Telangana : పింఛన్ల ప్రక్షాళన.. ఇకపై అది తప్పనిసరి
Telangana : అర్హులైన వృద్ధులు, లబ్ధిదారులకు మాత్రమే పింఛన్లు అందాలనే లక్ష్యంతో బోగస్ పింఛన్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.

Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. కేవలం అర్హులైన వృద్ధులు, లబ్ధిదారులకు మాత్రమే పింఛన్లు అందాలనే లక్ష్యంతో బోగస్ పింఛన్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఇందులో కీలక భాగంగా, ఇకపై పింఛన్ పొందే ప్రతి ఒక్కరికీ ఫేస్ రికగ్నిషన్ (Recognition is mandatory)విధానాన్ని తప్పనిసరి చేయనుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Telangana
బోగస్ పింఛన్లను అరికట్టడంతో పాటు, పంపిణీలో పారదర్శకతను పెంచడం కోసం, రాష్ట్రవ్యాప్తంగా జూలై 29 నుంచి పింఛన్ దారుల ఫేస్ రికగ్నిషన్ నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సెర్చ్ సంస్థ, డీఆర్‌డీవోలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
పింఛన్ల పంపిణీలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రాంచ్ పోస్టుమాస్టర్లకు ఈ ప్రక్రియలో అవసరమైన స్మార్ట్ ఫోన్లు, బయోమెట్రిక్ పరికరాలను పంపిణీ చేయాలని సూచించింది. ఒకవేళ ఈ పరికరాలు అందుబాటులో లేని పక్షంలో, పోస్టుమాస్టర్లు తమ స్వంత స్మార్ట్‌ఫోన్ల ద్వారానే ప్రత్యేక యాప్‌ను ఉపయోగించి ఫేస్ రికగ్నిషన్ నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ నూతన విధానం పూర్తిగా అమలులోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీసుల్లో ‘చేయూత’ లబ్ధిదారుల వివరాలను బోర్డులపై ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ద్వారా మరణించిన వ్యక్తుల పేర్లపై పింఛన్లు పొందే అక్రమాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని అధికారులు విశ్వసిస్తున్నారు. ఇది ప్రభుత్వ నిధులను ఆదా చేయడంతో పాటు, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేకూరుస్తుంది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం(Telangana )లో మొత్తం 42.67 లక్షల మంది వివిధ కేటగిరీల కింద పింఛన్లు పొందుతున్నారు. వీరి కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.14,628.91 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ప్రతినెలా సుమారు రూ.1000 కోట్లకు పైగా పింఛన్ల పంపిణీ కోసం ఖర్చవుతోంది. దీనిలో 53 శాతం అంటే 22.72 లక్షలమందికి పోస్టల్ శాఖ ద్వారా బయోమెట్రిక్ విధానం (వేలిముద్రల ద్వారా), అలాగే 19.95 లక్షలమందికి బ్యాంకుల ద్వారా 47 శాతం పింఛన్ల(Pension) పంపిణీ జరుగుతోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న వేలిముద్రల ఆధారిత బయోమెట్రిక్ విధానంలో వృద్ధులు తరచుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వయసు పైబడటం వల్ల వారి వేలిముద్రలు సరిగ్గా పడకపోవడంతో ప్రతినెలా పింఛన్ పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తీసుకువస్తున్న ఫేస్ రికగ్నిషన్ విధానం వల్ల ఈ సమస్యలన్నీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ముఖ గుర్తింపు సాంకేతికత మరింత కచ్చితత్వంతో ఉండటంతో వృద్ధులకు పంపిణీ ప్రక్రియ సులభతరం అవుతుందని భావిస్తున్నారు.
అదేవిధంగా, మరణించిన లబ్ధిదారుల పేర్లను సకాలంలో తొలగించకపోవడం వల్ల కూడా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోందని ప్రభుత్వం గుర్తించింది. ఫేస్ రికగ్నిషన్ వల్ల ఇలాంటి అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారిని వివిధ కేటగిరీలుగా వర్గీకరించారు: వృద్ధాప్య పింఛన్లు – 15.25 లక్షలు, వితంతువులు – 15.26 లక్షలు, దివ్యాంగులు – 4.92 లక్షలు, బీడీ కార్మికులు – 4.23 లక్షలు, ఒంటరి మహిళలు – 1.41 లక్షలు, గీత కార్మికులు – 63 వేల మంది, చేనేత కార్మికులు – 36 వేల మంది, హెచ్‌ఐవీ బాధితులు – 35 వేల మంది, ఫైలేరియా బాధితులు – 18 వేల మంది, డయాలసిస్ రోగులు – 8 వేల మంది, బీడీ టేకేదార్లు – 4 వేల మంది సామాజిక కేటగిరీల వారీగా చూస్తే: బీసీలు – 23.39 లక్షలు, ఎస్సీలు – 6.76 లక్షలు, ఎస్టీలు – 3.47 లక్షలు, మైనార్టీలు – 2.84 లక్షలు, ఓసీలు – 6.21 లక్షలు మంది ఉన్నారు.
మహిళా లబ్ధిదారుల సంఖ్య 28.05 లక్షలు కాగా, కొత్తగా దాఖలైన పింఛన్ దరఖాస్తులు ఏకంగా 24.84 లక్షలు ఉన్నట్లు సమాచారం. ఈ కొత్త దరఖాస్తులకు కూడా ప్రభుత్వం అనుమతి ఇస్తే, రాష్ట్రంలో పింఛన్ లబ్ధిదారుల మొత్తం సంఖ్య 69 లక్షలకు చేరవచ్చని అంచనా. ఈ నేపథ్యంలో ఫేస్ రికగ్నిషన్ విధానం పంపిణీలో పారదర్శకతకు అత్యంత కీలకం కానుంది.