Just TelanganaLatest News

Scrapping: కాలం చెల్లిన బండ్ల కథ..స్క్రాపింగ్ విధానంలో సవాళ్లు

Scrapping : కేంద్ర ప్రభుత్వ వాహన రవాణా చట్టం ప్రకారం, చాలా వాహనాల జీవితకాలం 15 ఏళ్లు. ఆ తర్వాత వాటిని కచ్చితంగా తుక్కుగా మార్చాల్సి ఉంటుంది.

Scrapping : హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతూ, కాలుష్యం కోరలు చాస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం, గ్రేటర్‌లో జనవరి నాటికి మొత్తం 84 లక్షల వాహనాలు ఉంటే, వాటిలో దాదాపు 24.40 లక్షలు కాలం చెల్లినవి ఉండగా ఈ ఇప్పుడు 25 లక్షలకు చేరి ఉంటుందని అంచనా. కేంద్ర ప్రభుత్వ వాహన రవాణా చట్టం ప్రకారం, చాలా వాహనాల జీవితకాలం 15 ఏళ్లు. ఆ తర్వాత వాటిని కచ్చితంగా తుక్కుగా మార్చాల్సి ఉంటుంది. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్ చేయడానికి డెడ్‌లైన్ దగ్గర పడుతుండటంతో ఈ అంశం ఇప్పుడు తెలంగాణలో ప్రాధాన్యత సంతరించుకుంది.

Scrapping

ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్క్రాపింగ్ కేంద్రాల్లో పాత వాహనాలను అప్పగించి, ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. ఈ సర్టిఫికెట్ చూపించి కొత్త వాహనం కొనుగోలు చేస్తే ప్రభుత్వం రాయితీలు అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం వాహనాలను తుక్కుగా మార్చేందుకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేసినా, ప్రజల నుంచి మాత్రం స్పందన అంతంత మాత్రంగానే ఉందనే చెప్పాలి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేవలం మూడు తుక్కు కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఒక స్క్రాపింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఇంకొకటి సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం, చందాపూర్ బొర్రగూడెం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉండగా..మరొకటి ఖమ్మం జిల్లాలోని మధిర ప్రాంతంలో స్థాపించారు.ఈ మూడు కేంద్రాల్లో, సిద్దిపేట జిల్లాలోని వర్గల్ ప్రాంతంలో ఉన్న కేంద్రం గత మార్చి నెలలోనే ప్రారంభమైంది. ఇప్పటివరకు ఈ కేంద్రంలో కేవలం 150 వాహనాలను మాత్రమే యజమానులు తుక్కు కింద అప్పగించారు.

పాత వాహనాన్ని స్క్రాప్ చేయడానికి ముందుగా.. తెలంగాణ రవాణా పోర్టల్‌లో సంబంధిత పత్రాలతో నమోదు చేయాలి. ఆ తర్వాత యజమాని స్వయంగా వాహనాన్ని తుక్కు కేంద్రానికి తీసుకువచ్చి అప్పగించాలి. వాహనం బరువును బట్టి కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు చెల్లిస్తామని నిర్వాహకులు తెలిపారు. వాహనం అప్పగించిన తర్వాత, దానికి సంబంధించిన డిపాజిట్ సర్టిఫికెట్‌ను అందిస్తారు. ఈ వివరాలను ఆర్టీఏ పోర్టల్‌లోనూ నమోదు చేస్తారు.

ఈ సర్టిఫికెట్‌తో కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే, ప్రభుత్వం రోడ్ ట్యాక్స్‌లో 20 శాతం లేదా రూ. 50 వేలు, ఏది ఎక్కువైతే ఆ డిస్కౌంట్ అందిస్తుంది. షోరూమ్ నిర్వాహకులు కూడా కొత్త వాహనంపై అదనంగా 5 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అయితే, ఇది సరిపోవడం లేదని చాలామంది భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు పన్నులపై 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి. తెలంగాణలోనూ ఈ రాయితీలను పెంచితే, కాలం చెల్లిన వాహనాలను రోడ్లపై నడపకుండా తుక్కు చేసేందుకు వినియోగదారులు మరింత ఆసక్తి చూపే అవకాశం ఉంటుందనేది మెజార్టీ వర్గాల అంచనా.

తెలంగాణ ప్రభుత్వం స్క్రాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినా, రోడ్లపై కాలం చెల్లిన వాహనాలు యథేచ్ఛగా తిరుగుతూనే ఉన్నాయి. ఇవి ప్రమాదకరమైన సల్ఫర్, కార్బన్‌మోనాక్సైడ్ వంటి కాలుష్య కారకాలను వెదజల్లి తీవ్ర వాయు కాలుష్యానికి, ప్రజల అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. 15 ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపై నడపడం చట్టరీత్యా నేరం. కాలుష్యాన్ని నియంత్రించడానికి, రహదారి భద్రతను మెరుగుపరచడానికి ఈ స్క్రాపింగ్ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button