Virat Kohli: విరాట పర్వానికి అడ్డేది.. రెండో వన్డేల్లోనూ శతక్కొట్టిన కోహ్లీ
Virat Kohli
Virat Kohli
వింటేజ్ కోహ్లీ (Virat Kohli)రెచ్చిపోతున్నాడు…తన ఫామ్ పై వస్తున్న అనుమానాలకు పూర్తిగా తెరదించేశాడు. తొలి వన్డేలో సెంచరీ చేసినా కోహ్లీ తాజాగా రెండో మ్యాచ్ లోనూ దుమ్మురేపాడు. సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తూ మరో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రాక్టీస్ కంటే మానసికంగానే స్ట్రాంగ్ ఉండేందుకే ప్రాధాన్యత ఇస్తానని ఇటీవలే కోహ్లీ చెప్పాడు. దానికి తగ్గట్టే జట్టులో హెడ్ కోచ్ గంభీర్ తో కోల్డ్ వార్ నడుస్తున్న వేళ వరుసగా రెండో సెంచరీ చేయడం అతని మానసిక బలాన్ని చాటిచెబుతోంది.
కేవలం కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(rohit)లను చూసేందుకే రాయ్ పూర్ వన్డే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. రోహిత్ 14 పరుగులకే ఔటై నిరాశపరిచినప్పటకీ.. రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు. సఫారీ బౌలర్లను చెరొక వైపు నుంచి ఆటాడుకున్నారు. ముఖ్యంగా కోహ్లీ మరోసారి తన క్లాసిక్ షాట్లతో అలరించాడు. ఒకప్పటి విరాట్ ను గుర్తు చేస్తూ సొగసైన షాట్లతో అసలు సిసలు వన్డే బ్యాటింగ్ మజాను అభిమానులకు రుచి చూపించాడు.
నిజానికి ఆసీస్ టూర్ తొలి రెండు వన్డేల్లో డకౌటైన తర్వాత కోహ్లీ పనైపోయినట్టేనని అంతా అనుకున్నారు, ఇక వన్డేలకు కూడా రిటైర్మెంట్ ఇచ్చేయొచ్చంటూ కొందరు వ్యాఖ్యానించారు కూడా.. అలా అనుకుంటే కోహ్లీ ఎందుకవుతాడు… తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉందని గతంలోనే చెప్పిన విరాట్ 2027 వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

అప్పటి వరకూ ఫిట్ నెస్ విషయంలో ఢోకా లేకున్నా.. ఫామ్ మాత్రం కొనసాగించాల్సిందే. దీని కోసం దేశవాళీ క్రికెట్ కూడా ఆడాల్సిందే.. ఇలాంటి పరిస్థితుల్లో ఆడిన ప్రతీ మ్యాచ్ లోనూ కీలక ఇన్నింగ్స్ లు ఆడాల్సిందే. ఈ క్రమంలో రాంఛీలో సెంచరీ బాదిన విరాట్ ఇప్పుడు రాయ్ పూర్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి మూడో వికెట్ కు 195 పరుగులు జోడించాడు.
ఈ మ్యాచ్ లో సెంచరీ ముంగిట కూడా విరాట్ దూకుడుగానే ఆడడం హైలెట్ గెలిచింది. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 90 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. వన్డేల్లో కోహ్లీకి ఇది 53వ సెంచరీ. అలాగే వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు ప్రస్తుతం కోహ్లీ పేరిటే ఉంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 93 బంతులు ఎదుర్కొని 102 పరుగులు చేశాడు.కాగా వరుసగా రెండు వన్డే మ్యాచ్‌ల్లోనూ శతకం చేయడం కోహ్లీ కెరీర్‌లో ఇది 11వ సారి. కోహ్లీ ఫామ్ చూసిన అభిమానులు ఇక విరాట పర్వానికి అడ్డేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



