liquor scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ కనెక్షన్.. అసలేం జరుగుతోంది?
liquor scam : ఈ కేసు ఊహించని మలుపు తిరుగుతూ..ఒక భారీ నగదు పట్టివేత, కొన్ని రహస్య సమావేశాలు, ప్రముఖ సంస్థల ఆరా.. ఇదంతా సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తోంది.

liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్.. పేరుకు ఆంధ్రప్రదేశ్ కుంభకోణం కానీ, దాని తీగ లాగితే తెలంగాణ డొంక కదిలినట్లు అవుతుందని ఎప్పుడో అనుకున్నారు. ఇప్పుడు అదే నిజమవుతోంది.ఇంకా చెప్పాలంటే తాజాగా, ఈ కేసు ఊహించని మలుపు తిరుగుతూ..ఒక భారీ నగదు పట్టివేత, కొన్ని రహస్య సమావేశాలు, ప్రముఖ సంస్థల ఆరా.. ఇదంతా సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తోంది.
liquor scam
రంగారెడ్డి (Ranga Reddy)జిల్లాలోని కాచారంలో, ఏపీ సిట్ అధికారులు చేపట్టిన సోదాల్లో ఏకంగా రూ.11 కోట్ల కట్టలు బయటపడ్డాయి. సులోచన ఫామ్‌హౌస్‌లోని 12 బాక్సుల్లో ఈ డబ్బును దాచి ఉంచినట్లు గుర్తించారు. ఇది అక్షరాలా కళ్లు బైర్లు కమ్మే దృశ్యం. కేసులో A40 నిందితుడు వరుణ్ ఇచ్చిన సమాచారంతోనే సిట్ బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. A1 నిందితుడు రాజ్ కేసిరెడ్డి (Raj K.C. Reddy)ఆదేశాలతోనే 2024 జూన్‌లో ఈ భారీ నగదును ఫామ్‌హౌస్‌కు తరలించినట్లు వరుణ్, చాణక్య అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫామ్‌హౌస్ ప్రొఫెసర్ తగల బాల్‌రెడ్డి పేరు మీద ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరి ఈ నగదు దేని కోసం? ఎక్కడి నుంచి వచ్చింది? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ఒక యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కీలక సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన బాలాజీ గోవిందప్ప డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్స్ కార్యాలయాల్లో అనువణువూ గాలించారు. ఈ స్కామ్ భారతి సిమెంట్స్ కేంద్రంగానే నడిచి ఉండవచ్చనే అనుమానాలతో, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో పలు కీలక డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకుని లోతుగా అధ్యయనం చేస్తున్నారు.
ఇదే క్రమంలో, A1 నిందితుడు కేసిరెడ్డికి చెందిన రీసోర్స్ వన్ కంపెనీలోనూ సిట్ అధికారులు తమదైన శైలిలో సోదాలు చేశారు. అరెస్టైన మరో కీలక వ్యక్తి చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్‌ను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సోదాల ద్వారా, నిందితులకు చెందిన సంస్థల్లో అక్రమ లావాదేవీల చిట్టాలను వెలికితీయడమే కాకుండా, ఎవరెవరు ఎక్కడ, ఎన్నిసార్లు రహస్యంగా సమావేశమయ్యారు అనే అంశాలపై కూడా అధికారులు తీవ్రంగా ఆరా తీస్తున్నారు.
లిక్కర్ స్కామ్(liquor scam)లో A47గా ఉన్న నెల్లూరుకు చెందిన ఆటోమొబైల్ ఇంజినీర్ షాజిల్ తాజాగా సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) రంగంలో పెట్టుబడుల కోసం కేసిరెడ్డే తనను సంప్రదించాడని ఆయన సిట్‌కు వివరించారు. అయితే, ఈ లిక్కర్ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని షాజిల్ బలంగా చెబుతున్నారు. ఆయన వాదనలో ఎంత నిజముందనేది దర్యాప్తులోనే తేలాలి.
మొత్తం మీద, ఈ లిక్కర్ స్కామ్ కేసు ఎటువైపు దారితీస్తుందనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా సాగుతోంది. “ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటినుంచి మరో లెక్క” అని వైసీపీ అధినేత జగన్ సంకేతాలు ఇవ్వడంతో, రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. టీడీపీ ‘రెడ్‌బుక్’ అంటూ పదునైన ఆరోపణలతో దూకుడుగా ఉంటే, వైసీపీ మాత్రం తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి ప్రత్యేక ‘యాప్’ ను తీసుకొస్తామని ప్రకటించి కౌంటర్ ఇస్తోంది. లిక్కర్ కేసులో వైసీపీ నేతలు జైలుకు వెళ్తారని టీడీపీ పదేపదే హెచ్చరిస్తుంటే, తమపై నమోదైన అక్రమ కేసులను దీటుగా ఎదుర్కొంటామని విపక్ష పార్టీ సవాల్ విసురుతోంది. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించడం ఖాయం.