Medigadda:దేశంలోనే అత్యంత ప్రమాదకర డ్యామ్‌గా మేడిగడ్డ..వేల కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరేనా?
Medigadda: శవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన లోపాలున్న (Category-1) మూడు ప్రమాదకర డ్యామ్‌ల జాబితాలో.. మేడిగడ్డ బ్యారేజీ మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించింది.
Medigadda
తెలంగాణ ప్రజల కలల ప్రాజెక్టు కాళేశ్వరం ఇప్పుడు ఒక చారిత్రాత్మక తప్పిదంగా మారబోతోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించిన వివరాలు ఇదే నిజం అన్న సంకేతాలనే ఇస్తున్నాయి. తాజాగా పార్లమెంట్ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ ..’డ్యామ్ సేఫ్టీ రిజిస్టర్-2025′ ప్రకారం, దేశవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన లోపాలున్న (Category-1) మూడు ప్రమాదకర డ్యామ్‌ల జాబితాలో.. మేడిగడ్డ(Medigadda) బ్యారేజీ మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించింది.
కేటగిరీ-1 కింద మేడిగడ్డ(Medigadda) బ్యారేజీని అత్యంత ప్రమాదకరమైనదిగా కేంద్రం గుర్తించింది. దీనివల్ల ఎప్పుడైనా ముప్పు వాటిల్లే అవకాశముందని, తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే భారీ నష్టం జరుగుతుందని కేంద్రం హెచ్చరించింది.
2023 అక్టోబర్‌లో పిల్లర్లు కుంగిపోవడం నుంచి మొదలైన ఈ ప్రాజెక్ట్ సంక్షోభం, 2025 వర్షాకాలం తర్వాత జరిగిన తనిఖీల్లో మరింత తీవ్రంగా ఉందని తేలింది. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని లోయర్ ఖజూరీ, జార్ఖండ్‌లోని బొకారో బ్యారేజీల కంటే కూడా మేడిగడ్డ పరిస్థితి మరీ దారుణంగా ఉందని కేంద్రం ప్రకటించడం తెలంగాణ రాజకీయాలలో హీట్ పుట్టిస్తోంది.
ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న ఆర్థిక భారం తెలంగాణను దశాబ్దాల పాటు వెంటాడేలా కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు సుమారు లక్ష కోట్ల రూపాయలు దాటినట్లు లెక్కలు ఉన్నాయి. వీటిలో కేంద్రం నేరుగా గ్రాంట్లు ఇవ్వలేదు.. మొత్తం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకుల నుంచి ఆఫ్ బడ్జెట్ అప్పుల (OBB) రూపంలోనే తీసుకొచ్చింది.
ఇప్పుడు ఈ నిర్మాణాలు దెబ్బతినడంతో, అటు అప్పులు తీర్చడం ఒక భారం కాగా.. ఇటు మరమ్మతులకు మళ్లీ నిధులు వెతకడం అంటే మరో పెద్ద సవాల్ అనే చెప్పాలి. పాత డ్యామ్‌ల పరిరక్షణ కోసం కేంద్రం చేపట్టిన డ్రిప్-2 (DRIP) పథకంలో తెలంగాణకు కేవలం రూ. 100 కోట్లను మాత్రమే కేటాయించారు. లక్షల కోట్ల ప్రాజెక్టు మరమ్మతులకు ఈ వంద కోట్లు ఎక్కడికి సరిపోతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. దీంతో ప్లానింగ్‌లో జరిగిన లోపాల వల్ల వేల కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరుగా మారినట్లు అయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అసలు ఇంత నిర్లక్ష్యం ఎందుకు జరిగింది? అనే కోణంలో విశ్లేషిస్తే, ఇంజనీరింగ్ కంటే రాజకీయ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోందన్న విషయం తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా ఇలాంటి నిర్మాణాలను చేపట్టే ముందు భూగర్భ పరిస్థితులపై లోతైన అధ్యయనం జరగాలి. కానీ మేడిగడ్డ విషయంలో డిజైన్ లోపాలు ఉన్నాయని, ఇసుక పునాదులపై కట్టిన నిర్మాణాన్ని సరిగ్గా అంచనా వేయలేదు. బ్యారేజీ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (NDSA) నివేదికలు స్పష్టం చేస్తున్నాయని గుర్తు చేస్తున్నారు.
పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడం (Piping) వంటి పెద్ద లోపాలను సకాలంలో గుర్తించకపోవడమే ఈ విపత్తుకు పెద్ద కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాంబే ఐఐటీ నిపుణుల సలహాతో, దాదాపు రూ. 5 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో పటిష్టమైన మరమ్మతులు చేపట్టాలని చూస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచిస్తున్నా, అంతిమంగా నష్టపోయేది మాత్రం పన్నులు కట్టే సామాన్య ప్రజలు , ఆయకట్టు రైతులు మాత్రమే అన్న కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
Sleep :రాత్రి నిద్రకు మందు కావాలా? గాఢ నిద్రను ప్రసాదించే అద్భుత ఖనిజం గురించి తెలుసుకోండి..



