Just SportsLatest News

Vaibhav Suryavanshi : వైభవ్ కేరాఫ్ విధ్వంసం.. బౌలర్లకు నిద్ర లేని రాత్రులు

Vaibhav Suryavanshi : అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా వైభవ్ నిలిచాడు

Vaibhav Suryavanshi

క్రికెట్ లో ఫార్మాట్ కు తగ్గట్టు ఆడితేనే నిలదొక్కుకుంటారనేది చాలా మంది చెప్పే మాట..నిజమే పరిస్థితులకు అనుగుణంగా ఆడి పరుగులు చేయాల్సి ఉంటుంది.. కానీ కొందరు బ్యాటర్లకు మాత్రం ఇది వర్తించదు…ఎందుకంటే ఏ ఫార్మాట్ అయినా కొందరు దూకుడుగానే ఆడతారు.

ప్రపంచ క్రికెట్ లో చూసుకుంటే వీరేంద్ర సెహ్వాగ్ , జయసూర్య, గిల్ క్రిస్ట్ , మాథ్యూ హెడెన్ వంటి ఆటగాళ్లు మూడు ఫార్మాట్ లలో ఒకేలా ఆడతారు. ప్రస్తుతం అండర్ 19 క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కూడా ఇదే కోవలోకి వస్తాడు. ఫార్మాట్ తో సంబంధం లేదు.. పిచ్ లతో అసలు సంబంధం లేదు.. ఎక్కడ ఆడుతున్నామన్నది కూడా అనవసరం..బంతి పడితే బాదడమే.. ఒక్క మాటలో చెప్పాలంటే వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు.

ఓ టాలీవుడ్ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఆడు మగాడ్రా బుజ్జీ.. అన్న తరహాలో స్వదేశంలో ఆడుతున్నా, విదేశాల్లో ఆడుతున్నా.. దేశవాళీ క్రికెట్ అయినా, ఐపీఎల్ అయినా, ద్వైపాక్షిక సిరీస్ అయినా, అండర్ 19 ప్రపంచకప్ అయినా ఒకటే మంత్రం.. విధ్వంసకర ఇన్నింగ్సే లక్ష్యం.. ప్రస్తుతం జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ లో వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi )విధ్వంసం మామూలుగా లేదు. పలు మ్యాచ్ లలో అర్థశతకాలు బాదిన ఈ చిచ్చర పిడుగు టైటిల్ పోరులో మాత్రం మరింతగా రెచ్చిపోయాడు.

ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. కొడితే సిక్సర్ లేకుంటే బౌండరీ అన్న తరహాలో అతని విధ్వంసం సాగింది. 32 బంతుల్లో 50, 55 బంతుల్లో 100, 71 బంతుల్లో 150.. చివరికి 80 బంతుల్లో 175 పరుగులు.. ఇదీ నాలుగు ముక్కల్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సునామీ ఇన్నింగ్స్ గురించి.. అతని విధ్వంసకర బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ ఆటగాళ్లు బిత్తరపోయారు. బంతి ఎలా వేసినా బాదేస్తుంటే బౌలింగ్ చేసేందుకు కూడా భయపడినట్టు కనిపించింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వైభవ్ సూర్యవంశీ చేసిన 175 పరుగుల్లో 150 రన్స్ బౌండరీలు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి.

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

వైభవ్ దెబ్బకు పలు రికార్డులు బద్దలయ్యాయి. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. 14 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఈ ఫీట్ సాధించాడు. ఐసీసీ టోర్నీల చరిత్రలో ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గానూ నిలిచాడు. పురుషుల, మహిళల ఐసీసీ టోర్నీల ఫైనల్లోనూ వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా ఎవరూ సెంచరీ సాధించలేదు.

అండర్ 19 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగంగా శతకం బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా కూడా నిలిచాడు. ఈ ఫీట్ సాదించిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. ఇక యూత్ వన్డేల్లో 110 సిక్సర్లు బాదిన బ్యాటర్ గా రికార్డులకెక్కాడు.

Women:భయపెడుతున్న అమ్మాయిలు మిస్సింగ్ లెక్కలు.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button