Asia Cup: ఎడారి దేశంలో మెగా ఫైట్ ఆసియా కప్ ఫైనల్ కు కౌంట్ డౌన్
Asia Cup: ఫైనల్ మ్యాచ్ లో భారత్ తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. బుమ్రా, శివమ్ దూబే ఫైనల్ ఎలెవన్ లోకి రానుండగా... హార్షిత్ రానా , అర్ష దీప్ సింగ్ బెంచ్ కే పరిమితం కానున్నారు.
Asia Cup
ఆసియా కప్(Asia Cup) తుది అంకానికి చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ , చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో టైటిల్ కోసం తలపడనుంది. ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ కి చేరిన టీమిండియా టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది.
ఈ టోర్నీలో పాక్ తో భారత్ తలపడనుండడం ఇది మూడోసారి. గత రెండు మ్యాచ్ లలో పాక్ ను భారత్ చిత్తు చేసింది. అయితే ఫైనల్ కి ముందు పాక్ జట్టు ఫామ్ లోకి రావడంతో టైటిల్ పోరు ఆసక్తికరంగానే ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఫైనల్లో భారత్ జట్టే హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుస హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపుతున్నాడు.

అయితే మరో ఓపెనర్ గిల్ ఇంకా గాడిన పడలేదు. ఫైనల్లో గిల్ నుంచి ఫాన్స్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. అలాగే సూర్య కుమార్ యాదవ్ కూడా ఫామ్ లోకి రావాల్సి ఉంది. గత మ్యాచ్ లో సంజూ శాంసన్, తిలక్ వర్మ కూడా టచ్ లోకి రావడం అడ్వాంటేజ్. మరోవైపు బౌలింగ్ మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఈ టోర్నీలో అంచనాలు పెట్టుకున్న బుమ్రా నిరాశ పరిచాడు. శ్రీలంకతో మ్యాచ్ లో బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
ఫైనల్ మ్యాచ్ లో భారత్ తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. బుమ్రా, శివమ్ దూబే ఫైనల్ ఎలెవన్ లోకి రానుండగా… హార్షిత్ రానా , అర్ష దీప్ సింగ్ బెంచ్ కే పరిమితం కానున్నారు. అయితే హార్దిక్ పాండ్యా గాయం టీమిండియాకు షాక్ ఇచ్చింది. హార్దిక్ ఫిట్ గా ఉంటాడో లేదో అనేది మ్యాచ్ కు ముందే తెలుస్తుందని బౌలింగ్ కోచ్ మోర్కెల్ చెప్పాడు. ఒకవేళ పాండ్య దూరమైతే మాత్రం అర్ష దీప్ జట్టులో ఉంటాడు.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ జట్టును తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. పైగా ఫైనల్ కు ముందు పాక్ బౌలర్లు ఫామ్ లోకి వచ్చారు. దీంతో మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. 41 ఏళ్ల ఆసియా కప్(Asia Cup) చరిత్రలో భారత్ , పాక్ జట్లు ఫైనల్.లో తలపడనుండడం ఇదే తొలిసారి. కాగా దుబాయి పిచ్ పై చేజింగ్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉండడంతో టాస్ కీలకం కానుంది.



