Banakacherla : బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఎవరి వాదన కరెక్ట్?
Banakacherla: మరోవైపు ఈ ప్రాజెక్ట్ కేవలం నీటి సమస్య మాత్రమే కాదు, దీనికి బలమైన రాజకీయ కోణం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Banakacherla
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్ట్ చుట్టూ రాజకీయ ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఇది కొత్తగా మొదలైన గొడవ కాకపోయినా.. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల హాట్ టాపిక్స్‌తో పాత వివాదాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి.
అసలు ఈ వివాదం ఏమిటి, ఈ ప్రాజెక్ట్ వల్ల రెండు రాష్ట్రాలకు కలిగే లాభనష్టాలు ఎలా ఉన్నాయనే చర్చ వేడందుకుంది. నిజానికి బనకచర్ల ప్రాజెక్ట్ అనేది గోదావరి నదిలోని వరద నీటిని (surplus floodwater) కృష్ణా నది ద్వారా రాయలసీమ ప్రాంతానికి తరలించే ఒక భారీ నీటి ప్రాజెక్ట్.
ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక ప్రకారం, గోదావరి నుంచి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా నల్లమల అడవి పరిసరాల్లోని టన్నెల్స్, రిజర్వాయర్లు, లిఫ్ట్ స్టేషన్లు ఉపయోగించి ఈ నీటిని కృష్ణా నది మీదుగా బనకచర్ల వరకు తరలిస్తారు. చివరికి ఈ నీటిని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సాగునీటి అవసరాలకు ఉపయోగించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది.
రాయలసీమ ప్రాంతం నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ ప్రాంతం వర్షపాతంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. బనకచర్ల ప్రాజెక్ట్‌తో రాయలసీమలో సుమారు 12 లక్షల హెక్టార్ల పొలాలకు శాశ్వతంగా సాగునీరు అందుతుంది.
ఇది రాయలసీమ రైతుల జీవితాల్లో సంచలనాత్మక మార్పు తీసుకువస్తుందని, వలసలు తగ్గి ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూరుస్తుందని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. గోదావరి వరద నీటిని సముద్రంలోకి వృథాగా పోకుండా నిల్వ చేయడం కూడా ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెబుతోంది.
అయితే బనకచర్ల(Banakacherla) ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు లేకుండానే, తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండానే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది.
2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, ఇలాంటి అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు కృష్ణా-గోదావరి మేనేజ్‌మెంట్ బోర్డులు, సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) అనుమతి తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేస్తోంది.
తెలంగాణ ఇప్పటికే కృష్ణా నది జలాలపై ఆధారపడి అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించింది. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తమ నీటి వాటాలపై, ప్రాజెక్టుల భద్రతపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ ప్రాజెక్ట్(Banakacherla) నిబంధనలకు విరుద్ధమని, తెలంగాణ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టడం సమంజసం కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాదిస్తోంది.
మరోవైపు ఈ ప్రాజెక్ట్(Banakacherla) కేవలం నీటి సమస్య మాత్రమే కాదు, దీనికి బలమైన రాజకీయ కోణం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
రాయలసీమ ప్రాంతంలో తమ బలాన్ని పెంచుకోవడానికి టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఒక రాజకీయ అస్త్రంగా వాడుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో, తెలంగాణ ప్రభుత్వం తమ జలాల హక్కులపై రాజీ పడేది లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఏపీకి ఉంది.

అయితే బోర్డుల అనుమతి లేకుండా ముందుకు వెళ్లడం వల్ల ప్రాజెక్టు భవిష్యత్తుపై గందరగోళం నెలకొంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య అపనమ్మకానికి దారితీస్తోంది.
ఈ వివాదం పరిష్కారానికి కొన్ని మార్గాలు ఉన్నాయని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం తమ ప్రాజెక్ట్ వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని, కేవలం మిగులు నీటిని మాత్రమే వాడుకుంటున్నామని వాదిస్తోంది.
కానీ తెలంగాణ మాత్రం జలాల ప్రయోజనాలపై హామీ కావాలని, తమ వాటా నుంచి నీటి తరలింపు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తోంది.
ఈ వివాదాన్ని పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం, జాతీయ జల బోర్డులు, అవసరమైతే సుప్రీంకోర్టు నిర్ణయాలు కీలకం కానున్నాయి. రెండు రాష్ట్రాలకు నష్టాలు రాకుండా, పారదర్శకత, సమగ్ర సమావేశాల ద్వారానే ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా ఈ ‘జల’ రాజకీయాలు భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల సంబంధాలపై ఎలా ప్రభావం చూపిస్తాయన్నది మాత్రం వేచి చూడాలి.