Team India: ఈడెన్ దెబ్బకు యూటర్న్.. రెండో టెస్టుకు పేస్ పిచ్
Team India: ఈడెన్ తరహాలో మరీ రెండోరోజు నుంచే కాకుండా చివరి రెండు లేదా ఒకటిన్నర రోజుల నుంచి స్పిన్ కు అనుకూలించేలా రూపొందిస్తున్నట్టు సమాచారం.
Team India
ఈ మధ్య కాలంలో భారత పిచ్ లపై జరిగింత చర్చ మరెప్పుడూ జరగలేదు. ప్రతీసారి స్పిన్ పిచ్ లతో ప్రత్యర్థులను దెబ్బ కొట్టే టీమిండియా గత ఏడాది కాలంగా తాను చేసుకున్న వ్యూహంలో తామే చిక్కుకుని ఓటములు ఎదుర్కొంటోంది. న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవంతో ఇది మొదలైంది. తాాజాగా ఈడెన్ గార్డెన్స్ లో సౌతాఫ్రికాపై గెలవాల్సిన చేతిలో పరాజయం పాలైంది.
ఈ ఓటమికి కూడా పిచ్ తయారీ కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోనీ బ్యాటర్లను పిచ్ కు అనుగుణంగా రెడీ చేసారా.. తుది జట్టు ఎంపికైనా అలా జరిగిందా అంటే అదీ లేదు..ఫలితంగా సఫారీల చేతిలో చావు దెబ్బ తినాల్సి వచ్చింది. దీంతో తొలి టెస్ట్ ఓటమి తర్వాత అందరి చూపు రెండో టెస్ట్ పిచ్ పై పడింది. ఈడెన్ లో బంతి బాగా గింగిరాలు తిరుగుతూ బ్యాటర్లను చాలా ఇబ్బంది పెట్టింది. భారత్ మేనేజ్ మెంట్ చెప్పినట్టుగానే పిచ్ రెడీ చేసానని క్యూరేటర్ కూడా తేల్చేయడంతో గంభీర్ సమర్థించుకోవడానికి కూడా ఏం లేకుండా పోయింది.
ఇప్పుడు రెండో టెస్టుకు ఆతిథ్యమిస్తున్న గుహావటి పిచ్ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ కోసం నల్లమట్టితో తయారు చేసిన పిచ్ కాకుండా ఎర్రమట్టితో పిచ్ ను రెడీ చేస్తున్నారు. అంటే పేసర్లకు అనుకూలంగా బంతి బౌన్స్ అయ్యేలా ఉంటుంది. అదే సమయంలో భారత్(Team India) కోరుకునే టర్న్ కూడా ఉంటుంది.

కాకుండా ఈడెన్ తరహాలో మరీ రెండోరోజు నుంచే కాకుండా చివరి రెండు లేదా ఒకటిన్నర రోజుల నుంచి స్పిన్ కు అనుకూలించేలా రూపొందిస్తున్నట్టు సమాచారం. నిజానికి తొలి పిచ్ పై చాలా విమర్శలు వచ్చాయి. గెలుపోటములు పక్కన పెడితే మరీ రెండున్నర రోజుల్లోనే మ్యాచ్ లు ముగిసిపోతే టెస్ట్ క్రికెట్ కూడా నాశనమవుతుందని పలువురు మాజీ ఆటగాళ్ళు ఫైర్ అయ్యారు. దీంతో ఇకపై జరిగే టెస్టుల్లో పిచ్ కు సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని బీసీసీఐ కూడా భావిస్తోంది.
కనీసం 4-5 రోజుల్లో మ్యాచ్ ముగిసేలా చూడాలని ఫిక్స్ అయింది. దీనిలో భాగంగానే గుహావటి టెస్టుకు పూర్తిగా స్పోర్టింగ్ పిచ్ ను సిద్ధం చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ మ్యాచ్ భారత్ (Team India)కు అత్యంత కీలకమనే చెప్పాలి. ఎందుకంటే సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టులో గెలవాల్సిందే.
అటు సఫారీలు డ్రా చేసుకున్నా, గెలిచినా కూడా సిరీస్ వారి సొంతమవడమే కాదు భారత్ గడ్డపై సౌతాఫ్రికా చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్స్ రేసులో వెనుకబడిన టీమిండియా(Team India) స్పోర్టింగ్ పిచ్ పై సౌతాఫ్రికా జోరుకు ఏ విధంగా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.



