Mithun Manhas: బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ రేస్..దూసుకొచ్చిన మిథున్ మన్హాస్
Mithun Manhas: బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ రేస్ లో మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్ వంటి వారు పోటీపడుతున్నట్టు వార్తలు వచ్చాయి.

Mithun Manhas
వరల్డ్ క్రికెట్ లోనే రిచ్చెస్ట్ బోర్డు బీసీసీఐకి ప్రెసిడెంట్ గా వ్యవహరించడం అంటే ఆషామాషీ కాదు.. ఒకవిధంగా ఐసీసీనే శాసించే సత్తా ఉన్నది భారత క్రికెట్ బోర్డుకే… అలాంటి బోర్డు అధ్యక్ష పదవి కోసం పోటీ కూడా మామూలుగా ఉండదు. బోర్డు రూల్స్ ప్రకారం ప్రెసిడెంట్ గా ఉండే వ్యక్తికి 70 ఏళ్లు దాటకూడదు.. ఈ కారణంగానే ప్రస్తుత ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ ఇటీవలే తప్పుకున్నారు.
ఆయన స్థానంలో వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. అయితే వచ్చే వారం జరగనున్న వార్షిక సమావేశంలో కొత్త ప్రెసిడెంట్ ను ఎన్నుకోనుండగా.. ఇప్పటికే రేసులో పలువురి పేర్లు వినిపించాయి. మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్ వంటి వారు పోటీపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. సచిన్ ఈ వార్తలను ఖండించగా.. దాదా, భజ్జీ మాత్రం రేసులో నిలిచినట్టు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు ఎవ్వరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. భారత దేశవాళీ క్రికెట్ లో ఢిల్లీ జట్టు సారథిగా వ్యవహరించిన మిథున్ మన్హాస్(Mithun Manhas) బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ గా ఎన్నిక కాబోతున్నాడని సమాచారం. జమ్ము కశ్మీర్‌కు చెందిన 45 ఏళ్ల మన్హాస్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. తన డొమెస్టిక్ కెరీర్ లో 157 మ్యాచ్‌లు ఆడి 9714 పరుగులు చేశాడు. 2007-08 సీజన్ లో ఢిల్లీకి రంజీ ట్రోఫీ టైటిల్‌ను అందించిన ఘనత అతనికి దక్కింది.

అప్పట్లో అతని ప్రదర్శన చూసిన ఎవరికైనా ఇండియాకు ఆడతాడని అనుకున్నారు. కానీ అప్పటి జాతీయ జట్టులో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంగూలీ వంటి ప్లేయర్స్ తో విపరీతమైన పోటీ ఉండడంతో మిథున్ కు అవకాశాలు దక్కలేదు. అయినప్పటకీ దేశవాళీ క్రికెట్ లో ఢిల్లీ తరపున మంచి బ్యాటర్ గా గుర్తింపు పొందాడు. మిథున్ మన్హాస్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్‌డెవిలల్స్, పుణె వారియర్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయకుండానే కెరీర్ ముగించిన మిథున్ అడ్మినిస్ట్రేషన్ లో మాత్రం తనదైన ముద్ర వేశాడు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది. ఈ కారణంగానే గంగూలీ, భజ్జీలను వెనక్కి నెట్టి మిథున్ మన్హాస్(Mithun Manhas) రేసులో ముందున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. వచ్చే వారం జరిగే ఏజీఎంలో ప్రెసిడెంట్ ఎన్నికను ఏకగ్రీవంగా ముగించాలనే ఆలోచనలో బోర్డు ఉంది.
మిథున్ కు పలు కీలక రాష్ట్రాల అసోసియేషన్లు కూడా మధ్ధతున్నట్టు సమాచారం. దీంతో అతని ఎన్నిక లాంఛనమేనని భావిస్తున్నారు. అదే జరిగి బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్ బాధ్యతలు చేపడితే భారత్ కు ఆడకుండానే ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డ్ సృష్టిస్తాడు.
One Comment