Just TelanganaLatest News

Telangana:రూ. 3.5 లక్షల కోట్ల అప్పు: తెలంగాణ ఆర్థిక స్థితిపై ప్రశ్నలు

Telangana:మిగులు బడ్జెట్‌తో పుట్టిన తెలంగాణ, ఇప్పుడు ఈ అప్పులను నియంత్రిస్తూనే అభివృద్ధిని కొనసాగించడం అనే అతిపెద్ద సవాలును ఎదుర్కొంటోంది.

Telangana

తెలంగాణ(Telangana).. మిగులు బడ్జెట్‌తో మొదలై, దశాబ్ద కాలంలోనే భారీ అప్పుల ఊబిలో చిక్కుకుందా? ఇది గత పాలకుల పాపమా? లేక అభివృద్ధికి తప్పనిసరి అయిన భారామా? ఒకప్పుడు ఆర్థిక స్వయం సమృద్ధికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం, ఇప్పుడు ఖజానా ఖాళీ అంటూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్రంగా మారింది. సీఎం రేవంత్‌ రెడ్డి లంకె బిందెలు ఆశించి వస్తే ఖాళీ బిందెలు కనిపించాయని ఆరోపించడం ఈ వాదనకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో, 2024 మార్చి 31 నాటికి తెలంగాణ (Telangana)అప్పులు రూ.3,50,520.39 కోట్లకు చేరాయని కేంద్రం వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.

2014లో తెలంగాణ(Telangana) రాష్ట్రం ఏర్పడినప్పుడు, మొదటి బడ్జెట్‌ను మిగులు బడ్జెట్‌గా ప్రవేశపెట్టి, “ఆర్థికంగా స్వయం సమృద్ధి” అనే లక్ష్యంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే పదేళ్ల తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు (2014-15 ఆర్థిక సంవత్సరం) మొత్తం అప్పులు కేవలం రూ.69,603.87 కోట్లు మాత్రమే ఉండేవి. కానీ 2024 మార్చి 31 నాటికి ఈ అప్పులు రూ.3,50,520.39 కోట్లకు చేరాయి. అంటే పదేళ్లలో దాదాపు రూ.3.14 లక్షల కోట్ల అదనపు అప్పుల భారం పెరిగిందని ఈ నివేదిక చెబుతోంది. ఈ అప్పుల పెరుగుదలలో ఎక్కువ భాగం గత పాలకపక్షమైన బీఆర్ఎస్ హయాంలోనే నమోదైంది.

అయితే, ఈ కాలంలో రాష్ట్ర ఆస్తులు కూడా గణనీయంగా పెరిగాయి. 2014-15లో ఆస్తుల విలువ రూ.83,142.68 కోట్లు ఉండగా, 2023-24 నాటికి అది రూ.4,15,099.69 కోట్లకు పెరిగింది. ఈ ఆస్తుల పెరుగుదలకు ప్రధానంగా మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్యామ్‌లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల వంటి అభివృద్ధి పనులు కారణమని భావిస్తున్నారు. కానీ ఈ ఆస్తుల సృష్టి వెనుక ఉన్న అప్పుల భారం, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్‌ను తీవ్రంగా విమర్శిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం అప్పుల బెంబేలెత్తు స్థితిలో ఉంది. బీఆర్ఎస్ పాలనలో ఖాళీ ఖజానా మిగిలింది, అందుకే పథకాలు ఆలస్యం అవుతున్నాయని పదే పదే ఆరోపిస్తున్నారు. దీనికి సమాధానంగా, బీఆర్ఎస్ పార్టీ అప్పులు తీసింది అభివృద్ధి కోసం, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల రూపంలో ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆస్తుల విలువ పెరగడమే రాష్ట్ర వృద్ధికి సాక్ష్యం అని వాదిస్తోంది.

Telangana
Telangana

ఈ భారీ అప్పుల భారం ఆందోళన కలిగించడానికి కారణాలు ఉన్నాయి. అప్పుల నిష్పత్తి Gross State Domestic Product (GSDP) లో అధికమైతే, అది పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. అలాగే, భారీగా పెరిగిన వడ్డీ చెల్లింపులు, రుణాల రీ-పేమెంట్ వంటి బాధ్యతలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అభివృద్ధి ప్రాజెక్టులకు ఖర్చు అవసరమే అయినప్పటికీ, వాటి ద్వారా రాబడులు సరైన వేగంతో రాకపోతే ఆర్థిక లోటు పెరిగిపోయే ప్రమాదం ఉంది.

ఈ సవాలును అధిగమించడానికి ఆర్థిక నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆదాయ వనరులు పెంచడం, పన్నుల ఆధారాన్ని విస్తరించడం, అవసరం లేని ఖర్చులను తగ్గించడం, పథకాల ప్రాధాన్యతను సమీక్షించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే, అప్పుల నిర్వహణలో భాగంగా చెల్లింపుల షెడ్యూల్‌ను పునర్వ్యవస్థీకరించడం, తక్కువ వడ్డీ రుణాలను ఎంచుకోవడం ముఖ్యం. ఇప్పటికే సిద్ధమైన మౌలిక సదుపాయాలను రెవెన్యూ తెచ్చే మార్గాలుగా మార్చుకోవడం కూడా అవసరం. మిగులు బడ్జెట్‌తో పుట్టిన తెలంగాణ, ఇప్పుడు ఈ అప్పులను నియంత్రిస్తూనే అభివృద్ధిని కొనసాగించడం అనే అతిపెద్ద సవాలును ఎదుర్కొంటోంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button