Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. వన్డేల్లో నెం.1 బ్యాటర్ గా రికార్డ్
Rohit Sharma: ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడమే మిగిలిందన్న విమర్శలు వినిపించాయి.
Rohit Sharma
వరల్డ్ క్రికెట్ లో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన జాబితాలో రోహిత్ అగ్రస్థానం సాధించాడు. తద్వారా లేటు వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ విజయం తర్వాత షార్ట్ ఫార్మాట్ కు, ఇటీవల ఇంగ్లాండ్ టూర్ కు ముందు టెస్ట్ ఫార్మాట్ కూ అతను వీడ్కోలు పలికేశాడు.
ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ(Rohit Sharma)రిటైర్మెంట్ ప్రకటించడమే మిగిలిందన్న విమర్శలు వినిపించాయి. వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్ లో అదరగొట్టాడు. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన హిట్ మ్యాన్ తర్వాత మూడో వన్డేల్లో శతక్కొట్టాడు. సెంచరీతో తనపై వచ్చిన విమర్శలకు ఆటతోనే జవాబిచ్చాడు.
ఆస్ట్రేలియాతో సిరీస్ లో చేసిన ప్రదర్శనతోనే రోహిత్ శర్మ(Rohit Sharma)అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. ఈ సిరీస్ లో 202 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గానూ ఎంపికైన హిట్ మ్యాన్ ఇప్పుడు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ అందుకున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుత కెప్టెన్ శుభమన్ గిల్ ను వెనక్కి నెట్టాడు. రోహిత్ 38 ఏళ్ళ 182 రోజుల వయసులో నెంబర్ వన్ గా నిలిచిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. అలాగే వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకు సాధించిన ఐదో భారత బ్యాటర్ గా కూడా రికార్డు సాధించాడు.

గతంలో సచిన్, ధోనీ, కోహ్లీ, గిల్ ఈ ఘనతను అందుకున్న వారిలో ఉన్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ 781 రేటింగ్ పాయింట్లతో ఉండగా… ఆసీస్ తో సిరీస్ విఫలమైన గిల్ మూడో స్థానానికి పడిపోయాడు. ఆప్ఘనిస్థాన్ కు చెందిన ఇబ్రహీం జడ్రాన్ రెండో స్థానంలోనూ, పాక్ బ్యాటర్ బాబర్ ఆజామ్ నాలుగో స్థానంలోనూ, కివీస్ ఆటగాడు డారిల్ మిఛెల్ ఐదో ర్యాంకులోనూ ఉన్నారు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆరో ప్లేస్ కు పడిపోయాడు.
కాగా లేటు వయసులో నెంబర్ వన్ బ్యాటర్ గా నిలిచిన రోహిత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. వరల్డ్ కప్ ఖచ్చితంగా ఆడతాడంటూ హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఇటీవలే ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టిన రోహిత్ ఏకంగా 15 కిలోలు తగ్గి స్లిమ్ అయ్యాడు. వచ్చే ప్రపంచకప్ గెలిచి కెరీర్ కు ముగింపు పలకాలని రోహిత్ భావిస్తున్నాడు.



