Just TelanganaJust Andhra Pradesh

IVF : అమ్మతనంపై అపవిత్ర వ్యాపారం..

IVF : అమ్మతనం కావాలనుకునే వారి ఆశ ఇప్పుడు కొంతమందికి ఆయుధంగా మారుతోంది.

IVF : అమ్మతనం కావాలనుకునే వారి ఆశ ఇప్పుడు కొంతమందికి ఆయుధంగా మారుతోంది. అమ్మ అనే పిలుపుకోసం పరితపించే ఆ ఆరాటం..వారికి వ్యాపారంగా పనికొస్తుంది. హైదరాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌(Srishti Test Tube Baby Center)లో జరిగిన ఇలాంటి దారుణమే ఇప్పుడు సామాన్యులను కలచివేస్తోంది. సంతానం కోసం ఎన్నో ఆశలతో వచ్చిన దంపతుల జీవితాలతో ఆడుకున్న ఈ ఘటన, తల్లిదండ్రులు కావాలనుకునే వారి నమ్మకాన్ని నిలువునా చీల్చేస్తోంది.

IVF

సంతానం లేని ఓ మహిళ తన భర్త వీర్య కణాలతో ఐవీఎఫ్ (IVF) ద్వారా బిడ్డను కనాలని సృష్టి సెంటర్‌ను ఆశ్రయించింది. అయితే, నైతిక విలువలను తుంగలో తొక్కి, సెంటర్ నిర్వాహకులు ఆమె భర్త వీర్య కణాలకు బదులు, మరో వ్యక్తి వీర్యాన్ని ఉపయోగించి శిశువును జన్మించేలా చేశారు. ఈ అక్రమ పద్ధతి ద్వారా పుట్టిన ఆ పసికందుకు క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో, ఆ దంపతులకు అనుమానం మొదలైంది.

వెంటనే DNA పరీక్షలు చేయించగా, శిశువు డీఎన్ఏ (DNA) తన భర్త డీఎన్ఏతో అస్సలు సరిపోలలేదని షాకింగ్ నిజం బయటపడింది. దీంతో, సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ చేసిన ఘోర మోసం రట్టయింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో గోపాలపురం పోలీసులు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ల్యాబ్‌లో ఉన్న ఎన్నో టెస్ట్ కిట్ శాంపిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను మరో నలుగురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కు హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌తో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ బ్రాంచ్‌లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టగా, సరోగసీ (అద్దె గర్భం) పేరుతో భారీ ఎత్తున వీర్య కణాలను అక్రమంగా నిల్వ చేసినట్లు, ఇంకా చట్టవిరుద్ధ పద్ధతుల్లో వీర్య సేకరణ జరిగినట్లు గుర్తించారు. ఇది కేవలం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు మాత్రమే కాదు. గతంలో కూడా ఇలాంటి దారుణాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

విశాఖపట్నం – యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ (2020): 2020లో విశాఖపట్నంలోని ‘యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ అండ్ రీసెర్చ్ సెంటర్’ (సృష్టి హాస్పిటల్ పేరు మార్చుకున్న తర్వాత)పై పోలీసులు దాడులు చేశారు. శిశువుల అక్రమ రవాణా (చైల్డ్ ట్రాఫికింగ్) కేసులో ఇది భాగమని తేలింది. ఈ సెంటర్ ICMR నిబంధనలను పాటించకుండా IVF ఉల్లంఘనలకు పాల్పడిందని గుర్తించారు.

హైదరాబాద్ – సాయికిరణ్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్ (2017): 2017లో హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ‘సాయికిరణ్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్’‌లో భారీ సరోగసీ స్కాంను పోలీసులు బయటపెట్టారు. దాదాపు 46 మంది మహిళలను సరోగసీ తల్లులుగా క్లినిక్ లోపల బంధించి ఉంచారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

గురుగ్రామ్ (హర్యానా) – ఫర్టిలిటీ క్యూర్ సెంటర్ (2025): ఇటీవలే గురుగ్రామ్‌లో ‘ఫర్టిలిటీ క్యూర్ సెంటర్’ పేరుతో నడుస్తున్న ఒక అక్రమ ఐవీఎఫ్ కేంద్రాన్ని గుర్తించారు. ఇది అక్రమంగా సరోగసీ రాకెట్ నిర్వహిస్తున్నారని, భారత్, చైనా, ఆస్ట్రేలియా దేశాల నుంచి సంతానం లేని దంపతులను లక్ష్యంగా చేసుకున్నారని తేలింది. తనిఖీల్లో 84 ఫ్రోజెన్ పిండాలను స్వాధీనం చేసుకున్నారు.

జలంధర్ (పంజాబ్) – వర్ధన్ మెడికల్ సెంటర్ (2010): జలంధర్‌లోని ‘వర్ధన్ మెడికల్ సెంటర్’ పై ఎన్‌ఆర్‌ఐ దంపతులు ఫిర్యాదు చేశారు. ఐవీఎఫ్ ద్వారా మగబిడ్డను ఇస్తామని రూ. 5 లక్షలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపణలున్నాయి. చివరికి మహిళకు ఆడబిడ్డ జన్మించడంతో ఈ మోసం బయటపడింది.

బెంగళూరు (కర్ణాటక) – శిశువుల అక్రమ రవాణా (2023): బెంగళూరులో ఐవీఎఫ్ క్లినిక్‌ల మాజీ ఏజెంట్లు, ఇద్దరు నర్సులతో కూడిన ఒక ముఠా నవజాత శిశువులను అక్రమంగా అమ్ముతున్నట్లు పోలీసులు అరెస్టు చేశారు. కనీసం పది మంది పిల్లలను విక్రయించినట్లు ఆధారాలు లభించగా, 50కి పైగా పిల్లలను అక్రమ రవాణా చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కొన్ని ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు కూడా ఇందులో భాగమయ్యారని పోలీసులు గుర్తించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button