Just SportsJust Telangana

Shubman Gill: కమ్ బ్యాక్ ఇస్తాడా? గిల్ టీ20 కెరీర్‌పై చర్చ

Shubman Gill: నిజమే గిల్ రీఎంట్రీ ఇచ్చేందుకు ఐపీఎల్ రూపంలో మరో చక్కని అవకాశం ఎదురుచూస్తోంది.

Shubman Gill

టీ ట్వంటీ ప్రపంచకప్ కు జట్టును ప్రకటించే ముందు వరకూ ఎటువంటి సంచలనాలు ఉండే అవకాశం లేదని చాలా మంది అనుకున్నారు. అభిమానులే కాదు మాజీ ఆటగాళ్లు సైతం ఇలాగే భావించారు. అయితే ఊహించని విధంగా సెలక్టర్లు ఏకంగా వైస్ కెప్టెన్ నే పక్కన పెట్టారు. శుభమన్ గిల్ (Shubman Gill)కు టీ20 జట్టులో ప్లేస్ కూడా ఇవ్వలేదు. ఒకవిధంగా చాలా మందికి ఈ నిర్ణయం షాకిచ్చిందనే చెప్పాలి.

ఎందుకంటే అతను వైస్ కెప్టెన్, పైగా కోచ్ గంభీర్ కు శిష్యుడు, చీఫ్ సెలక్టర్ అగార్కర్ కు సైతం గిల్ పై సానుకూలంగానే ఉన్నాడు. అలాంటిది గిల్(Shubman Gill) ను తీసేయడానికి ఎవరు కారణమనే చర్చ కూడా జరుగుతోంది. ఒక జర్నలిస్ట్ తనకున్న సమాచారం మేరకు కొన్ని కీలక విషయాలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు సమావేశం జరిగినప్పుడు గిల్ ప్లేస్ చాలా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

చీఫ్ సెలక్టర్ అగార్కర్, కోచ్ గంభీర్ టీ20 జట్టులో గిల్(Shubman Gill) ను కొనసాగించాలని నిర్ణయించారు. అయితే సెలక్షన్ కమిటీలో ఆర్పీ సింగ్, ప్రగ్యాన్ ఓజాతో పాటు మరో సెలక్టర్ మాత్రం వ్యతిరేకించారు. కోచ్ గంభీర్ గట్టిగా పట్టుబట్టినా కూడా మెజార్టీ సెలక్టర్ల అభిప్రాయానికి తలొగ్గక తప్పలేదు. ఒకదశలో ఆర్పీ సింగ్, ఓజాలను ఒప్పించేందుకు అగార్కర్ ప్రయత్నించినా వారిద్దరూ గిల్ టీ20 గణాంకాలతో పాటు గిల్ బ్యాటింగ్ శైలి వంటి విషయాలను ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో గిల్ కు వరల్డ్ కప్ జట్టులో ప్లేస్ దక్కలేదు.

Shubman Gill
Shubman Gill

నిజానికి ఐపీఎల్ లో గిల్ (Shubman Gill)సక్సెస్ ఫుల్ బ్యాటర్ గానే ఉన్నాడు. అతను కెప్టెన్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్ కు ఎప్పటికప్పుడు అద్భుత ఆరంభాలను ఇస్తూనే ఉన్నాడు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం అతను వెనుకబడ్డాడనే చెప్పాలి. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నప్పుడు చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఒక్కటీ కనిపించలేదు. పైగా దూకుడుగా ఆడలేకపోవడం కూడా ప్రతికూలంగా మారింది. గిల్ ఆటను బెంచ్ కే పరిమితమైన మరో ఓపెనర్ సంజూ శాంసన్ తో పోల్చి చూసారు.

పవర్ ప్లేలో కూడా అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోవడం కూడా గిల్ కు మైనస్ గా మారింది. ఈ కారణాలతోనే మెగాటోర్నీకి అతన్ని తప్పించినట్టు అర్థమవుతోంది. వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కకపోవడంతో ఇప్పుడు గిల్ టీ20 ఫ్యూచర్ పై సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే అతన్ని బీసీసీఐ మూడు ఫార్మాట్లలోనూ సారథిగా చేయాలని భావించింది. అందుకే మెగాటోర్నీకి ముందు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. తీరా చూస్తే ఇప్పుడు జట్టులో ప్లేస్ కూడా లేకుండా పోయింది.

దీంతోనే అతని అంతర్జాతీయ టీ20 కెరీర్ గురించి చర్చ మొదలైంది. వరల్డ్ కప్ టీమ్ లో చోటు దక్కనంత మాత్రాన గిల్ టీ20 కెరీర్ ముగిసిందనుకుంటే అది పొరపాటే అవుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అతని వయసును దృష్టిలో ఉంచుకుంటే కమ్ బ్యాక్ ఇవ్వడం ఏమాత్రం కష్టం కాదని తేల్చేస్తున్నారు. ఏదో ఒక దశలో ప్రతీ ప్లేయర్ కూ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని , అంత మాత్రాన అతన్ని తీసిపారేయొద్దని చెబుతున్నారు.

నిజమే గిల్ రీఎంట్రీ ఇచ్చేందుకు ఐపీఎల్ రూపంలో మరో చక్కని అవకాశం ఎదురుచూస్తోంది. వచ్చే ఐపీఎల్ సీజన్ లో తన బ్యాటింగ్ లో కాస్త దూకుడు పెంచి మెరుపులు మెరిపిస్తే ప్రిన్స్ మళ్లీ టీమిండియా టీ20 టీమ్ లోకి వచ్చేయడం ఖాయం. ఏదేమైనా గిల్ ఇక్కడ నుంచి మరింత కాన్ఫిడెంట్ గా ముందుకెళ్లాలన్న గవాస్కర్ మాటలను అతను ఎలా తీసుకుంటాడో చూడాలి.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button