Medaram: మేడారం వెళ్లే భక్తులకు అలర్ట్.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండి..
Medaram: ముఖ్యంగా డిసెంబర్ చివరి వారంలో వరుస శెలవులు రావడంతో మేడారం అడవి జనసందోహంగా మారింది.
Medaram
తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర(Medaram)కు సమయం దగ్గరపడుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మహా జాతర జరగనుంది. అయితే ఆ సమయంలో ఉండే విపరీతమైన రద్దీని తప్పించుకోవడానికి చాలామంది భక్తులు ఇప్పుడే మేడారం బాట పట్టారు.
ముఖ్యంగా డిసెంబర్ చివరి వారంలో వరుస శెలవులు రావడంతో మేడారం అడవి జనసందోహంగా మారింది.ఈ రద్దీ సంక్రాంతి వరకూ కూడా సాగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పుడు వెళ్లే భక్తులు కొన్ని కీలకమైన విషయాలను గమనించాలని అధికారులు చెబుతున్నారు.
జాతర సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా కోట్లాది మంది భక్తులు వస్తారు. అప్పుడు గంటల కొద్దీ చిన్నపిల్లలతో కలిసి క్యూ లైన్లలో నిలబడటం, ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కోవడం కంటే ఇప్పుడే అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడమే మంచిదని చాలామంది భావిస్తున్నారు. దీనివల్ల దర్శనం త్వరగా కావడమే కాకుండా.. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడానికి వెసులుబాటు ఉంటుందని భక్తులు అనుకుంటున్నారు.
నిజానికి మేడారం(Medaram) వెళ్లే భక్తుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మేడారం వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. ముఖ్యంగా పస్రా, తాడ్వాయి అడవి మార్గాల్లో ట్రాఫిక్ నిదానంగా సాగుతోంది. ఊహించని విధంగా హన్మకొండ వైపు నుంచి, ఇటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి కూడా భక్తులు భారీగానే తరలి వస్తున్నారు. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీ సాధారణ రోజుల కంటే ఐదింతలు పెరిగింది.

ప్రస్తుతం జాతర పనులు ఇంకా పూర్తిస్థాయిలో పూర్తి కాకపోవడంతో.. భక్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. స్నానఘట్టాల వద్ద నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో పాటు, రక్షణ చర్యలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.దీంతో పిల్లలతో వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
పోలీసులు అక్కడక్కడా గస్తీ నిర్వహిస్తున్నా.. వాహనాల సంఖ్య పెరగడంతో పార్కింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో అడవి మార్గంలో వాహనాలు నిలిపివేయడం ప్రమాదకరంగా మారనుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఈ ఏడాది చలిపులి చంపేస్తుంది దీనికితోడు అడవి ప్రాంతం కావడం వల్ల రాత్రి వేళల్లో చలి తీవ్రత ఇంకా ఎక్కువగా ఉంటుంది. చలి నుంచి రక్షణ పొందే దుస్తులు వెంట ఉంచుకోవడం మంచిది.
మేడారం (Medaram) వెళ్లేవారు తమ వెంట సరిపడా ఆహారం, మంచినీరు తీసుకెళ్తే అక్కడ ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఎందుకంటే అక్కడ ఇంకా పూర్తిస్థాయిలో హోటల్స్ ఏర్పాటు కాలేదు. అరకొరా ఉన్నా రద్దీ కారణంగా హోటళ్లలో నాణ్యత తక్కువగా ఉండే అవకాశం ఉంది.
అలాగే, అడవిలో ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు వంటివి పడేయకుండా పర్యావరణాన్ని కాపాడాలని అధికారులు కోరుతున్నారు. గద్దెల వద్ద మొక్కులు చెల్లించేటప్పుడు తోపులాట జరగకుండా వాలంటీర్ల సూచనలు పాటించాలని చెబుతున్నారు.
మేడారం వెళ్లే ప్రతి భక్తుడు భక్తితో పాటు బాధ్యతను కూడా గుర్తుంచుకోవాలి. అమ్మవార్ల దర్శనం ప్రశాంతంగా జరగాలంటే ముందస్తు ప్లాన్‌తో వెళ్లడం ఎంతో అవసరం. మీ ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుకుంటూ.. జై సమ్మక్క-సారలమ్మ!



