Gambhir: ఫైనల్ 11 సెలక్షన్ అంత ఈజీ కాదు.. విమర్శలకు గంభీర్ కౌంటర్
Gambhir: 15 మంది అత్యుత్తమ ప్లేయర్స్ నుంచి ఫైనల్ 11ను సెలక్ట్ చేయడం అంత ఈజీ కాదన్నాడు.
Gambhir
ఈ మధ్య కాలంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gambhir) తుది జట్టు కూర్పుకు సంబంధించి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ విన్నర్లను పక్కన పెడుతుండడమే ఈ విమర్శలకు కారణం. తాజాగా ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చాడు. 15 మంది అత్యుత్తమ ప్లేయర్స్ నుంచి ఫైనల్ 11ను సెలక్ట్ చేయడం అంత ఈజీ కాదన్నాడు. బయట ఉన్నవాళ్లు మాట్లాడడం సులభమేనని, తుది జట్టు కూర్పు ఎప్పుడూ కష్టమేనని చెప్పాడు. ఇదిలా ఉంటే టీ ట్వంటీ ప్రపంచకప్ కు సమయం దగ్గర పడుతుండడంతో టీమ్ ప్లాన్స్ గురించి మాట్లాడాడు.
తాజాగా ఆస్ట్రేలియాపై సిరీస్ విజయంతో మరోసారి ఈ ఫార్మాట్లో తన ఆధిపత్యం నిరూపించుకుంది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ కు సమయం దగ్గర పడుతోంది. వచ్చే ఏడాది భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీకి కేవలం మూడు నెలలే మిగిలుంది. అయితే అప్పటికీ 15 మంది స్క్వాడ్ లో ఎవరు చోటు దక్కించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే కొన్ని సమస్యలకు ఇంకా పరిష్కారం కూడా దొరకలేదు.
తాజాగా ఇదే విషయాన్ని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gambhir) కూడా అంగీకరించాడు. కొన్ని లక్ష్యాలను ఇంకా పూర్తిగా అందుకోలేడని చెప్పాడు. ఈ సందర్భంగా గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫిటెనెస్ విషయంలో రాజీపడేది లేడని, మెగాటోర్నీకి ప్రతీ ప్లేయర్ 100 శాతం ఫిట్ గా ఉండాల్సిందేనని క్లారిటీ ఇచ్చేశాడు. ఫిట్ గా ఉంటేనే జట్టులో ప్లేస్ ఉంటుంటుందన్న విషయాన్ని తేల్చి చెప్పేశాడు.

ఈ మధ్యకాలంలో భారత క్రికెటర్లకు వరుస గాయాలు, ఫిట్ నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే దీనిపై గంభీర్(Gambhir) ఆటగాళ్లకు ఒక విధంగా వార్నింగ్ ఇచ్చాడు. ఫామ్ తో పాటు ఫిట్ నెస్ ఉంటేనే జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకుంటామని చెప్పాడు. ఇదిలా ఉంటే మెగాటోర్నీలో మరోసారి టైటిల్ ను నిలబెట్టుకోవాలనుకుంటున్న భారత్ కు కొన్ని సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది.
సిరీస్ లు గెలుస్తున్నంత కాలం అతని ఫామ్ గురించి ఎవ్వరూ పట్టించుకోరన్న విషయం అందరికీ తెలుసు. కానీ ప్రపంచకప్ లాంటి టోర్నీకి ముందు భారత కెప్టెన్ ఖచ్చితంగా ఫామ్ అందుకోవాల్సిందే. భారత టీ ట్వంటీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సూర్యకుమార్ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్ లోనూ ఇదే పరిస్థితి. దీంతో స్కై ఫామ్ అందుకునేందుకు ఇంకా రెండు సిరీస్ లు మాత్రమే మిగిలున్నాయి.
మరోవైపు వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ది కూడా ఇదే పరిస్థితి. ఓపెనర్ గా అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న గిల్ షార్ట్ ఫార్మాట్ లో ఫెయిలవుతున్నాడు. ఐపీఎల్ ప్రతీ సీజన్ లోనూ దుమ్మురేపుతున్న ప్రిన్స్ అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. ఇటీవల ఆసీస్ పై నాలుగో టీ20లో 46 రన్స్ చేసినా నిదానంగా ఆడడంపై విమర్శలు వచ్చాయి. దీంతో గిల్ ఫామ్ కూడా కోచ్ గంభీర్ కు టెన్షన్ గా మారింది.



