Cricket:రుతురాజ్ ఔట్.. పంత్ ఇన్.. రెండో వన్డేకు తుది జట్టు ఇదే
Cricket:రాంచీ వేదికగా భారీస్కోర్ చేసినప్పటకీ చివరి వరకూ సౌతాఫ్రికా పోరాడడంతో చెమటోడ్చి గెలిచింది.
Cricket
తొలి వన్డేలో గెలిచిన టీమిండియా ఇప్పుడు సిరీస్ విజయంపై ఫోకస్ పెట్టింది. రాంచీ వేదికగా భారీస్కోర్ చేసినప్పటకీ చివరి వరకూ సౌతాఫ్రికా పోరాడడంతో చెమటోడ్చి గెలిచింది. కోహ్లి, రోహిత్ అదిరిపోయే బ్యాటింగ్ తోనే ఈ గెలుపు సాధ్యమైంది. అదే సమయంలో మిడిలార్డర్ వైఫల్యం ఇప్పుడు సమస్యగా మారింది. తొలి వన్డేలో అనూహ్యంగా జట్టు(cricket)లో చోటు దక్కించుకున్న-రుతురాజ్ గైక్వాడ్ నిరాశపరిచాడు. ఒకవేళ నాలుగో స్థానంలో అతను కనీసం హాఫ్ సెంచరీ చేసినా మరొక మ్యాచ్ లో అవకాశం దక్కి ఉండేది. అనుకున్న స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయిన రుతురాజ్ గైక్వాడ్ కు మరొక ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి.
అలాగే స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైతం ఫెయిలయ్యాడు. కోచ్ గంభీర్ అతనికి ప్రమోషన్ ఇచ్చి ఐదో స్థానంలో దింపితే సక్సెస్ కాలేకపోయాడు. దీంతో గంభీర్ ప్రయోగాలపై విమర్శలు వస్తున్నాయి. ప్రతీ జట్టుకూ ఎంతో కీలకంగా ఉండే మిడిలార్డర్లో స్పెషలిస్ట్ బ్యాటర్లను దింపకుండా ఎందుకు బౌలింగ్ ఆల్ రౌండర్లకు ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదంటూ పలువురు మాజీలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో వన్డే కోసం భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. రాయ్ పూర్ వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేకు తుది జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.

వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫైనల్ 11లోకి రానున్నాడు. రుతురాజ్ కు మరొక అవకాశమిస్తే మాత్రం వాషింగ్టన్ నుందర్ ప్లేస్ లో పంత్ ను తీసుకునే ఛాన్సుంది. దీంతో దాదాపు ఏడాది తర్వాత పంత్ మళ్లీ వన్డే ఆడబోతున్నాడు. పంత్ తుది జట్టులోకి వస్తే కీపింగ్ బాధ్యతలు అతనికే అప్పగిస్తామని రాహుల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ప్రసిద్ధ కృష్ణ స్థానంలో ఆంధ్రా క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగే ఛాన్సుంది.
ఇదిలా ఉంటే రాంచీ వన్డేలో భారత బౌలింగ్ బలహీనతలు బయటపడ్డాయి. ముఖ్యంగా పేసర్లు అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధకృష్ణ భారీగా పరుగులిచ్చేశారు. వీరిలో హర్షిత్ రాణా ఆరంభంలో వికెట్లు తీసినా పరుగులు ఎక్కువగానే ఇచ్చాడు. అందుకే ప్రధాన పేసర్లకు తోడుగా నితీశ్ ను ఆడిస్తే బాగుంటుందన్న ఆలోచనలో టీమ్ మేనేజ్ మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. బ్యాటింగ్ డెప్త్ కోసం వాషింగ్టన్ సుందర్ ను కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి. ఓవరాల్ గా రెండో వన్డేకు భారత తుది జట్టు(cricket)లో రెండు మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇక రాయ్ పూర్ పిచ్ బ్యాలెన్సింగ్ గా ఉంటుందని అంచనా. అటు పేసర్లకు, ఇటు స్పిన్నర్లతో పాటు బ్యాటర్లకు కూడా సమానంగా అనుకూలించే స్పోర్టింగ్ పిచ్ ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.



