CM Revanth Reddy: నిన్నటి వరకు ఒక లెక్క..రేపటి నుంచి ఒక లెక్క..ఇది సీఎం రేవంత్ రెడ్డి లెక్క
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలని, మహా కార్యాలు సాధించాలంటే సంకల్పం కావాలని పేర్కొన్నారు.
CM Revanth Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)రాష్ట్ర ప్రజలకు ‘ప్రజా పాలన విజయోత్సవ’ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ, సంచలనాత్మక సందేశాన్ని విడుదల చేశారు. ఇది కేవలం శుభాకాంక్షలే కాదు, తమ ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన ప్రగతిని, భవిష్యత్తు కోసం సిద్ధం చేసిన మహా విజన్‌ను ప్రజలకు వివరించే చారిత్రక ప్రకటన. ఈ సందేశం రాష్ట్ర రాజకీయాల్లోనే కాక, అభివృద్ధి ప్రణాళికల్లోనూ ఒక కొత్త మలుపునకు సంకేతం.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలని, మహా కార్యాలు సాధించాలంటే సంకల్పం కావాలని పేర్కొన్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రజలు తమ ఓటుతో తనకు ఆ ధైర్యాన్ని, గెలుపు సంకల్పాన్ని ఇచ్చి ఆశీర్వదించారని, అందుకు తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ రెండేళ్ల ప్రస్థానంలో, రాష్ట్రాని శిఖరాగ్రాన నిలబెట్టడానికి నిరంతరం శ్రమించామని సీఎం(CM Revanth Reddy) స్పష్టం చేశారు. ముఖ్యంగా, గత పాలనలో శిథిలాల కింద కొన ఊపిరితో ఉన్న యువ తరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశామని ప్రకటించారు. అలాగే, రుణభారంతో విరిగిన రైతులకు దన్నుగా నిలిచి, వ్యవసాయ రంగాన్ని దేశానికే ఆదర్శంగా మార్చామని పేర్కొన్నారు. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతు ఇచ్చి, వారిని అదానీ, అంబానీల స్థాయిలో వ్యాపార రంగంలో నిలబెట్టేందుకు కృషి చేశామన్నారు. బలహీన వర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పి, వర్గీకరణ ద్వారా మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేకూర్చామని వెల్లడించారు.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని తెలియజేస్తూ, చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రమని నమ్మి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశామన్నారు. అంతేకాక, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలకు శ్రీకారం చుట్టడం తమ ప్రభుత్వ విద్యారంగ సంకల్పానికి నిదర్శనమని తెలిపారు.
ప్రభుత్వం స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం అనే మూడు మూల సిద్ధాంతాలపై ముందుకు సాగుతోందని చెబుతూ, జన ఆకాంక్షల మేరకు ప్రజాకవి అందెశ్రీ రాసిన “జయ జయహే తెలంగాణ” గీతానికి అధికారిక గుర్తింపు ఇచ్చామని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన ఈ విధంగా గుర్తు చేశారు. సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే పథకాలు తమ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలని తెలిపారు.
అయితే, ఈ విజయాలతో సరిపెట్టుకోలేదని, భవిష్యత్తుపై లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే సందర్భం అయిన 2047 నాటికి తెలంగాణ ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనే ఒక ఉన్నతమైన విజన్‌కు తమ ప్రభుత్వం ప్రాణం పోసిందని వెల్లడించారు. గత పాలకులు కలలో కూడా ఊహించని విధంగా, ప్రపంచ వేదికపై #TelanganaRising రీ సౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
భారత దేశ గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశాం. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క. నిన్నటి వరకు ఒక లెక్క.. రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క అనే కీలక ప్రకటన చేశారు. ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలు ప్రపంచానికి తెలియజేయబోతున్నట్టు ఆయన స్పష్టంగా సూచించారు.
చివరిగా నిన్న, నేడు, రేపు.. మీ ఆశీర్వాదమే నా ఆయుధం. మీ ప్రేమాభిమానాలే నాకు సర్వం. మీ సహకారమే నాకు సమస్తం. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు… ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు… TELANGANA RISING కు తిరుగు లేదని పవర్ ఫుల్ మెసేజ్‌తో తమ సందేశాన్ని ముగించారు.
ఈ ట్వీట్ ద్వారా, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తమ ప్రభుత్వం కేవలం సంక్షేమంపైనే కాక, లాంగ్-టర్మ్ విజన్ (2047 లక్ష్యం) , గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి పెడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రేపటి గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధికి ఒక కొత్త దిశానిర్దేశం చేయబోతోందని ప్రజలు, పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



