Toll Tax:వాహనదారులకు కేంద్రం భారీ ఊరట..టోల్ టాక్స్‌లో భారీ తగ్గింపు
Toll Tax: నిర్దేశించిన టోల్ ధరలో 30 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఏకంగా 70 శాతం వరకు తగ్గింపు లభిస్తుందన్నమాట.
Toll Tax
నేషనల్ హైవేలపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సాధారణంగా నేషనల్ హైవేలపై ప్రయాణించేటప్పుడు రోడ్డు పనులు జరుగుతున్నా, ట్రాఫిక్ జామ్‌లు ఉన్నా, దుమ్ము ధూళితో ఇబ్బంది పడుతున్నా.. పూర్తి స్థాయిలో టోల్ ట్యాక్స్(Toll Tax) చెల్లించాల్సి వచ్చేది.
దీనిపై సామాన్యుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ 2008 నాటి టోల్ నియమాలను సవరించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, వాహనదారులకు భారీగానే ఆర్థిక వెసులుబాటు కల్పించబోతున్నారు.
ముఖ్యంగా 2 లైన్ల జాతీయ రహదారిని 4 లైన్లుగా లేదా అంతకంటే ఎక్కువ వెడల్పు చేసే పనులు జరుగుతున్నప్పుడు, ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కూడా వాహనదారులు పూర్తి టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. కేవలం నిర్దేశించిన టోల్ ధరలో 30 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఏకంగా 70 శాతం వరకు తగ్గింపు లభిస్తుందన్నమాట.
ఇదే కాకుండా, ఇప్పటికే 4 లైన్లుగా ఉన్న రహదారిని 6 లేదా 8 లైన్లుగా మారుస్తున్న సందర్భంలో కూడా ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుంది. అటువంటి సమయంలో టోల్ ట్యాక్స్(Toll Tax)పై 25 శాతం తగ్గింపు అమల్లో ఉంటుంది. అంటే డ్రైవర్లు 75 శాతం టోల్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ఈ కొత్త నియమాలు 2026 న్యూ ఇయర్ ప్రారంభం నుంచే అమల్లోకి వచ్చాయి. ఇది కేవలం కొత్తగా మొదలయ్యే ప్రాజెక్టులకే కాకుండా, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న అన్ని జాతీయ రహదారులకు కూడా వర్తిస్తుంది. అధికారుల అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 30 వేల కిలోమీటర్ల రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక హైవే నిర్మాణానికి అయిన ఖర్చు పూర్తిగా వసూలైన తర్వాత, అక్కడ కేవలం 40 శాతం టోల్ మాత్రమే వసూలు చేయాలని ఇప్పటికే నిబంధన ఉంది. ఇప్పుడు ఈ కొత్త మార్పులతో ప్రయాణికులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది. సరుకు రవాణాను వేగవంతం చేస్తూనే, ప్రయాణికుల అసౌకర్యానికి నష్టపరిహారంగా ఈ తగ్గింపును ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయమే.
Kalbelia:ప్రపంచం మెచ్చిన కళాకారులు..చనిపోతే ఆరడుగుల భూమికి నోచుకోని నిర్భాగ్యులు ..ఇంతకీ వాళ్లెవరు?



