Maha Jatara:మేడారం మహాజాతరకు సర్వం సిద్ధం..
Maha Jatara: 450 సీసీ కెమెరాలు , 20 డ్రోన్లతో జాతర పరిసరాలను నిరంతరం కనిపెట్టుకుని ఉండేలా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
Maha Jatara
తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర(Maha Jatara) ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. సుమారు కోటి మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు అన్ని సౌకర్యాలు సిద్ధం చేశారు.
ఈసారి జాతరలో భద్రత , రద్దీ నియంత్రణ కోసం అత్యాధునిక ఏఐ సాంకేతికతను వాడుతున్నారు. సుమారు 13 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉండగా, 25 మంది ఐపీఎస్ అధికారులు వరకూ ఈ జాతరను పర్యవేక్షిస్తున్నారు. 450 సీసీ కెమెరాలు , 20 డ్రోన్లతో జాతర పరిసరాలను నిరంతరం కనిపెట్టుకుని ఉండేలా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
భక్తుల సౌకర్యార్థం ఈసారి గద్దెల ప్రాంగణాన్ని భారీగా విస్తరించారు. గతంలో ఒకేసారి 2000 మందికి మాత్రమే అవకాశం ఉండగా.. ఇప్పుడు పునర్నిర్మాణం వల్ల ఒకేసారి 9 వేల మంది వరకు అమ్మవార్లను దర్శించుకునే అవకాశం వస్తుంది. గద్దెలన్నీ ఒకే వరుసలోకి రావడంతో భక్తుల రాకపోకలు మరింత ఈజీ కానున్నాయి.
రవాణా పరంగా చూస్తే, మూడు లక్షల వాహనాలు వచ్చినా పార్క్ చేయడానికి వీలుగా 2 వేల ఎకరాల్లో 33 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు. ఆర్టీసీ కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో పాటు అదనంగా మరో 500 బస్సులను నడుపుతోంది. భక్తులకు సిగ్నల్ సమస్యలు రాకుండా బీఎస్ఎన్ఎల్ తాత్కాలికంగా 10 టవర్లను ఏర్పాటు చేసింది.

ఇటు మేడారానికి వెళ్లే మార్గాలను తెలంగాణ ప్రభుత్వం 39 చోట్ల అభివృద్ధి చేసింది. తాడ్వాయి, పస్రా వంటి ప్రాంతాల్లో రోడ్లను విస్తరించడంతో పాటు, జంపన్న వాగు వద్ద భక్తులు స్నానాలు చేయడానికి ఆధునిక సౌకర్యాలు కల్పించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా కొత్తగా సబ్ స్టేషన్లు , 259 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు.
భక్తులు తమ ప్రాంతాలను బట్టి ఏ రూట్‌లో వెళ్లాలో కూడా స్పష్టమైన సూచనలను ఎక్కడికక్కడ జారీ చేశారు. ముఖ్యంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు కూడా ప్రారంభం కావడం ఈసారి జాతరలో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. మొత్తంగా ఈ మహాజాతర(Maha Jatara)ను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పనిచేస్తోంది.
Bangladesh:బంగ్లాదేశ్‌కు ఐసీసీ గట్టి షాక్.. 240 కోట్ల భారీ నష్టంతో పాటు బంగ్లాకు ఏం జరగనుంది?



