MPTC, ZPTC: ముందు మున్సిపల్ ఎన్నికలు.. ఎంపీటీసీ,జెడ్పీటీసీలపై వెనకడుగు
MPTC, ZPTC: గ్రామీణ ప్రాంతంలో..బీఆర్ఎస్ పుంజుకుంటున్నట్లు సర్పంచ్ ఎన్నికల ఫలితాల ద్వాారా క్లారిటీ వచ్చేసింది.
MPTC, ZPTC
జూబ్లీహిల్స్ బైపోల్ విజయం తర్వాత తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ జోష్ లో ఉంది. అధికారంలో ఉండడంతో సహజంగానే ఉపఎన్నికను గెలుచుకుంది. ఇదే ఊపుతో స్థానిక ఎన్నికలకు సై అనేసింది. 90 శాతానికి పైగా తమ పార్టీ మద్ధతుదారులే గెలుస్తారనే నమ్మకంతో ఉన్నప్పటకీ.. బీఆర్ఎస్ అనూహ్య రీతిలో పుంజుకోవడం రేవంత్ సర్కారుకు ఇబ్బంది కలిగించే విషయమే. ఎందుకుంటే గులాబీ పార్టీ ఈ స్థాయిలో గెలుస్తుందని వాళ్లు అనుకోలేదు. మొదటి విడత ఎన్నికల్లో 67 శాతం ఫలితాలు కాంగ్రెస్ వైపే వచ్చాయి. అయితే ఇక్కడ నుంచే అసలు సిసలు ట్విస్టులు వెలుగుచూసాయి. రెండు, మూడు విడుతల్లో విపక్ష బీఆర్ఎస్ పార్టీ..మరింతగా పుంజుకోవడం కాంగ్రెస్ కు షాక్ తగిలినట్టయింది.
జుబ్లీహిల్స్ బైపోల్ విజయం, ఇప్పటి వరకూ అమలు చేసిన పథకాలతో ఈజీగా స్వీప్ చేసేస్తామని అనుకుంటే ఇలా జరగడం ఒకవిధంగా కాంగ్రెస్ కు మింగుడుపడడం లేదు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పలువురు సీనియర్ నేతలు, మంత్రులు కూడా పాల్గొన్నా చాలాచోట్ల ఆ ప్రభావం కనిపించకపోవడం ఆశ్చర్యపరిచింది. అయితే బీఆర్ఎస్ తరపున గెలిచిన వారంతా కాంగ్రెస్ లోకి వచ్చేలా తెరవెనుక పావులు కదుపుతోంది.
కానీ ఓవరాల్ గా మాత్రం 2,3 విడతల్లో తాము వెనుకబడడంపై కాంగ్రెస్ పునరాలోచనలో పడింది. ఫలితంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ(MPTC, ZPTC) ఎన్నికల విషయంలో వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం. నిజానికి పంచాయతీ ఎన్నికల్లో స్వీప్ చేస్తే వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెట్టేద్దామనుకున్న సీఎం రేవంత్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ప్లాన్ బిని అమలు చేసేందురు రెడీ అవుతోంది. ముందు మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.

గ్రామీణ ప్రాంతంలో..బీఆర్ఎస్ పుంజుకుంటున్నట్లు సర్పంచ్ ఎన్నికల ఫలితాల ద్వాారా క్లారిటీ వచ్చేసింది. ఈ కారణంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రస్తుతానికి వాయిదా వేసి పట్టణ ప్రాంతాలకుసంబంధించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అది కూడా మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
వృద్ధులకు పెన్షన్ పెంపు, రైతు భరోసా నిధులను మరోసారి విడుదల చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తే బాగుంటుందనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలోనే వ్యక్తమవుతోంది. ఈ లోపు అర్బన్ ప్రాంతానికి సంబంధించిన మున్సిపల్ ఎన్నికలను పూర్తిచేయాలని యోచిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్, మున్సిపల్ ఎన్నికల నిర్వహించి, అనంతరం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను మార్చి, ఏప్రిల్లో నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ సైతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానికి స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఈ ప్రచారం మరింత బలపడింది.



