Free schemes: శ్రీలంకలా మారుతున్నామా? ఉచిత పథకాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు – వెంకయ్య నాయుడు హెచ్చరిక
Free schemes: విద్య, వైద్యం వంటి కనీస మౌలిక అవసరాల విషయంలో తప్ప, మిగతా అన్ని రంగాల్లో ఉచితాల అవసరం లేదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు.
Free schemes
హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కళాశాలలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి వేడుకల సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఉచిత పథకాల(Free schemes)పై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
విద్య, వైద్యం వంటి కనీస మౌలిక అవసరాల విషయంలో తప్ప, మిగతా అన్ని రంగాల్లో ఉచితాల అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. “ఫ్రీ బస్సులు ఇవ్వమని ప్రజలు ఎవరైనా అడిగారా?” అని ప్రశ్నిస్తూ, ఉచితాల పేరుతో ప్రజలను పని చేయకుండా సోమరిపోతులుగా మార్చడం తగదని హెచ్చరించారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాలు ఇలాంటి ఉచిత పథకాల(Free schemes)ను అమలు చేయడం వల్ల దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, ప్రజలను ఆశ్రయితులుగా కాకుండా స్వయం సమృద్ధి గలవారుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు.
ఈ సందర్భంగా వాజ్పేయి సుపరిపాలనను గుర్తు చేసుకున్న వెంకయ్య నాయుడు, ప్రస్తుత రాజకీయ నాయకులకు కొన్ని విలువైన సూచనలు చేశారు. వాజ్పేయి జీవితం ఒక తెరిచిన పుస్తకమని, ఆయన ఎప్పుడూ దేశ ప్రయోజనాలకే ప్రథమ స్థానం ఇచ్చేవారని గుర్తు చేస్తూ, యువత మరియు నేటి తరం నాయకులు ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు కనుమరుగవుతున్నాయని, కేవలం తక్షణ రాజకీయ లాభాల కోసమే ఉచిత పథకాల(Free schemes)ను ఆశ్రయిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

పార్టీలు మారడం, పాత పార్టీలను దూషించడం వంటి సంస్కృతి సరికాదని, డబ్బు, కులం, ద్వేషం ప్రాతిపదికన రాజకీయాలు చేయడం దేశానికి ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఉచితాల కంటే నైపుణ్యాభివృద్ధి, శిక్షణ , విద్యా అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని ఎన్డీయే మిత్రపక్షాలకు ఒక రకమైన హెచ్చరిక జారీ చేశారు.
నిజమే వెంకయ్య నాయుడు చెప్పింది అక్షర సత్యాలు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయాల్లో ప్రభుత్వాలు కేవలం అధికారం కోసం ఓటర్లను ఉచిత పథకాల(Free schemes)కు అలవాటు చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతో, కొత్త ప్రభుత్వాలు కూడా అంతకంటే ఎక్కువ ఉచితాలను ప్రకటిస్తూ జనాలను సోమరిపోతులుగా మారుస్తున్నాయి.
దీనివల్ల ప్రజల్లో కష్టపడి పని చేసే తత్వం తగ్గిపోవడమే కాకుండా, పరిపాలన కంటే ఎవరు ఎక్కువ నగదు బదిలీలు చేస్తారు, ఎవరు ఎక్కువ ఉచిత పథకాలు ఇస్తున్నారు అనే అంశంపైనే ఓటర్ల మైండ్ సెట్ ఆధారపడి ఉంటోంది. ఇదే అంశాన్ని ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే అభివృద్ధి చెందిన దేశాలకు, మన దేశానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో ప్రభుత్వాలు ప్రజలకు నేరుగా నగదు పంపిణీ చేయడం కంటే మౌలిక వసతుల కల్పనపైనే ఎక్కువ దృష్టి పెడతాయి. అక్కడ నిరుద్యోగ భృతి వంటివి ఉన్నా.. అవి కేవలం అత్యవసర పరిస్థితుల్లో ఆదుకోవడానికే తప్ప, ఓట్ల కోసం ఇచ్చే తాయిలాలు కావు. సింగపూర్ వంటి దేశాలను గమనిస్తే, అక్కడ ఉచితాల కంటే తక్కువ ధరకే నాణ్యమైన విద్య, వైద్యం , నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రజలు సంపాదించుకునే స్థాయికి ఎదగాలని ఆ ప్రభుత్వాలు భావిస్తాయి.
కానీ వెనిజులా, శ్రీలంక వంటి దేశాలు కేవలం ఉచిత పథకాలతో ప్రజలను ఆకట్టుకోవాలని చూసి, చివరికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దివాళా తీశాయి. శ్రీలంకలో ఒకానొక దశలో విద్యుత్ కొనేందుకు, ఆహార పదార్థాలు దిగుమతి చేసుకునేందుకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడింది.
మన దేశంలో కూడా ఇలాంటి ఉచితాల సంస్కృతి పెరిగిపోతే, భవిష్యత్తులో మనం కూడా అలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వెంకయ్య నాయుడు చేసిన హెచ్చరికలు ఇవే చెబుతున్నాయి. ప్రభుత్వం ప్రజలను స్వయం సమృద్ధిగా మార్చాలే తప్ప, ప్రతిదానికీ ప్రభుత్వంపై ఆధారపడేలా చేయడం దేశాభివృద్ధికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు.



