Deepfake:మీ ఫోటోలతో ఎవరైనా వీడియోలు సృష్టించారా? డీప్‌ఫేక్ వీడియోలను గుర్తించడం ఎలా?
Deepfake: ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని యాప్స్ ద్వారా సామాన్యులు కూడా డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించగలుగుతున్నారు.
Deepfake
సాంకేతికత ఎంతగా ఎదుగుతుందో, దాన్ని దుర్వినియోగం చేసే మార్గాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచాన్ని భయపెడుతున్న అతిపెద్ద ముప్పు ‘డీప్‌ఫేక్’ (Deepfake). ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఒక వ్యక్తి ముఖాన్ని మరొకరి శరీరానికి తగిలించడం లేదా ఒకరి గొంతును అచ్చుగుద్దినట్లుగా అనుకరించడాన్నే డీప్‌ఫేక్ అంటారు.
గతంలో ఇలాంటి మార్పులు చేయాలంటే పెద్ద పెద్ద స్టూడియోలు, నిపుణులు ఉండేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని యాప్స్ ద్వారా సామాన్యులు కూడా ఇలాంటి వీడియోలు సృష్టించగలుగుతున్నారు. ఇది వినోదం కోసం మొదలైనప్పటికీ, ఇప్పుడు రాజకీయ కుట్రలకు, సెలబ్రిటీల పరువు తీయడానికి మరియు సామాన్యులను బ్లాక్ మెయిల్ చేయడానికి ఒక మారణాయుధంలా మారింది.
డీప్‌ఫేక్(Deepfake) టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే.. మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఒక వ్యక్తికి సంబంధించిన వేలకొద్దీ ఫోటోలను, వీడియోలను విశ్లేషిస్తుంది. ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతారు, కళ్ళు ఎలా ఆడిస్తారు, నవ్వినప్పుడు ముఖ కవళికలు ఎలా మారుతాయి అనే ప్రతి చిన్న విషయాన్ని ఏఐ నేర్చుకుంటుంది. ఆ తర్వాత మరొక వ్యక్తి చేసే కదలికలకు ఈ డేటాను జోడిస్తుంది. ఫలితంగా వచ్చే వీడియో ఎంత సహజంగా ఉంటుందంటే, అది నిజమో అబద్ధమో కనిపెట్టడం నిపుణులకు కూడా కష్టమవుతుంది. ఇటీవల ప్రముఖ నటీమణులు రష్మిక మందన్న, కత్రినా కైఫ్ వంటి వారు ఈ డీప్‌ఫేక్ బాధితులుగా మారడం మనం చూశాం. కేవలం ముఖం మాత్రమే కాదు, వాయిస్ క్లోనింగ్ ద్వారా మీ బంధువులు లేదా స్నేహితులు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నట్లుగా కూడా మోసగాళ్లు క్రియేట్ చేస్తున్నారు.

డీప్‌ఫేక్ (Deepfake)వీడియోలను గుర్తించడం కష్టమే కానీ అసాధ్యం కాదు. మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని లూప్‌హోల్స్ దొరుకుతాయి. ఉదాహరణకు, డీప్‌ఫేక్ వీడియోలలో వ్యక్తులు కనురెప్పలు వేయడం చాలా అరుదుగా ఉంటుంది. ముఖం మరియు మెడ భాగంలో చర్మం రంగు సరిపోకపోవడం, పెదవుల కదలికలకు మాటలకు మధ్య చిన్న తేడా ఉండటం, కళ్ళలో వెలుతురు ప్రతిబింబం (Reflections) సరిగ్గా లేకపోవడం వంటివి గమనించాలి. సోషల్ మీడియాలో ఏదైనా సంచలన వీడియో వచ్చినప్పుడు దాన్ని వెంటనే నమ్మేయకుండా, దాని మూలాలు ఎక్కడ ఉన్నాయో సరిచూసుకోవాలి. ముఖ్యంగా అనుమానాస్పదంగా అనిపించే వీడియోలను ఇతరులకు ఫార్వర్డ్ చేయకుండా ఉండటమే మనం చేసే అతిపెద్ద సహాయం.
మన ప్రైవసీని కాపాడుకోవడానికి కొన్ని నియమాలు పాటించాలి. సోషల్ మీడియా అకౌంట్స్‌ను ప్రైవేట్‌లో ఉంచుకోవడం, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌ను లిఫ్ట్ చేయకపోవడం మరియు మన వ్యక్తిగత ఫోటోలను పబ్లిక్‌గా షేర్ చేయకపోవడం మంచిది. ఏఐ డీప్‌ఫేక్స్ వల్ల ఏర్పడే సైబర్ నేరాలపై మన దేశంలో కఠినమైన చట్టాలు వస్తున్నాయి. ఎవరైనా డీప్‌ఫేక్ బాధితులుగా మారితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి లేదా ‘Cybercrime.gov.in’ లో రిపోర్ట్ చేయాలి. టెక్నాలజీ అనేది ఒక కత్తి లాంటిది, దాన్ని ఎలా వాడుతున్నాం అనే దానిపైనే మన భద్రత ఆధారపడి ఉంటుంది.
ముగింపుగా చెప్పాలంటే, మనం చూసే ప్రతిదీ నిజం కాదు, మనం వినే ప్రతిదీ వాస్తవం కాదు. డిజిటల్ ప్రపంచంలో కళ్ళను కూడా మోసం చేసే మాయాజాలం డీప్‌ఫేక్. అవగాహన మాత్రమే దీనికి విరుగుడు. టెక్నాలజీని వాడుకుందాం కానీ దాని బారిన పడకుండా జాగ్రత్త పడదాం. ఈ డిజిటల్ యుగంలో మీ గుర్తింపును మీరే రక్షించుకోవాలి.



