Just SportsLatest News

U19 World Cup : అండర్ 19 వరల్డ్ కప్ మనదే..ఫైనల్లో ఇంగ్లాండ్ చిత్తు

U19 World Cup : అండర్ 19 క్రికెట్ లో తమకు తిరుగులేదని భారత్ మరోసారి నిరూపించింది. ఏకంగా ఆరోసారి యువ భారత్ ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది.

U19 World Cup

అండర్ 19 క్రికెట్ లో తమకు తిరుగులేదని భారత్ మరోసారి నిరూపించింది. ఏకంగా ఆరోసారి యువ భారత్ ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది. గత ఎడిషన్ లో ఆసీస్ చేతిలో పరాజయంతో తృటిలో చేజారిన టైటిల్ ను ఈ సారి పట్టేసింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో భారత్ అండర్ 19 జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది.

బ్యాటింగ్ లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత, కీలక బ్యాటర్ల మెరుపుల ఫలితంగా భారీస్కోరు చేయడంతోనే ట్రోఫీ ఖాయం చేసుకున్న భారత్ కు ఇంగ్లాండ్ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఆరోసారి భారత్ అండర్ 19 ప్రపంచకప్(U19 World Cup) ను సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ వీలైనంత భారీ టార్గెట్ ను ప్రత్యర్థి ముందుంచడమే లక్ష్యంగా ఆడింది.

సెమీఫైనల్ సెంచరీ హీరో ఆరోన్ జార్జ్ త్వరగానే ఔటైనా మరో ఓపెనర్ , చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ , కెప్టెన్ ఆయుష్ మాత్రే దుమ్మురేపారు. భారీ షాట్లతో ఇంగ్లాండ్ బౌలర్లకు విరుచుకుపడ్డారు. ఇద్దరూ చెరొక ఎండ్ నుంచి రెచ్చిపోయారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి హద్దే లేకుండా పోయింది. కొడితే సిక్సర్ లేకుంటే ఫోర్ అన్న తరహాలో ఆడాడు. మొదట 32 బంతుల్లో హాఫ్ సెంచరీ, తర్వాత 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. తర్వాత 55 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. ఓవరాల్ గా 80 బంతుల్లో 175 పరుగులు చేసిన సూర్యవంశీ జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించాడు.

U19 World Cup
U19 World Cup

తర్వాత కెప్టెన్ ఆయుశ్ మాత్రే హాఫ్ సెంచరీ చేయగా.. కుందు, కనిష్క చౌహాన్ సైతం మెరుపులు మెరిపించారు. దీంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

ఛేజింగ్ లో ఇంగ్లాండ్ అండర్ 19 జట్టు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. తొలి ఓవర్ నుంచే చేతులెత్తేసింది. కీలక బ్యాటర్లందరూ చెప్పుకోదగిన స్కోరు సాధించలేదు. డాకిన్స్ 66 , బెన్ మేయస్ 45 పరుగులు చేయగా.. ఫాల్కనీర్ సెంచరీతో పోరాడాడు. అతనికి సహచరుల నుంచి సరైన సపోర్ట్ లభించలేదు. ఫలితంగా సెంచరీ పూర్తి చేసుకున్నా జట్టును గెలిపించలేకపోయాడు.

ఫాల్కనీర్ విధ్వంసంతోనే ఇంగ్లాండ్ స్కోరు 300 దాటగలిగింది. చివరికి ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అంబరీష్ 3, దేవేంద్రన్ 2 , కనిష్క చౌహాన్ 2 వికెట్లు పడగొట్టారు. దీంతో 1998 తర్వాత అండర్ 19 ప్రపంచకప్(U19 World Cup) గెలవాలనుకున్న ఇంగ్లాండ్ ఆశలు నెరవేరలేదు. ఈ టోర్నీ ఆద్యంతం భారత్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది. ఒక్క ఓటమి లేకుండా ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ గెలిచి తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ ట్రోఫీ కైవసం చేసుకుంది.

Pawan Kalyan:ప్రచారం రద్దు చేసుకున్న పవన్ కళ్యాణ్..ఫలితాలపై ప్రభావం పడుతుందా?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button