అయితే ఈ పవిత్రమైన రోజు శివలింగానికి ఏ పువ్వులు సమర్పించాలి? ఏ పుష్పాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుందనే అంశాలను పురాణాలు వెల్లడించాయి. ముఖ్యంగా శివలింగానికి ‘అపరాజిత’ పువ్వులు (Aparajita Flowers) అంటే శంఖు పుష్పాలంటే అత్యంత ప్రీతి అట. అపరాజిత అంటేనే ఓటమి లేనిది అని అర్థం. ఈ పువ్వులను సమర్పించడం వల్ల భక్తుల జీవితంలోని ఆర్థిక, వృత్తిపరమైన , వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
చాలామంది సంపాదించిన డబ్బు నిలవకపోవడంతో పాటు, అనవసర ఖర్చులతో సతమతమవుతుంటారు. అలాంటి వారు మహాశివరాత్రి రోజు 11 అపరాజిత పువ్వులను(Aparajita Flowers) శివలింగానికి సమర్పించి పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత అందులో కొన్ని పుష్పాలను ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుని, వాటిని నీడలోనే ఆరబెట్టాలి. తర్వాత ఆ పువ్వులను ఒక పవిత్రమైన వస్త్రంలో కట్టి మీ బీరువాలో కానీ డబ్బులు ఉంచే చోట కానీ భద్రపరుచుకోవాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలిగి, అనవసర ఖర్చులు తగ్గి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే వృత్తిపరంగా కెరీర్లో ఎదుగుదల లేకపోయినా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా మహాశివరాత్రి రోజు అపరాజిత పుష్పంతో ఒక చిన్న పరిహారం చేయాలట. ఒక అపరాజిత పువ్వును తీసుకుని శివలింగానికి సమర్పించాక..’ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని 51 సార్లు మనస్ఫూర్తిగా జపించాలట.
ఆ తర్వాత ఆ పువ్వును మీ ఆఫీసులో లేదా పని చేసే చోట ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉంచాలి. దీనివల్ల మహాశివుడి ఆశీస్సులతో ఆటంకాలన్నీ తొలగి, ప్రమోషన్లు లేదా వ్యాపార లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.

పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారు కానీ వివాహం ఆలస్యం అవుతున్న వారు కానీ, రెండు అపరాజిత పుష్పాలను(Aparajita Flowers) ఒక కలశం నీటిలో వేసి, శివలింగానికి ఆ జలంతో అభిషేకం చేయాలి. అభిషేకం పూర్తయ్యాక ఆ పువ్వులను ఇంటికి తెచ్చి పూజా గదిలో ఉంచుకోవాలి. దీని ద్వారా గ్రహ దోషాలు తొలగి, వివాహ ప్రయత్నాలు సానుకూలమవుతాయని పురాణాలలో వివరించారు..
అలాగే విద్యార్థులు , నిరుద్యోగులు విజయం కోసం మహాశివరాత్రి రోజు ఒక అపరాజిత పువ్వును, కొన్ని అక్షింతలను తెల్లటి వస్త్రంలో కట్టి మీ పూజా మందిరంలో 11 రోజులు ఉంచాలి. 11వ రోజు ఆ మూటను తీసుకువెళ్లి.. పారే నదిలో కానీ శుభ్రమైన జలంలో కానీ నిమజ్జనం చేయాలి. ఇలా చేయడం ద్వారా ఏకాగ్రత పెరిగి, చేసే ప్రయత్నాల్లో విజయం లభిస్తుందని పురాణాల మాట.
మొత్తంగా శివయ్యకు అత్యంత ఇష్టమైన ఈ నీలిరంగు పువ్వులు.. కేవలం అలంకరణ మాత్రమే కాదు, మన జీవితంలోని చీకట్లను తొలగించే దివ్య ఔషధాలు అని పురాణాలు వివరిస్తున్నాయి. అందుకే ఈ ఏడాది ఫిబ్రవరి 15న రానున్న శివరాత్రి రోజు ఈ పూలతో శివయ్యను పూజించి మహాదేవుని అనుగ్రహం పొందాలని పండితులు చెబుతున్నారు.



