IPL 2026: దేశవాళీ ప్రతిభకు కోట్లాభిషేకం.. జాక్ పాట్ కొట్టిన అనామక ఆటగాళ్లు
IPL 2026: ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 10 బంతుల్లోనే 37 రన్స్ (ఓవరాల్ గా లీగ్ లో 112 రన్స్), 9 వికెట్లు తీసి సత్తా చాటాడు.
IPL 2026
దేశవాళీ క్రికెట్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు బీసీసీఐ ఐపీఎల్ (IPL 2026)ను స్టార్ట్ చేసింది. యువ ఆటగాళ్లు ఐపీఎల్ (IPL 2026)లోకి రావడానికి ప్రధాన మార్గం దేశవాళీ క్రికెట్టే. ఈ విషయం మరోసారి రుజువైంది. అబుదాబీలో జరిగిన మినీ వేలంతో దేశవాళీ ప్రతిభకు ఫ్రాంచైజీలు పట్టం కట్టాయి. అద్భుతంగా రాణిస్తున్న పలువురు అనామక ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. కేవలం దేశవాళీ టోర్నీలు రంజీ ట్రోఫీ.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో ప్రదర్శననే పరిగణలోకి తీసుకుని వేలంలో వారిపై కోట్లాది రూపాయలు వెచ్చించాయి. ఈ క్రమంలో నిన్నటి వరకూ ఎవరికీ తెలియని ప్లేయర్స్ రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు. మినీ వేలం(IPL 2026)లో భారీ ధర పలికిన అన్ క్యాప్డ్ ప్లేయర్స్ జాబితాలో ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, అకీబ్ దార్ ఉన్నారు. వీరిలో యూపీకి చెందిన ప్రశాంత్ వీర్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి.
20 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ రూ.30 లక్షల కనీస ధరతోవేలంలోకి రాగా ఫ్రాంచైజీల పోటీతో బిడ్డింగ్ కోట్లాది రూపాయలు వెళ్లింది. జూనియర్ జడేజాగా చెబుతున్న ప్రశాంత్ వీర్ ను రూ.14.20 కోట్లకు చెన్నై నూపర్ కింగ్స్ దక్కించుకుంది. దేశవాళీ క్రికెట్ లో ప్రదర్శనే ప్రశాంత్ వీర్ కు గుర్తింపు తెచ్చింది. యూపీ టీ20 లీగ్ లో ఆడుతూ ఫ్రాంచైజీలను ఆకర్షించాడు.
ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 10 బంతుల్లోనే 37 రన్స్ (ఓవరాల్ గా లీగ్ లో 112 రన్స్), 9 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే చెన్నై తీసుకున్న మరో అన్ క్యాప్డ్ ప్లేయర్ కార్తీక్ శర్మ. రాజస్థాన్ కు చెందిన 19 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ నయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సంచలన ఇన్నింగ్స్ లు ఆడాడు. 12 మ్యాచ్ లలో 334 రన్స్ చేయడంతో పాటు కీపర్ గానూ ఆకట్టుకున్నాడు.

ఫినిషర్ గా భారీ సిక్సర్లు బాదే సామర్థ్యం అతనికి ప్లస్ పాయింట్. అలాగే విజయ్ హజారే ట్రోఫీలోనూ రాజస్థాన్ తరపున 9 మ్యాచ్ లలో 445 పరుగులు చేసాడు. అందుకే కోల్ కతా, హైదరాబాద్, చెన్నై పోటీపడగా.. చివరికి సీఎస్కే రూ.14.20 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ కు చెందిన షేన్ ఆల్ రౌండర్ అకీబ్ నబీ దార్ కూడా రికార్డు ధర పలికాడు.
అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రూ.30 లక్షల కనీస ధరతో వచ్చిన అకీబ్ దార్ కోసం ఫ్రాంచైజీలు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. పదునైన పేస్, బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం ఉండడంతో పేస్ ఆల్ రౌండర్ కోసం చూస్తున్న ఫ్రాంచైజీలు అతని కోసం కోట్లు కుమ్మరించాయి. వేలంలో అకీబ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు సొంతం చేసుకుంది.
దులీప్ ట్రోఫీ చరిత్రలో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన రికార్డ్ అతని సొంతం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్ లలోనే 15 వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో అకీబ్ దార్ ఎకానమీ బాగుండడంతో భారీ ధర పలికాడు. వీరితో పాటు ఆల్ రౌండర్ మంగేశ్ యాదవ్ రూ.5.2 కోట్లు (ఆర్సీబీ), తేజస్వి దాహియా రూ.3 కోట్లు(కేకేఆర్), ముకుల్ చౌదరి రూ.2.6 కోట్లు (లక్నో), నలీల్ అరోరా రూ.1.6 కోట్లు (నన్ రైజర్స్) నుంచి ధర పలికారు.



