Jemimah: జెమీమా అద్భుతః ఆకాశానికెత్తేసిన ఆసీస్ మీడియా
Jemimah:మహిళల వన్డే ప్రపంచకప్(World Cup 2025) సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించడంలో ఆమెదే కీలకపాత్ర.
Jemimah
మన ప్రత్యర్థి మనల్ని పొగిడితే ఆ కిక్కే వేరు.. ప్రస్తుతం భారత మహిళా స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్(Jemimah) కు ఇదే తరహా అనుభవం ఎదురైంది.. సాధారణంగా భారత్ క్రికెటర్లు ఎంత బాగా ఆడినా ఆస్ట్రేలియా మీడియా పెద్దగా పట్టించుకోదు. పైగా ఓడిపోయినప్పుడు, వివాదాలు నెలకొన్నప్పుడు మాత్రం బ్యానర్ కథనాలు రాసి భారత్ పై అక్కసు వెళ్ళగక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. కానీ ఆశ్చర్యకరంగా ఆస్ట్రేలియా మీడియా ఇప్పుడు భారత క్రికెటర్ జెమీమా(Jemimah) జపం చేస్తోంది.
మహిళల వన్డే ప్రపంచకప్(World Cup 2025) సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించడంలో ఆమెదే కీలకపాత్ర. క్లిష్ట పరిస్థితుల్లో సెంచరీ చేసి ఏకంగా 339 పరుగుల భారీ టార్గెట్ ను ఛేజ్ చేయడంలో మ్యాచ్ విన్నర్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్ ను భారత్ మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టింది. జెమీమా ఆడిన ఇన్నింగ్స్ కు మాజీ ఆటగాళ్ళు, అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలో ఆసీస్ మీడియా కూడా చేరింది. తమ జట్టు ఆటతీరును తిట్టిపోస్తూ జెమీమా రోడ్రిగ్స్ ను ఆకాశానికెత్తేసింది.

భారత యువ క్రికెటర్ పై ప్రశంసల జల్లు కురిపించింది. జెమీమా(Jemimah) ఒక అద్భుతం అంటూ బ్యానర్ కథనాలు రాసింది. ఆమె లైఫ్ టైమ్ గుర్తుండే ఇన్నింగ్స్ ఆడిందంటూ ప్రశంసలు కురిపించాయి. అదే సమయంలో తమ కెప్టెన్ హీలీని విమర్శస్తూ కథనాలు ప్రచురించాయి. పలు క్యాచ్ జారవిడిచి మూల్యం చెల్లించుకున్నారంటూ మండిపడ్డాయి. పేలవ ఫీల్డింగ్ ఈ ఓటమికి కారణమని, ముఖ్యంగా జెమీమా క్యాచ్ ను వదిలేయడం కొంపముంచిందని పేర్కొన్నాయి. ఈ మ్యాచ్ లో జెమీమా ఇచ్చిన క్యాచ్ ను హీలీ వదిలేసింది.
సాధారణంగా వికెట్ల వెనుక చురుగ్గా, ఎంతో ఫోకస్ గా ఉండే హీలీ ఇలా క్యాచ్ జారవిడుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. చివరికి ఈ క్యాచ్ డ్రాప్ మ్యాచ్ స్వరూపాన్న మార్చేసింది. ఇక్కడ లైఫ్ పొందిన జెమీమా , హర్మన్ ప్రీత్ కౌర్ తో కలిసి కీలక పార్టనర్ షిప్ తో మ్యాచ్ గెలిపించింది. హర్మన్ ఔటైనప్పటకీ ఒత్తిడిని అధిగమిస్తూ చివరి వరకూ క్రీజులో నిలిచి ఫినిష్ చేసింది. గతంలో ఫామ్ లో ఉన్న ప్రపంచకప్ కు ఎంపిక కాని జెమీమా ఈ సారి జట్టును ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. దీంతో మ్యాచ్ గెలిపించిన తర్వాత తీవ్ర భావోద్వేగానికి గురైన కన్నీళ్ళు పెట్టుకుంది. తనకు అండగా నిలిచిన వారందరకీ థ్యాంక్స్ చెప్పింది.



