Just Telangana

liquor scam : ఈ స్కాంలో కట్టుకథలు చెబుతుందెవరు?

liquor scam : ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది

liquor scam : ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సిట్ (SIT) రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫామ్‌హౌస్‌లో రూ.11 కోట్లు సీజ్ చేశామని ప్రకటించగా, ఈ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేసులో ఏ1 నిందితుడు రాజ్‌ కేసిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో ఓ కీలక అఫిడవిట్‌ దాఖలు చేశారు. సిట్ తనను ఇరికించేందుకు, బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు ‘కట్టుకథలు’ చెబుతోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

liquor scam

హైదరాబాద్‌లోని కాచారంలో గల సులోచన ఫామ్‌హౌస్‌లో సీజ్ చేశామని సిట్ చెబుతున్న రూ.11 కోట్ల నగదు తనది కాదని రాజ్‌ కె.సి.రెడ్డి తన అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. అంతేకాదు, ఆ ఫామ్‌హౌస్ కూడా తనకు చెందినది కాదని, అది తీగల విజయేందర్‌రెడ్డికి చెందిందని ఆయన కోర్టుకు తెలిపారు. విజయేందర్‌రెడ్డికి ఇంజనీరింగ్‌ కాలేజీతో పాటు హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లు ఉన్నాయని, ఆయన రూ.కోట్ల టర్నోవర్‌తో లావాదేవీలు నిర్వహిస్తారని రాజ్‌ కె.సి.రెడ్డి పేర్కొన్నారు.

తనకు విజయేందర్‌రెడ్డితో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని, కేవలం ఆయనకు చెందిన ఆరెట్‌ ఆసుపత్రిలో తన భార్య మైనారిటీ షేర్‌ హోల్డర్‌ మాత్రమేనని రాజ్‌ కె.సి.రెడ్డి కోర్టుకు వివరించారు. అంతకుమించి విజయేందర్‌రెడ్డితో తనకు వ్యాపారపరంగా గానీ, వ్యక్తిగతంగా గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.

రూ.11 కోట్ల పట్టివేత వ్యవహారం సిట్ కట్టుకథేనని రాజ్‌ కెసి రెడ్డి( Raj KC Reddy) బలంగా వాదించారు. “సిట్.. కట్టు కథలు చెప్పి నాకు బెయిల్‌ రాకుండా కుట్రలు చేస్తోంది. కేవలం నా బెయిల్‌ను అడ్డుకునేందుకే డబ్బులు సీజ్‌ అంటూ అబద్ధాలు చెబుతోంది” అని రాజ్‌ కె.సి రెడ్డి కోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో తనకు బెయిల్ రాకుండా అడ్డుకోవడమే సిట్ ప్రధాన లక్ష్యమని, అందుకోసమే ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపణలు గుప్పించారు.

కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచిన నేపథ్యంలో, రాజ్‌ కెసిరెడ్డి చేసిన ఈ ఆరోపణలు, అఫిడవిట్ దాఖలు చేయడం కేసును మరింత సంక్లిష్టం చేశాయి. సిట్ అధికారులు రాజ్‌ కె.సి.రెడ్డికి చెందిన రీసోర్స్ వన్ కంపెనీతో పాటు, బాలాజీ గోవిందప్ప డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్స్, చాణక్యకు చెందిన టీ గ్రిల్ రెస్టారెంట్‌లలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ సోదాల తర్వాత రూ.11 కోట్ల నగదు పట్టుబడటం, దానికి రాజ్‌ కెసి రెడ్డే బాధ్యుడని సిట్ ఆరోపించడంతో, ఇప్పుడు ఆయన తనపై వస్తున్న ఆరోపణలను బలంగా ఖండించారు ఈ వ్యవహారంతో లిక్కర్ స్కామ్ కేసులో ఒక కీలక మలుపుగా మారింది. ఇంతకీ ఎవరి ఆరోపణలు నిజం..ఈస్కాంలో ఎవరు కట్టుకథలు చెబుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button